Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

మహిళా ఓట్ల కోసం ఆరాటం

తాయిలాలతో ఆకర్షించే ప్రయత్నాలు..ఆచరణ సాధ్యంకాని హామీలతో మేనిఫెస్టోలు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే దండుగా ఉన్నారు. ఎన్నికల సంఘం వెల్లడిరచిన గణాంకాల ఆధారంగా ఏపీలో జనరల్‌ ఓటర్లు, ఎన్నారై ఓటర్లు కలిపి 4,14,01,887 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 2,10,58,615 మంది, పురుషులు 2,03,39,851 మంది ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళా ఓటర్లు 7,18,764 మంది ఎక్కువగా ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 3,421 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు కర్నూలు జిల్లాలో అత్యధికంగా 10,40,451 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో అనంతపురం జిల్లా (10,20,124 మంది), విశాఖ (10,19,487 మంది) ఉండగా, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో (4,00,034 మంది) ఉన్నారు. మహిళా ఓటర్లను దృష్టిలో ఉంచుకుని తమ మేనిఫెస్టోల్లో మహిళలకు ప్రధాన పార్టీలు అగ్ర తాంబూలమిచ్చాయి. మహిళా ఓట్ల ప్రాధాన్యతను ముందే పసిగట్టిన వైసీపీ… తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటిలో మహిళలకే పెద్దపీట వేసింది. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, చేయూత, ఆసరా, జగనన్న ఇల్లు, డ్వాక్రా తదితర పథకాలన్నీ మహిళలకే అందజేసింది. ప్రధానంగా డీబీటీ ద్వారా సంక్షేమ నిధులను అత్యధిక శాతం మహిళల ఖాతాలోని వేయడం గమనార్హం. తాజా ఎన్నికల కోసం ‘నవరత్న’ మేనిఫెస్టోను మరింతగా విస్తరించింది. మహిళల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే…. వాటి సొమ్మును గతం కంటే పెంచింది. మహిళా ఓటర్లను ఎలాగైనా ఆకర్షించి తమ వైపునకు తిప్పుకోవాలని యత్నిస్తున్నది. వైసీపీ ప్రభుత్వ తొలి కేబినెట్‌లో హోం మంత్రిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితకు అవకాశం దక్కింది. రెండో విడత కేబినెట్‌ విస్తరణలో మరో ఎస్సీ మహిళ తానేటి వనితను హోంమంత్రి పదవి వరించింది. ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఇద్దరు ఎస్సీ మహిళలు హోం మంత్రులయ్యారు. దీంతో మహిళలంతా తమవైపే ఉన్నారని దీమాతో వైసీపీ ఉంది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మహిళా ఓట్లు ఎటు వెళ్తాయనే ఆందోళన ఆ పార్టీకి ఉంది.
ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ సైతం మేనిఫెస్టోలో మహిళల కోసం మితిమీరిన వరాలు ప్రకటించాయి. ఎన్డీఏ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీనిచ్చాయి. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలో మహిళలకు ఉచిత బస్సు హామీతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగలిగింది. ఆ రాష్ట్రాల కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఏపీలోని ఎన్డీఏ కూటమి కాఫీ కొట్టింది. వైసీపీ ప్రభుత్వ పథకాలను వేర్వేరు పేర్లతో టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో చేర్చింది.
2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కానీ మహిళా సంక్షేమానికి పెద్దగా చర్యలు తీసుకోలేదు. అప్పట్లో మహిళలపై ఘోరమైన దాడులు, హత్యలు అనేకం జరిగాయి. వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వైపీపీ పాలనలోనూ దురాగతాలు జరిగాయి.
తాజా ఎన్నికలలో మహిళా ఓట్లు పొందేందుకు ఇటు వైసీపీ, అటు ఎన్డీఏ కూటమి కూడా ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నాయి. మహిళల ఓట్ల కోసమే తపన పడుతున్నాయి కానీ చట్టసభలలో వారికి సముచిత స్థానం కల్పించడానికి ప్రధాన పార్టీలు చొరవ చూపడంలేదు. తాజా ఎన్నికల్లోనూ వైసీపీగానీ, ఎన్డీఏగానీ మహిళలకు పెద్దగా టికెట్లు ఇవ్వలేదు. అరకొరగా కేటాయించిన సీట్లలోనూ ఆయా పార్టీల నుంచి పురుషులను బరిలోకి దించడం విమర్శలకు దారి తీస్తోంది. ఉదాహరణకు మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ తరపు మహిళా అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్‌ పోటీ చేస్తున్నారు. హిందూపురంలో వైసీపీ మహిళ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. పిఠాపురంలో వైసీపీ మహిళా అభ్యర్థి వంగా గీతపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్నారు. ఇంకా చాలా చోట్ల ఇదే తరహా పరిస్థితి ఉన్నది. మహిళా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు డబ్బు, బహుమతుల రూపంలో ప్రలోభాలకు గురిచేసేందుకు పార్టీలు యత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని మహిళా ఓటర్లు గుర్తించి… దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, లౌకిక వాదం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అజెండాతో ఏర్పడిన ఇండియా కూటమిని ఆదరించాల్సిన అవసరముంది.
` విశాలాంధ్ర బ్యూరో-అమరావతి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img