Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మెజారిటీ ప్రజలకు న్యాయం అందట్లేదు..

న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చాలి : సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ
దేశ రాజధాని వేదికగా అఖిల భారత జిల్లా స్థాయి న్యాయ సేవ అథారిటీల సదస్సు కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి జిల్లాస్థాయి న్యాయసేవ అథారిటీల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. జిల్లా న్యాయ సేవ అథారిటీలతో జాతీయస్థాయి సదస్సు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. సీజేఐ కీలక వ్యాఖ్యలు.. ఈ సదస్సును ఉద్దేశించి సీజేఐ ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ ప్రజలకు న్యాయం అందట్లేదని చెప్పారు. జస్టిస్‌ డెలివరీ మెకానిజం మెజారిటీ ప్రజలకు చేరట్లేదని అన్నారు. ప్రతి ఇంటికీ న్యాయాన్ని అందించగలిగే మెకానిజం లేదని పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల ఇళ్ల వద్దకు న్యాయాన్ని అందించగలిగిన పరిస్థితే ఏర్పడితే- ఆ ఘనత న్యాయమూర్తులకు దక్కుతుందని చెప్పారు. దీన్ని నెరవేర్చాల్సిన బాధ్యత జిల్లాస్థాయి న్యాయాధికారులపై ఉందని పేర్కొన్నారు. మెజారిటీ ప్రజలను కలుసుకోవడం, వారికి అవసరమైన న్యాయ సేవలను అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తమ పరిధులను విస్తరించుకోని వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకోవడం ద్వారా ఇంటింటికీ న్యాయ సేవను అందించవచ్చని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయమే అత్యంత కీలకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. దేశ జ్యుడీషియరీపై సిస్టమ్‌పై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందనేది జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థ మీదే ఆధారపడి ఉందని చెప్పారు.
దేశానికి నిజమైన బలం.. యువతేనని, ప్రపంచ జనాభాలో అయిదో వంతు యువత భారత్‌లోనే ఉందని ఎన్వీ రమణ అన్నారు. ఇందులో మూడుశాతం మందికే వృత్తి నైపుణ్యం ఉందని చెప్పారు. యువతలో నైపుణ్యాన్ని మరింత పెంపొందించడంతో పాటు.. దీన్ని సమర్థవంతంగా దేశాభివృద్ధి కోసం బదలాయించుకోవాల్సి ఉందని అన్నారు. అప్పుడే ప్రపంచ దేశాలు- భారత్‌ మధ్య ఉన్న ఆ తేడా చెరిగిపోతుందని పేర్కొన్నారు.
సులభతర న్యాయమూ ముఖ్యమే.. : ప్రధాని మోదీ
అనంతరం మోదీ మాట్లాడుతూ, ‘సులభతర వాణిజ్యం, సులభతర జీవనం లాగే సులభతర న్యాయమూ అంతే ముఖ్యం. ఇందుకు న్యాయపరమైన మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదపడతాయి. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు గత ఎనిమిదేళ్లుగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ`కోర్టు మిషన్‌లో భాగంగా వర్చువల్‌ కోర్టులను తీసుకొస్తున్నాం.’ అని చెప్పారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ 700 మంది న్యాయవాదులతో సేవలను అందిస్తోందని పేర్కొన్నారు. టెలి-లా వ్యవస్థను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఎన్నో రకాలుగా వారంతా ప్రజలకు తమ న్యాయ సేవలను అందిస్తోన్నారని ప్రశంసించారు. న్యాయపరంగా ప్రజలను అక్షరాస్యులను చేయడంలో వారి సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img