Friday, May 17, 2024
Friday, May 17, 2024

పోలింగ్‌ శాతాల విడుదలలో జాప్యంపై అనుమానాలు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. మూడవ దశ మే 7న జరగబోతోంది. ముగిసిన రెండు దశలలో జరిగిన పోలింగ్‌ శాతాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్ర జాప్యం చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తొలి దశ ముగిసి 11 రోజులు గడిచినా అధికారిక వివరాలను వెలువరించలేదు. గతంలో ఓటింగ్‌ ముగిసే సమయానికి లేక 24 గంటల్లోపు పోలింగ్‌ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించేది కానీ ఈసారి మొదటి దశ ముగిసి 11 రోజులు, రెండవ దశ ముగిసిన నాలుగు రోజుల తర్వాతగానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇంత ఆలస్యం జరగడం ఇదే మొదటిసారి అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో విమర్శించారు. ఈసీఐ అలసత్వాన్ని ఆక్షేపించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందిస్తూ ‘ఎట్టకేలకు ఈసీఐ అధికారిక గణాంకాలు విడుదలయ్యాయి. ముందొచ్చిన పోలింగ్‌ శాతాల కంటే ఈసారి విడుదల చేసిన శాతం కాస్త ఎక్కువగా ఉన్నది’ అని అన్నారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఓటర్ల కచ్చితమైన సంఖ్యను ఎందుకు తెలుపలేదని ఆయన ఈసీఐని ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల విశ్వసనీయతపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న, సుప్రీంకోర్టులో కేసులు నడిచిన నేపథ్యంలో ఓటింగ్‌ శాతం వెల్లడిలో తీవ్ర జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. మొదటి రెండు దశల పోలింగ్‌లో కేంద్రంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటింగ్‌ జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలలో అవకతవకలకు పాల్పడేందుకే పోలింగ్‌ శాతం వెల్లడిలో జాప్యం జరిగిందన్న అనుమానాలు లేకపోలేదు. పోలింగ్‌ శాతాలను అధికారికంగా విడుదల చేసేందుకు జరిగిన జాప్యానికిగాను ఈసీఐ అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించి, వాటిని ఈవీఎం ఓట్లతో కలపడం వల్ల ఆలస్యమైనట్లు తెలిపారు. సర్వీస్‌ ఓటర్లు, ఆబ్సెంటీ ఓటర్లు, 85ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు, అత్యవసర సేవల్లో ఉండేవారు, ఎన్నికల విధుల్లో ఉన్న వారందరి పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించేందుకు సమయం పట్టినట్లు ఈసీఐ సీనియర్‌ అధికారి వివరించారు.
ఇదిలావుంటే, తొలి దశ ముగిసిన 11 రోజులు… రెండవ దశ ముగిసిన నాలుగు రోజుల తర్వాత అధికారిక డేటాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తొలి దశలో 66.14శాతం, రెండవ దశలో 66.71శాతం పోలింగ్‌

నమోదైనట్లు ప్రకటించింది. మొదటి దశలో భాగంగా ఏప్రిల్‌ 19న 102 నియోజకవర్గాల్లో, రెండవ దశలో భాగంగా ఏప్రిల్‌ 26న 88 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్‌ తగ్గింది. గత ఎన్నికల తొలి దశలో 69.43శాతం పోలింగ్‌ నమోదైంది.
మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే మహిళా ఓటింగ్‌ అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, జమ్మూకశ్మీర్‌, మణిపూర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌తోపాటు లక్షద్వీప్‌, పుదుచ్చేరి ఉన్నాయి. రెండవ దశలో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరిగాయి. అసోం, బీహార్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే మహిళల ఓటింగ్‌ శాతం అధికంగా నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img