Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పంజాబ్‌, హరియాణాలో రైతుల నిరసనలు

చండీగఢ్‌ : ఉత్తరప్రదేశ్‌ లోని లఖింపూర్‌ ఖేరీలో రైతుల నిరసనలో చోటుచేసుకున్న హింసకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌, హరియాణా వ్యాప్తంగా సోమవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. రైతు నిరసనకారులు అనేక చోట్ల కేంద్రం, యూపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల వెలుపల ప్రదర్శనలు నిర్వహించారు. హింసకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రివర్గం తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్‌ చేశారు. పంజాబ్‌లోని పాటియాలా, మొహాలీ, ఫిరోజ్‌పూర్‌, అమృత్‌సర్‌, రూప్‌నగర్‌, మోగా, హరియాణాలోని ముక్తసర్‌, అంబాలా, కురుక్షేత్ర, ఫతేహాబాద్‌, కేంద్రపాలిత చండీగఢ్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. చండీగఢ్‌లో ఆదివారం జరిగిన బీజేపీ కిసాన్‌ మోర్చా సమావేశంలో ఖట్టర్‌ మాట్లాడుతూ.. దెబ్బకు దెబ్బ తీయడం గురించి మాట్లాడారు. 500 నుంచి 1,000 మంది బృందాలుగా ఏర్పడి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై దాడులు చేయాలని అవసరమైతే జైలుకు పోవడానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img