Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అమరుడు అలెండీ

భరద్వాజ

సరిగ్గా ఇరవై ఏళ్ల కింద 2001 సెప్టెంబర్‌ 11న తీవ్రవాదులు అమెరికాలోని జంట ఆకాశ హార్మ్యాలను కూల్చినందువల్ల మూడు వేల పై చిలుకు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఆ ఘోర కలి మానవాళిని వెంటాడుతూనే ఉంటుంది. కానీ 1973లో సరిగ్గా సెప్టెంబర్‌ 11ననే అమెరికా ప్రోద్బలంతో చిలీలో జరిగిన సైనిక తిరుగుబాటులో ఆ దేశాధ్యక్షుడు సాల్వడార్‌ అలెండీని హత్య చేశారు. ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన నాయకుడు. లాటిన్‌ అమెరికా నాయకుల్లో శిఖర సమానుడు.
ఈ సైనిక కుట్ర జరగక ముందు చిలీకి పటిష్ఠమైన ప్రజాస్వామ్య సంప్రాదాయం ఉండేది. దశాబ్దాల తరబడి అక్కడ క్రమ పద్ధతిలో ఎన్నికలు జరిగేవి. లాటిన్‌ అమెరికాలో అమెరికా కుటిల యత్నాలవల్ల ఎన్ని కుట్రలు జరిగినా చిలీలో ప్రజాస్వామ్యం మనగలిగింది. అలెండీ 1979 సెప్టెంబర్‌ లో చిలీ అధ్యక్షుడయ్యారు. ఆయన సోషలిస్టు విధానాలను అమలు చేయడానికి ప్రయత్నించిన నాయకుడు.
అలెండీ అంతకు ముందు డాక్టర్‌. క్రంగమా సోషలిస్టు పార్టీ నాయకుడయ్యారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇతర వామపక్షాలతో కలిసి పని చేశారు. దేశంలో ఉన్న సహజ వనరులను ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలనుకున్నారు. రాగి గనులను జాతీయం చేసి భూ సంస్కరణలను అమలు చేశారు.
అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌కు, మరో నాయకుడు కిసింగర్‌కు ఈ అలెండీ విధానాలు కంటగింపైనాయి. ఎలాగైనా అలెండీ ఎన్నిక కాకుండా అడ్డుకోవడానికి చట్టాన్ని ఉపయోగించుకోవడంతో పాటు చట్ట వ్యతిరేక పద్ధతులు అనుసరించడాన్ని అమెరికా పాలకులు ప్రోత్సహించారు.
ఐనా అలెండీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇది గిట్టని అమెరికా సామ్రాజ్యవాదులు ఆయన ప్రభుత్వాన్ని అస్థిరీకరించడానికి చేయని ప్రయత్నం లేదు. చిలీ మీద అనేక ఆంక్షలు విధించారు. అమెరికా హస్తం ఉన్నట్టు బయటపడకుండా అలెండీ ప్రభుత్వాన్ని పడదోయాలని అమెరికా గూఢచార సంస్థ అనేక సందేశాలు పంపింది.
శిక్షణకోసం అమెరికా వెళ్లి వచ్చే సైనికాధికారుల బుర్రల్లో అమెరికా విషం నింపింది. సైన్యానికి క్షిపణులతో సహా భారీ స్థాయిలో ఆయుధాలు దొంగచాటుగా అందించారు. ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అనేక సమ్మెలు చేయించారు.
1971 లో క్యూబా అధ్యక్షుడు ఫిడెల్‌ కాస్ట్రో నాలుగు వారాల పాటు చిలీలో పర్యటించి అలెండీ ప్రభుత్వానికి అనేక సూచనలిచ్చారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 1973 జూన్‌ లో అనేక శతఘ్నులు అధ్యక్ష స్థానానికి దూసుకెళ్లినా ఆ కుట్ర విఫలమైంది. సెప్టెంబర్‌ 11న రెండో సారి కుట్ర లో అలెండీ అధ్యక్ష భవనంలో చిక్కుకు పోయారు. పారిపోవడానికి నిరాకరించారు. చివరిదాకా పోరాడడానికే నిర్ణయించుకున్నారు. అమెరికా సాయంతో సైన్యాలు మరో సారి తిరుగుబాటు చేశాయి. అధ్యక్ష భవనంపై దాడికి వైమానిక దళ విమానాలనూ వాడారు. బాంబుల వర్షం కురిపించారు. అలెండీ రేడియోలో ప్రసంగిస్తూ ఇది తన చివరి ఉపన్యాసం అని చెప్పారు. రాజీనామా చేయడానికి మాత్రం నిరాకరించారు.
సామ్రాజ్య వాదుల, విదేశీ గుత్త పెట్టుబడిదార్ల, ప్రతీప శక్తుల వల్లే విపత్కర పరిస్థితి ఎదురవుతోందని హెచ్చరించారు. బాంబుల, తూటాల మోత మధ్య చిలీ వర్ధిల్లాలి అని నినదించారు. నా ప్రాణ త్యాగం వృథా కాదు అనీ అన్నారు. ఆ తరవాత కొద్ది క్షణాలకే అలెండీ నేలకొరిగారు. ఆ తరవాత సైనిక ప్రభుత్వం ఏర్పడిరది. వేలాది మందిని హతమార్చారు. రెండు మూడు రోజుల్లోనే పది లక్షల మందిని జైళ్లల్లో తోశారు. వామపక్ష వాదులను మాత్రం చిత్ర హింసలు పెట్టి హతమార్చారు. ఆ తరవాత అత్యంత క్రూరుడైన పినోచెట్‌ అధికారంలోకి వచ్చి కిరాతకమైన నియంతృత్వం కొనసాగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img