Tuesday, November 29, 2022
Tuesday, November 29, 2022

‘మహా’ బీజేపీ దుస్సాహసం..

12 మంది సభ్యుల సస్పెన్షన్‌కు నిరసనగా ప్యారలల్‌ సెషన్‌
మైకులు, లౌడ్‌స్పీకర్లతో సభ నిర్వహణ
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
అభ్యంతరం తెలిపిన అధికారపక్షం

ముంబై : మహారాష్ట్రలో బీజేపీ దుస్సాహాసానికి ఒడిగట్టింది. చట్టసభను అగౌరవపరిచేలా వ్యవహరించింది. తమ పార్టీకి చెందిన 12 మంది సభ్యులపై ఏడాది నిషేధానికి నిరసనగా అసెంబ్లీ ఆవరణలో ‘ప్యారలల్‌ సెషన్‌’ను మంగళవారం నిర్వహించింది. మైకులు, లౌడ్‌స్పీకర్లు పెట్టి సభ జరిపింది. కొవిడ్‌19 ఆంక్షలు అమల్లో ఉండగా విధానసభలోకి మాజీ శాసనసభ్యులు రావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని శాసనమండలి సభ్యులు ఖండిరచారు. ఈ వ్యవహారంలో సమగ్ర నివేదిక కోరారు. సభాపతి ఆదేశాలతో భద్రతా అధికారులు లౌడ్‌స్పీకర్లను స్వాధీనం చేసుకొని, బీజేపీ సభ్యులను అడ్డుకున్నారు. బయట మెట్లపై బైఠాయించిన బీజేపీ సభ్యులు.. ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ నిరసనకు ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వం వహించారు. ప్యారలల్‌ సెషన్‌ స్పీకర్‌గా కాళిదాస్‌ కొలంబకర్‌ వ్యవహరిస్తారని ఫడ్నవీస్‌ ప్రకటించారు. సభ నిర్వహించాలని ప్రతిపాదించారు. తప్పుడు ఆరోపణలతో తమ సభ్యులను సస్పెండ్‌ చేసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నానని, దీనిపై చర్చను చేపట్టాలని ‘ప్యారలల్‌’ సభికులను కోరుతున్నానన్నారు. మరోవైపు అసెంబ్లీ లోపల ఎన్సీపీ మంత్రి నవాజ్‌ మలిక్‌ మాట్లాడుతూ ప్రిసైడిరగ్‌ అధికారి భాస్కర్‌ జాదవ్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు వస్తుండటంతో ఆయనకు రక్షణ కల్పించాలని డిమాండు చేశారు. జాదవ్‌కు తగిన భద్రత కల్పిస్తామని రాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాజ్‌ పురోహిత్‌ రావత్‌ విధాన్‌భవన్‌ ఆవరణలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం, పత్రాలు పంచడం ఏమిటని ప్రశ్నించారు. సభాపతి అనుమతి లేకుండా బీజేపీ సభ్యులకు లౌడ్‌స్పీకర్లు ఎలా ఇస్తారని శివసేన శాసనసభ్యుడు సునీల్‌ ప్రభు నిలదీశారు. దీంతో లౌడ్‌ స్పీకర్ల వాడకానికి తాను అనుమతి ఇవ్వలేదని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని భద్రతా సిబ్బందికి డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ సూచించారు. శాసనసభ ఆవరణలో లౌడ్‌స్పీకర్లను అనుమతించిన భద్రతా అధికారులపై చర్చలు తీసుకోవాలని మంత్రులు సునీల్‌ కేదర్‌, ధనంజయ్‌ ముండె డిమాండు చేశారు. ప్యారలల్‌ విధానసభ ప్రత్యక్ష ప్రసారం అవుతోందని, ఇది సభకు అవమానకరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం పృధ్విరాజ్‌ చవాన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. స్పీకర్‌ స్థానంలో కూర్చున్న వెంటనే మైకులను సీజ్‌ చేసి, ప్యారలల్‌ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయాలని జాదవ్‌ ఆదేశాలు జారీచేశారు. చైర్‌ ఆదేశాల తర్వాత కూడా వార్తాఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కొనసాగినట్లు మలిక్‌ తెలిపారు. విధాన్‌భవన్‌ ఆవరణలోకి మాజీలు రావడం, వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయకపోవడంపై సభికులు ప్రశ్నలు లేవనెత్తారు. ప్యారలల్‌ సెషన్‌పై నివేదిక ఇవ్వాలన్నారు. వీరంతా ఆర్టీ`పీసీఆర్‌ టెస్టు చేయించుకున్నారా అన్నది కౌన్సిల్‌ చైర్మన్‌ నివేదిక ఇవ్వాలి, అలాగే తీసుకున్న చర్యలు ఏమిటో తెలపాలి అని ఎన్సీపీ ఎమ్మెల్యే శశికాంత పాటిల్‌ అన్నారు. ఇలాంటివి ప్రోత్సహిస్తే సభ ప్రతిష్టపై ప్రశ్నలు వస్తాయన్నారు. బీజేపీ సభ్యుల నినాదాలతో సభను 20 నిమిషాల వరకు మండలి చైర్మన్‌ నాయక్‌ నింబాల్కర్‌ వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు కాంగ్రెస్‌ సభ్యుడు జగతప్‌ మాట్లాడుతూ, సభ మర్యాదను బీజేపీ కించపరిచిందని అన్నారు. దీనిపై ప్రతిపక్ష మండలి సభ్యుడు ప్రవీణ్‌ దవేకర్‌ స్పందిస్తూ ప్రతిపక్ష గళాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖూనీ చేస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాగా, ఈ వ్యవహారంలో సమగ్ర నివేదిక సభకు ఇస్తామని మండలి చైర్మన్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img