Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వేతన జీవులను నిరాశే..

న్యూదిల్లీ : ఆదాయపు పన్ను మినహాయింపులపై ఈ బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం వేతన జీవులను నిరాశపర్చింది. కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం.. రాబడి మార్గాలు మూసుకుపోవడం లాంటివి జరిగాయి. కానీ, ఈ బడ్జెట్‌లో వారికి ఎటువంటి ఊరట లభించలేదు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పెంచి తద్వారా డిమాండ్‌లో వృద్ధి తీసుకురావాలి. ఆదాయపు పన్ను మినహాయింపు ప్రజల చేతిలో నిధులను పెంచుతుంది. తాజాగా బడ్జెట్‌ ప్రభావం మధ్యతరగతి జీవులపైనే ఎక్కువగా పడనుంది. ఆదాయపు పన్ను స్లాబ్‌ల్లో ఎటువంటి మార్పు చేయలేదు. కరోనా సమయంలో ఆర్థికంగా ఉన్నత వర్గాల ఆదాయం పెరిగినా.. మధ్య, దిగువ మధ్యతరగతి వారి ఆదాయాలు గణనీయంగా పడిపోయిట్లు నివేదకలు చెబుతున్నాయి. చాలా మంది ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం కారణంగా అదనపు ఖర్చులు వచ్చి చేరాయి. దేశ జనాభాలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కేవలం 1శాతం మాత్రమే ఉన్నారు. 2020 లెక్కల ప్రకారం 130 కోట్ల జనాభాలో వీరి సంఖ్య కేవలం 1.45 కోట్లు మాత్రమే. దీంతో ప్రస్తుతం కరోనా సమయంలో కచ్చితమైన ఆదాయ మార్గంగా ఉన్న ఆదాయపు పన్నులో ఎటువంటి మినహాయింపులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. కేవలం ఐటీ రిటర్నులకు సంబంధించి చిన్న చిన్న మార్పులు మాత్రమే చేశారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడాలు ఉంటే అసెస్‌మెంట్‌ సంవత్సరం నుంచి రెండేళ్లలోపు అప్‌డేటెడ్‌ రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. నేషనల్‌ పెన్షన్‌ స్కీంకు కేంద్ర పభుత్వ ఉద్యోగులకు.. యజమాని వాటా కింద చెల్లించే 14 శాతం వరకు పన్ను మినహాయింపు ఉంది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దీన్ని వర్తింపజేశారు. గతంలో వీరికి ఈ మినహాయింపు 10 శాతం వరకు మాత్రమే ఉంది. ఈ బడ్జెట్‌లో స్వల్ప ఊరట దక్కించుకొన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదలాయింపుతో వచ్చే ఆదాయంపై 30శాతం పన్ను విధిస్తారు. క్రిప్టో కరెన్సీలకు ఇది వర్తిస్తుంది. 1శాతం టీడీఎస్‌ కూడా వసూలు చేస్తారు. బహుమతి రూపంలో వీటిని ఇచ్చినా స్వీకర్త నుంచి పన్ను వసూలు చేస్తారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై సర్‌చార్జ్‌ని 15శాతానికి పరిమితం చేశారు. అన్నిరకాల దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇది వర్తిస్తుంది. ఇప్పటి వరకు షేర్లు, యూనిట్లు కాకుండా మిగిలిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై 37శాతం వరకు పన్ను విధించే వారు. వాటిని కూడా 15శాతానికి పరిమితం చేయడం పెద్ద ఊరట. తనిఖీల్లో బయటపడిన అక్రమ సొమ్మును నష్టాలు చూపి పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు చేసే యత్నాలకు ప్రభుత్వం కట్టడి చేసింది. లెక్కల్లో చూపని సొమ్ము తనిఖీల్లో బయటపడితే దానికి ఎటువంటి మినహాయింపులు వర్తించవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img