Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రైవేటీకరణ ప్రజావ్యతిరేకం

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

పొద్దు పడమట పొడుస్తోందని నమ్మించేవారి పాలనలో ఉన్నాం. పబ్లిక్‌, ప్రైవేట్‌ సంస్థలు రెండిరటిలో ప్రజాధనమే. కాని పబ్లిక్‌ లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీచేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు వాటాను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, మూలధనాన్ని అనుమతించటం, ప్రజల ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అమ్మటం ప్రైవేటీకరణ.
జర్మన్‌ పదం ప్రైవేటైజ్‌ రంగ్‌ నుండి ఆంగ్ల పదం ప్రైవేటైజ్‌ పుట్టింది. 1933-37 ల మధ్య జర్మనీలో హిట్లర్‌ నాజీ ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలను అమ్మింది. 1950 లలో బ్రిటన్‌ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించింది. 1960 లలో పశ్చిమ జర్మనీ పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేసింది. 1980 లలో బ్రిటిష్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌, అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ భారీగా ప్రైవేటీకరించారు. వాణిజ్యం ప్రభుత్వ బాధ్యత కాదన్న నినాదం థాచరిజం గా మార్మోగింది. ఆర్థిక సరళీకరణ విధానాలతో 1980, ‘90 లలో లాటిన్‌ అమెరికాలో ప్రైవేటీకరణ జరిగింది. మన ప్రథమ ప్రధాని నెహ్రూ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రహదారులు, విద్యుత్తు, నీటి వసతి మొదలగు మౌలిక సదుపాయాలు లేవని పారిశ్రామికవేత్తలు ఆ బాధ్యతను తిరస్కరించారు. 1966 లో ఇందిరా గాంధీ, 1980 లలో రాజీవ్‌ గాంధీ, 1990 లో చంద్రశేఖర్‌ ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేశారు. కాని ఫలించలేదు. ప్రపంచ సోషలిస్టు శిబిరం పతనం కాగానే అమెరికా పాశ్చాత్యదేశాలు ప్రతిపాదించిన ప్రపంచ వాణిజ్యసంస్థ ప్రపంచదేశాల ఆమోదం పొందింది. మన దేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థను ప్రపంచీకరణ పేరుతో పివి నరసింహారావు, మన్‌ మోహన్‌సింగ్‌ 1991 లో ఆమోదించారు. దాని ఫలితమే ప్రైవేటీకరణ. వాజపేయి, అరుణ్‌ శౌరిని అమ్మకాల మంత్రిగా నియమించారు. అనేక ప్రభుత్వ సంస్థలను అమ్మేశారు.
పరిశ్రమల స్థాపనకు అనుకూలతలు ఏర్పడ్డ నేటి నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు సొంత పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు, సేవాసంస్థలను స్థాపించాయి. ప్రభుత్వ రంగాన్నీ మింగాలని చూస్తున్నాయి. అందుకు గత ప్రభుత్వాల కంటే మోదీ ప్రభుత్వం బాగా సహకరిస్తోంది. ‘నీకిది నాకది సూత్రం (క్విడ్‌ ప్రొ కొ) తో అదానీ, అంబానీల రుణం తీర్చుకుంటోంది. స్వదేశీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లాతెరిచింది. బీమా రంగంలో పెట్టుబడులు అవసరం లేదని, రక్షణరంగంలో ఇవి అపాయకరమని మోదీకి తోచకపోవటం విచిత్రం. రైల్వేలు, రవాణా, బ్యాంకులు, బీమాకంపెనీలు, పరిశ్రమలు, గనులు, ప్రకృతి సంపద, ఖనిజ వనరులు, చమురు, సహజ వాయువు, ఓడరేవులు, విమానా శ్రయాలు, విద్యుత్తువంటి సంపద్వంతరంగాలను ప్రైవేట్లకు కారుచౌకగా అమ్మడమే మోదీ ప్రభుత్వ ప్రత్యేకత. ప్రైవేటీకరణ మోదీ ప్రభుత్వ రాజకీయ-కుట్ర నిర్బంధం. 4 వ్యూహాత్మక రంగాల్లోనే (అణుశక్తి-రక్షణ, రవాణా-టెలికమ్యూనికేషన్స్‌, విద్యుత్తు-పెట్రోలియం, బ్యాంకింగ్‌-బీమా) ప్రభుత్వ కనీస ఉనికిఉంటుంది. 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పంజాబ్‌ సింద్‌ బ్యాంకు, మహారాష్ట్ర బ్యాంకు, యూకో బ్యాంకు, ఐ.డి.బి.ఐ.) ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టారు. భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌.ఐ.సి.)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 నుండి 76% కి పెంచారు. ప్రజల వాటాలను (ఐపిఓ) ఆహ్వానించారు. ప్రైవేటీకరణకు దీపం అని పేరు పెట్టారు మోదీ. ఇది ప్రైవేటు సంస్థలకు దీపమే. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రజలకు శాపం. స్వాతంత్య్ర అమృత దినోత్సవాన జాతీయ నగదీకరణ సొరంగమార్గం ప్రకటించారు. ఇది ప్రజా సంపదను, సేవలను మారుపేరుతో అమ్మేసే దేశ శాశ్వత విక్రయ పథకం.
భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు (సి.పి.ఎస్‌.యు.లు) క్రియాశీలకపాత్ర పోషించాయి. 1951 లో కేవలం రూ.29 కోట్ల పెట్టుబడితో 5 సి.పి. ఎస్‌.యు.లే ఉండేవి. ఇటీవల అమ్మినవి పోగా 2018-19 కి రూ.16.4 లక్షల కోట్ల పెట్టుబడులతో 348 సి.పి.ఎస్‌.యు.లున్నాయి. అత్యధిక ఆర్థికాభివృద్ధి, వస్తూ త్పత్తి, సేవల కల్పనలో స్వావలంబన (మోదీ ఆత్మ నిర్భరత), ఆదాయవ్యయాల దీర్ఘకాల సమతుల్యత, విదేశీ మారక ద్రవ్య నిలువల పెంపుదల, స్థిరమైన అత్యల్ప ధరలు సి.పి.ఎస్‌.యు.ల స్థాపనా లక్ష్యం. వీటి అమ్మకం ఆత్మనిర్భర భారత సాధనకేనని మోదీ చెప్పటం వింత.
కేవలం రూ.5 కోట్ల మూలధనంతో 1956లో జాతీయీకరణ చేసిన ఎల్‌.ఐ.సి. నేడు 32 లక్షల కోట్ల సంపద కలిగి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నష్టాలపాలైన ప్రభుత్వ సంస్థల వాటాలు కొన్నది. ప్రజల బీమా అవసరాలను మోసాలు లేకుండా తీర్చుతోంది. 1971 లో జాతీయీకరణ జరిగిన సాధారణ బీమా సంస్థ చౌకగా ప్రజలకు వస్తు, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పిస్తోంది. 1969 లో వామ పక్షాల అజెండాతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ 14 బ్యాంకులను జాతీయం చేశారు. తర్వాత 6 బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. 21 జాతీయ బ్యాంకుల్లో 12 మిగిలాయి. ఇప్పుడు రెండిరటిని అమ్ముతున్నారు. త్వరలో మరో నాలుగింటిని అమ్ముతారు. చివరికి 6 మిగులుతాయి. జాతీయ బ్యాంకులు గ్రామీణ ప్రజలకు, ప్రత్యేకించి రైతాంగానికి, వృత్తి కార్మికులకు రుణాలతో పాటు అనేక ఆర్థిక సేవలు అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్లు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను స్థాపించలేదు. బ్యాంకుల ప్రైవేటీకరణతో గ్రామీణ ప్రజల, రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రజల వాటాలతో, పేదల పొదుపుతో ఏర్పాటు చేయబోయే బ్యాంకుల సొమ్మును కార్పొరేట్లు తమ ప్రయోజనానికే వాడుకుంటాయి.
