Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

జేఎన్‌యూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

జుంటా డిమాండ్‌
న్యూదిల్లీ : దేశ రాజధాని దిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వ విద్యాలయం (జేఎన్‌యూ)లో కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల సమ్మెపై శనివారం జేఎన్‌యూటీఏ (జుంటా) ఆందోళన వ్యక్తం చేసింది. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి ‘న్యాయమైన డిమాండ్లు’ను అంగీకరించాలని విశ్వవిద్యాలయం పాలనా యంత్రాంగాన్ని కోరింది. జేఎన్‌యూ పారిశుధ్య, మెస్‌ కార్మికులు గత నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. మూడు నెలలుగా పెండిరగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, 26 రోజుల పని దినాలు కల్పించాలని, తొలగించిన కార్మికులను తిరిగి నియమించాలని, ప్రతినెలా ఏడో తేదీలోగా జీతాలు జమ చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, తాము కార్మికులను తొలగించలేదని జేఎన్‌యూ స్పష్టం చేసింది. ఈ విషయంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డీన్‌ సుధీర్‌ ప్రతాప్‌ సింగ్‌ను కోరింది. ‘జేఎన్‌యూ వీసీ, ఆమె పరిపాలన విభాగం ఏ కార్మికుడిని తొలగించలేదు. మెస్‌ కార్మికులందరినీ అలాగే ఉంచుతున్నారు. డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ను సవివరమైన నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది’ అని జేఎన్‌యూ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంది. కాగా కాంట్రాక్టు కార్మికుల పట్ల ‘వివక్షత, చట్టవిరుద్ధమైన చర్యలు’ మరింత దిగజారాయని, కొనసాగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి విశ్వవిద్యాలయ పాలనా యంత్రాంగం ఎటువంటి తీవ్రమైన ప్రయత్నాలు చేయలేదని, కొత్త పరిపాలనలో ‘అమానవీయ ప్రవర్తన’ నిరాటంకంగా కొనసాగడం చూసి ఆందోళన చెందుతున్నట్లు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (జేఎన్‌యూటీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. ‘కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 2021 వేసవి నెలల్లో మహమ్మారి అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు క్యాంపస్‌లోని వారికి నిస్వార్థంగా సేవ చేయడానికి తమ జీవితాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన కార్మికులను ఇది లక్ష్యంగా చేసుకుంటుంది’ అని జుంటా అధ్యక్ష, కార్శదర్శులు బిష్ణుప్రియా దత్‌, సుచరితా సేన్‌ విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల 7వ తేదీలోగా వేతనాలు చెల్లించాల్సిన వేతనాల చెల్లింపు చట్టాన్ని ఇది ఉల్లంఘించినప్పటికీ, కాంట్రాక్టర్‌ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై జేఎన్‌యూ పాలనా యంత్రాంగం పట్టించుకోనట్లు కనిపిస్తోందని ఆ ప్రకటన వివరించింది. 2020 నుంచి లాక్‌డౌన్‌ సమయంలో కార్మికుల సంఖ్యలో భారీగా కోత ఉందని జుంటా ఎత్తి చూపింది. చెత్త సేకరణ, పారవేసే పనిలో నిమగ్నమైన కార్మికుల ప్రస్తుత బలం 2020 ప్రారంభంలో 42 నుంచి 30కి తగ్గిందని తెలిపింది. ‘అయితే, క్యాంపస్‌ తిరిగి తెరిచిన తర్వాత కూడా పారిశుధ్యం, మెస్‌ కార్మికుల మొత్తం పనిభారానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచలేదు. హాస్టళ్లలో మెస్‌, పారిశుధ్య కార్మికులు పూర్తి స్థాయికి చేరుకున్నప్పటికీ వారిని మరింతగా తొలగించినట్లు నివేదికలు ఉన్నాయి’ అని వివరించింది. ‘కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని జేఎన్‌యూటీఏ వర్సిటీ పాలనా యంత్రాంగాన్ని కోరింది’ అని ఆ ప్రకటన పేర్కొంది. ఈ సందర్భంగా సుమారు 60 మంది కాంట్రాక్టు కార్మికులు స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డీన్‌ (డీవోఎస్‌) కార్యాలయానికి ప్రదర్శన నిర్వహించారు. అయితే డీవోఎస్‌ నుంచి కచ్చితమైన సమాధానం రాలేదని, కార్మికులకు మార్చి నెల జీతం మరికొద్ది రోజుల్లో జమ అవుతుందని చెప్పారని జేఎన్‌యూఎస్‌యూ కార్యదర్శి మధురిమ కుందు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img