Friday, March 31, 2023
Friday, March 31, 2023

బీజేపీతో రాజకీయ వ్యవస్థకు ముప్పు

మోదీ సర్కారును గద్దె దించాల్సిందే
ప్రతిపక్షాల ఐక్యత అవశ్యం
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం ఓటమి తథ్యం
రాష్ట్రాల అధికారాలు లాక్కుంటున్న కేంద్రం
2022 పోరాటాల సంవత్సరం
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

విశాలాంధ్ర`హైదరాబాద్‌: బీజేపీ అధికారంలో కొనసాగితే వామపక్ష పార్టీలకే కాకుండా రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడుతుందని, ఇది ఫాసిజానికి దారి తీస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా హెచ్చరించారు. జాతీయస్థాయిలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగీకృత అంశాలపై ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చేతులు కలపాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. మగ్దూంభవన్‌లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలనర్సింహాతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డి.రాజా మాట్లాడారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని డి.రాజా చెప్పారు. ఈ ఓటమి భవిష్యత్తు దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఓటమికి సంకేతాలు ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా వైఫల్యానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖదే బాధ్యత అని డి.రాజా అన్నారు. ప్రధాని భద్రతా వైఫల్యంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయని, వాటికి ప్రధాని కార్యాలయం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారత రాజ్యాంగం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటున్నదని, జీఎస్‌టీ అందుకు చక్కటి ఉదాహరణ అని రాజా చెప్పారు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాలను సంప్రదించకుండానే కార్పొరేట్‌ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు చేసిన తీర్మానాలను మోదీ సర్కారు పట్టించుకోలేదన్నారు. బీజేపీని ఓడిరచకపోతే భారత ఫెడరలిజానికి ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. 2022 సంవత్సరం బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల సంవత్సరంగా ఉండబోతున్నదని రాజా చెప్పారు. ఇప్పటికే రైతులు తమ సుదీర్ఘ పోరాటం ద్వారా మోదీ ప్రభుత్వాన్ని మోకాళ్లపై నిలబెట్టారని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు డిసెంబరులో సమ్మె చేశారని గుర్తు చేశారు. వచ్చే నెలలో కేంద్ర కార్మిక సంఘాలు సైతం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, లేబర్‌ కోడ్‌కు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాయని గుర్తుచేశారు.
అజీజ్‌ పాషా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 179 దేశాలలో అత్యంత మత వివక్ష చూపే పది దేశాల సరసన భారతదేశం చేరినట్లు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయని తెలిపారు. ఇటీవల హరిద్వార్‌ ధర్మసంసద్‌ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో వెంకయ్యనాయుడు, తదితర బీజేపీ ఎంపీలు 12 రోజులు పార్లమెంటు జరగకుండా అడ్డం పడినా వారిని సస్పెండ్‌ చేయలేదని, కానీ నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలపై వేటు వేయడాన్ని ఆయన గుర్తుచేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరింత ప్రజాస్వామికంగా పని చేయాలని హితవు పలికారు. పెండిరగ్‌ హామీలు అమలు చేసేందుకు పూనుకోవాలని సూచించారు. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని, ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వడంతోపాటు ఇంతకుముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జీవో 317 ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలలో నెలకొన్న గందరగోళంపై తక్షణమే ఉద్యోగ సంఘాలన్నిటితో కేసీఆర్‌ చర్చించి పరిష్కరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img