బ్రిటిష్‌ ఆర్థికవేత్త, విద్యావేత్త ఆచార్య సాల్‌ ఎస్ట్రిన్‌, బ్రిటిష్‌ అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల ఆచార్యురాలు ఆడెలిన్‌ పెళ్లెటీర్‌, ప్రైవేటీకరణ సమీక్షలో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైవేటు సంస్థలు మాత్రమే ఆర్థిక ప్రగతి సాధించలేవన్నారు. ప్రభుత్వ మద్దతు, సహకారం లేకుండా ప్రైవేటు సంస్థలు మనలేవని పలువురు ఆర్థిక వేత్తలు విశ్లేషించారు. ప్రభుత్వరంగ సంస్థల యజమానులుగా ప్రజలు తిరస్కరించిన రాజకీయులను, రాజకీయ ప్రాబల్యంగల అధికారులను నియమిస్తారు. వీరు తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనా లు చూసుకుంటారు. వీరికి పరిపాలన విషయాలు తెలియవు. మార్కెట్‌ ఆర్థికవ్యవస్థ పరిపూర్ణ పరిజ్ఞానం లేనందున వీరికి సంస్థల ఉత్పత్తులు, వాటి ప్రజా ప్రాయోజితాలపై అవగాహన ఉండదు. సిబ్బంది ఇబ్బందులు, ప్రజా వసరాలు, పరిశ్రమ బాగు వీరికి పట్టవు. ప్రజాధనానికి బాధ్యత వహించరు. యాజమాన్యానికి వాణిజ్య వ్యవహారాల్లో స్వతంత్ర నిర్ణయాధికారం ఉండదు. ప్రతి విషయానికి రాజకీయ నాయకులపై ఆధారపడాలి.
ప్రైవేటీకరణలో లాభాల ప్రైవేటీకరణ-నష్టాల జాతీయీకరణ సూత్రం ఇమిడి ఉంది. ప్రభుత్వ సంస్థలు గడిరచిన లాభాలలో లక్షల కోట్ల రూపాయలు పన్నులు, డివిడెండ్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. ప్రైవేటీకరణతో ఈ జమలు జరగవు. ప్రభుత్వరంగ సంస్థల్లో రిజర్వేషన్ల ఫలితంగా సామాజిక ఆర్థిక బలహీన కులాలు, తరగతులకు ఉద్యోగాలు లభించాయి. సామాజిక న్యాయం కొంత జరిగింది. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు ఉండవు. మోదీ ఉధృత శరవేగ ప్రైవేటీకరణ రిజర్వేషన్లను ఎత్తివేయడానికే. 2014 నుండి మోదీ ప్రభుత్వం రూ.6.6 లక్షల కోట్ల కార్పొరేట్ల బకాయీలను రద్దుచేసింది. వీటిని వసూలు చేయాలి. సంపన్నులపై సంపద పన్ను, ఆస్తి పన్ను, ఆదాయాలపై అదనపు పన్నులు విధించాలి. ఆదాయ పన్ను పరిమితులు పెంచాలి. విలాసవస్తు వినియోగంపై వస్తు సేవల పన్ను పెంచాలి. రాజకీయ, అధికార అవినీతిని అరికట్టాలి. వీటితో ఆర్థిక సంపద అసమానతలు తగ్గుతాయి. ప్రభుత్వ ఆర్థిక వనరుల కొరత తీరుతుంది. ఈ చర్యలు అసలైన పరిష్కారం కాగలవు కాని ప్రజల ఆస్తుల అమ్మకం కాదు.
పాలకులు ప్రజల ఆస్తులకు చౌకీదారులే. వారికి వాటిని అమ్మే హక్కు లేదు. ప్రభుత్వ సంస్థలకు ప్రజలే యజమానులు. శ్రామికులు శ్రమసంస్కృతిని మెరుగుపర్చు కోవాలి. ప్రజానీకం ప్రైవేటీకరణకువ్యతిరేకంగా ఉద్యమించాలి. మేధావులు, ఉద్యమాలలో ఆరితేరిన కార్మిక సంఘాలు, ప్రత్యామ్నాయపక్షాలు జనానికి దారిచూపాలి.
వ్యాసరచయిత ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం కార్యదర్శి, చరవాణి: 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img