Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చమురు ధరల నియంత్రణకు దేనికైనా సిద్ధమే!

పెట్రోలియం మంత్రి రామేశ్వర్‌ తేలి
న్యూదిల్లీ: అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలను చల్లబరిచేందుకు వ్యూహాత్మక నిల్వలను వినియోగించడం సహా తగిన చర్యలు తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు కేంద్రప్రభుత్వం గురువారం తెలిపింది. అమెరికా తన వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌ (ఎస్పీఆర్‌) నుంచి 180 మిలియన్‌ బ్యారెళ్ల వరకు చమురును విడుదల చేయడాన్ని పరిశీలిస్తోందన్న వార్తలతో గురువారం చమురు ధరలు పడిపోయాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 13.30 గంటల (ఐఎస్‌టీ) సమయంలో బ్యారెల్‌కు 4 శాతం పడిపోయి 108.85 డాలర్లకి చేరుకుంది. ‘భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రపంచ ఇంధన మార్కెట్ల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది’ అని పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘మార్కెట్‌ అస్థిరతను తగ్గించడం, ముడి చమురు ధరల పెరుగుదలను శాంతపరచడం కోసం ఎస్పీఆర్‌ నుండి విడుదలకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలతో సహా తగినట్లుగా భావించే అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’అని ఆయన చెప్పారు. భారతదేశం 5.33 మిలియన్‌ టన్నుల ఎస్పీఆర్‌ లేదా దాదాపు 9.5 రోజుల అవసరాలకు సరిపడు ముడి చమురుని నిర్వహిస్తోందని తేలి చెప్పారు. అదనంగా, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీలు) ప్రస్తుతం 64.5 రోజుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ‘అందువల్ల, ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు’ అని ఆయన తెలిపారు. నవంబర్‌ 2021లో, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా భారతదేశం, ప్రధాన ఇంధన వినియోగదారులతో సంప్రదింపులు జరిపి, సమాంతరంగా దాని ఎస్పీఆర్‌ నుండి 5 మిలియన్‌ బ్యారెళ్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య తదుపరి సరఫరా ఆందోళనల కారణంగా ఈ నెల ప్రారంభంలో చమురు ధరలు 14 సంవత్సరాల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా ద్రవ్యోల్బణం పెరిగింది. చమురు సరఫరా ఆందోళనలపై చర్చించడానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుండగా, పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ, రష్యా సహా దాని మిత్రదేశాలు (ఒపెక్‌G అని పిలుస్తారు) గురువారం సమావేశం కానున్నాయి. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో డిమాండ్‌ తగ్గిన తర్వాత ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి, నెమ్మదిగా ఉత్పత్తిని పెంచడానికి ‘ఒపెక్‌G’ దాని ప్రస్తుత ఒప్పందాన్ని కొనసాగించాలని భావిస్తున్నది. అంతర్జాతీయంగా చమురు ధరలు 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి 139 డాలర్లకి పెరిగిన సమయంలో ఓఎంసీలు రిటైల్‌ ధరల పెంచకుండా నిలిపివేయగా, మార్చి 22 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 9 సార్లు పెంచడం జరిగింది. మొత్తంగా లీటరుకు రూ.6.4 పెరిగింది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌తో సహా ఐదు రాష్ట్రాలు ఎన్నికల దృష్ట్యా కేంద్రప్రభుత్వం రేట్లు పెంచనీయలేదని, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఓఎంసీలు ధరలు పెంచాయని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img