Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

ఆ మూడు స్థానాలు పక్కా!


సీపీఐ(ఎంఎల్‌) దీమా
అర్హా, నలంద, కారకత్‌ నుంచి పోటీ

సుమారు మూడు దశాబ్దాల తర్వాత బీహార్‌ నుంచి పార్లమెంటులో అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తోంది. 2020లో బీహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయంతో పార్టీకి నూతనోత్సాహం లభించింది. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ(ఎంఎల్‌) దూసుకెళుతోంది. 1989లో బీహార్‌ నుంచి సీపీఐ(ఎంఎల్‌) ఎంపీ ఎన్నికయ్యారు. అర్హా నుంచి రామేశ్వరప్రసాద్‌ గెలిచారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో పోటీ చేసి 12 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రీయ జనతా దళ్‌ నేతృత్వ మహాకూటమి నాయకత్వంలోని అతిపెద్ద విపక్ష కూటమిలో భాగస్వామిగా సీపీఐ(ఎంఎల్‌) ఉంది. అర్హా, నలంద, కారకత్‌ లోక్‌సభ స్థానాల నుంచి సీపీఐ(ఎంఎల్‌) పోటీ చేస్తోంది. ఈ స్థానాలకు జూన్‌ 1న పోలింగ్‌ జరగబోతోంది. అర్హాలో బీజేపీకి సీపీఐ(ఎంఎల్‌)కి మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. నలందలో జేడీ(యూ) మీద.. కారకత్‌లో రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుహ్వాషాపై పోటీ చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే కారకత్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సీపీఐ(ఎంఎల్‌) గెలవచ్చన్న అంచనా ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో మహాకూటమి భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురు ఆర్జేడీ నుంచి, ఒకరు సీపీఐ(ఎంఎల్‌) నుంచి ఎన్నికయ్యారు.
బీహార్‌లో కులాలకు ప్రాధాన్యత ఎక్కువ. అభ్యర్థులకు కుల ఓట్లు పడుతుంటాయి. అయితే ఎన్డీయే వైపు నుంచి కుష్వాహా ఓటు బ్యాంకు మళ్లుతుండటంతో తమకు గెలుపు అవకాశాలు పెరుగుతున్నట్లు సీపీఐ(ఎంఎల్‌) నమ్ముతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ప్రదర్శన కంటే కుష్వాహా ఓటర్లపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నది. ఇప్పటికే కుష్వాహా వర్గీయుల ఓట్లు సీపీఐ(ఎంఎల్‌) తరపున రైతు నాయకుడు రాజా రామ్‌ కుష్వాహా, బీజేపీ మిత్రపక్షానికి చెందిన ఉపేంద్ర కుష్వాహాకు మధ్య చీలిపోయాయి. రాజా రామ్‌కు ప్రజాదరణ ఉండటంతో ఆయన గెలవచ్చన్న అంచనావున్నది.
కాగా, భోజ్‌పురి గాయకుడు పవన్‌ సింగ్‌ రంగ ప్రవేశంతో రాజ్‌పుత్‌లలో కొందరు ఆయనకు మొగ్గు చూపే పరిస్థితి ఉన్నది. కులానికి ప్రాధాన్యత ఉన్నాగానీ ఇప్పుడు జరుగుతున్నది ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటమని తాజా ఎన్నికలనుద్దేశించి రాజా రామ్‌ కుష్వాహా పేర్కొన్నారు.
ఇదిలావుంటే, పోటీ చేస్తున్న మూడు లోక్‌సభ స్థానాల్లో గెలుపునకు సమాన అవకాశాలు ఉన్నట్లు సీపీఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య అన్నారు. నలందలో అధికార జేడీ(యూ), సిట్టింగ్‌ ఎంపీపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని చెప్పారు. 1996 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఈ స్థానానికి సమతా పార్టీ ఆ తర్వాత జేడీ(యూ) ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాయి. నలంద నుంచి సీపీఐ(ఎంఎల్‌) ఎమ్మెల్యే సందీప్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. ‘ఈసారి మేము మాత్రమే కాదు మా కూటమి కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వబోతోంది. బీహార్‌ ఎన్నికల ముఖచిత్రం 2020 అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి మారుతోంది. ఈ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలుస్తాం’ అని భట్టాచార్య అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img