Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

మోదీకి ఓటుతో బుద్ధి చెప్పండి

విశాలాంధ్రవిజయవాడ: కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధానాల అన్యాయం చేసిందని... ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బీజేపీకి, మోదీకి గట్టిగా బుద్ధిచెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ వన్‌టౌన్‌లోని లెనిన్‌ భవన్‌లో గురువారం విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ...ప్రధాని మోదీ విజయవాడలో నిర్వహించిన రోడ్‌షో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. 2019లో తిట్టిన వారినే ఇప్పుడు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నారని చెప్పారు.ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి వచ్చి మాయమాటలు చెప్పి వెళ్లిపోవడం ఆయనకు అలవాటేనన్నారు. 2014లో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల సభల్లో మాట్లాడిన మోదీ... జాతీయ స్థాయిలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నం పోర్టు నిర్మాణం ఇతర విభజన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2019లో, 2024లో కూడా రాష్ట్రంలో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. 2014 నుంచి 2018 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంద న్నారు. 2018లో ఏపీకి ఇచ్చిన హామీలు నేరవేర్చక పోవటంలో ఎన్డీఏ నుంచి తాము బయటకు వచ్చిన చంద్రబాబు... కేంద్రంపై ధర్మపోరాట దీక్షలు చేశారన్నారు. మళ్లీ ఎన్డీఏలో చేరిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చేప్పాలని డిమాండ్‌ చేశారు. 2019లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ... జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి ఇచ్చిన నిధులను చంద్రబాబు ఏటీఎంగా వాడుకోవటంతో పూర్తి చేయలేకపోయామని చెప్పటం జరిగిందన్నారు. ఇక జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని అంశాల్లో మద్దతునిచ్చామని చెప్పారు. బీజేపీ సహకారం లేకుండా ఒక్క గంట కూడా జగన్‌ పాలన చేయలేకపోయారని చెప్పారు. రాష్ట్రం అప్పులు పాలు కావటానికి, అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోవటానికి బీజేపీయే కారణం అన్నారు. మోదీని అడ్డంపెట్టుకుని జగన్‌ రాష్ట్రంలో అప్రజాస్వామిక, అరాచక పాలన చేశారని విమర్శించారు. తనకు ఊడిగం చేసిన జగన్‌ను ఇప్పుడు మోదీ విమర్శిస్తున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రూ.15వేల కోట్లు ఇస్తే పోలవరాన్ని కట్టలేదని మోదీ చెపుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి చంద్రబాబుతో మోదీ జత కలిశారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇప్పుడేమో సిగ్గులేకుండా ఎన్డీఏ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తే రెండేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామని నమ్మబలుకుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల పోలింగ్‌లో బీజేపీకి ఎదురుగాలి వీచిందన్నారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని, తమిళనాడు, కేరళ రాష్ట్రాలో ఖాతా కూడా తెరవదని చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేనను తమతో ఉంచుకోవటానికి మోదీ ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్పోరేట్‌ వ్యక్తి అయిన సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేయటం సరికాదన్నారు. 22 డివిజన్‌లలో 22 ఎమ్మెల్యే కార్యాలయాలు పెట్టి పని చేస్తానని ప్రకటించిన సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండరని చెప్పారు. విజ్ఞులైన ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలన్నారు. సుజనా చౌదరి డబ్బుల సంచులకు ఆశపడి విజయవాడ ప్రతిష్ఠను మంటగలపవద్దని విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమి బలర్చిన అభ్యర్థలకు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నుంచి సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావుకు ‘కంకికొడవలి’ గుర్తుపై, విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గ సీపీఎం అభ్యర్థి సీహెచ్‌.బాబూరావుకు ‘సుత్తికొడవలి నక్షత్రం’గుర్తుపై, విజయవాడ తూర్పు నియోజక వర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి నాంచారయ్యకు, విజయవాడ పార్లమెంటుకు కాంగ్రెస్‌ అభ్యర్థి వల్లూరు భార్గవ్‌కు ‘హస్తం’ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
డబ్బుతో ఓటును కొనలేరు: జి.కోటేశ్వరరావు
పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ తనకు కమ్యూనిస్టు నాయకునిగా ప్రజల నుంచి ఆదరణ ఉందని, గతంలో కార్పోరేటర్‌గా పని చేసిన ప్రజల మన్ననలు పొందానని చెప్పారు. ప్రజలు ఆలోచించి పని చేసే వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో జైరాం రమేశ్‌, అశ్వినీదత్‌ వంటి వారు ఓట్ల కోసం డబ్బులు వెదజల్లితే ప్రజల తిరస్కరించారని గుర్తు చేశారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టి ప్రజలకు పప్పుబెల్లాలు పంచితే ఓట్లు వేయరని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో సీపీఐ తరఫున పోటీ చేస్తున్న తనకు ‘కంకి`కొడవలి’ గుర్తుపై ఓట్లు వేసి గెలించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్‌లో తన సీరియల్‌ నంబరు 5వద్ద బటన్‌నొక్కి ఓట్లు వేయాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో జన స్వామ్యానికి, ధన స్వామ్యానికి మధ్య పోటీ జరుగుతోం దన్నారు. ప్రజలు ఆలోచించి ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తి జి.కోటేశ్వరరావుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు పెన్మెత్స దుర్గాభవాని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img