Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అమెరికా కుట్రలకు బలైన అఫ్గానిస్థాన్‌

ఎం.సి.వెంకటేశ్వర్లు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తాలిబన్ల మధ్య 2020 ఫిబ్రవరి 20న కుదిరిన ఒప్పందం మేరకు అమెరికా, మిత్ర దేశాల సైన్యాన్ని ఆగస్టు 31వతేదీన నూతన అధ్యక్షుడు బైడెన్‌ ఉప సంహరించుకున్నారు. 11రోజుల్లో తాలిబన్లు అఫ్గాన్‌ను వశంచేసుకోవడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అహమద్‌కర్జాయ్‌, అష్రఫ్‌ ఘనీకీలుబొమ్మ ప్రభుత్వాలను బలపరిచిన అఫ్గాన్‌ ప్రజలభద్రతకు, సైనికాధికారులకు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే భారతీయుల ప్రాణాలకు రక్షణ లేకుండా, ఆ దేశం నుండి బయటకు వెళ్ళే అవకాశం ఇవ్వకుండా ఒప్పందం చేసు కోవడం అమెరికా నమ్మకద్రోహానికి నిదర్శనం. రెండు దశాబ్దాలు తిష్టవేసిన అమెరికా, దాని మిత్రదేశాల సైన్యం ప్రాణాలను రక్షించుకోవడమే ఒప్పందం ప్రధాన ధ్యేయం. టెర్రరిజాన్ని అంతం చేస్తానని, అఫ్గాన్‌ను టెర్రరిస్టుల నుంచి విముక్తి చేస్తానని బీరాలు పలికిన అమెరికా సాధించిన ఘనకార్యం న్యూయార్క్‌ వాణిజ్య భవనాల సముదాయం కూల్చివేత సూత్రధారి ‘ఒసామా బిన్‌ లాడెన్‌’ను హతమార్చడమే నన్నది జగమెరిగిన సత్యం. సామ్రాజ్యవాదం, కరడుకట్టిన మతమౌఢ్య ఛాందస వాదుల మధ్య జరిగిన యుద్ధంలో రెండున్నర లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కొన్ని లక్షల మంది ప్రజలు అంగ వికలురు అయ్యారు. ఆ యుద్ధంలో 2 లక్షల 68 వేల కోట్లు ఖర్చు చేసి 3 లక్షల సైన్యానికి శిక్షణ ఇచ్చినా వేల సంఖ్యలో ఉన్న తాలిబన్లు ధాటికి ఆ దేశ సైన్యం చేతులెత్తేసింది. విలువైన ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని, హెలికాఫ్టర్‌లు, రవాణా విమానాలను తాలిబన్లకు అప్పగించి ఆగస్టు 31 నాటికి అమెరికా, అంతకుముందుగానే బ్రిటన్‌ సైన్యాలు పరారయ్యాయి. అఫ్గాన్‌ జాతీయ సైన్యం లెఫ్టినెంట్‌ జనరల్‌ సమీ సాదత్‌ ప్రకారం, ‘‘మొత్తం మీద ఆ దేశ అధ్యక్షులు మాకు ద్రోహం చేశారు. నిజంగానే ఇది సైనిక పరాజయమే. రాజకీయ వైఫల్యం వల్లే ఓడిపోయాం’’ ఆయన అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడిరచాడు. ఒప్పందంలో తమ ప్రయత్నాన్ని భాగస్వామిని చేయకపోవడం అఫ్గాన్‌ ప్రజల్లో, సైన్యంలో నిరుత్సాహం ఏర్పడి తాలిబన్లతో పోరాడాలన్న లక్ష్యం లేకపోయింది. బైడెన్‌ తమ సైన్యాన్ని తరలించడానికి తేదీని ఖరారు చేసిన తరవాత అఫ్గాన్‌ సైన్యానికి ఆయుధ సరఫరా, ఆర్థిక సహాయం నిలిపివేసి ఆ దేశ సైన్యాన్ని నిర్వీర్యం చేశారు. అమెరికా ఏర్పాటు చేసిన కీలుబొమ్మ ప్రభుత్వాలు అవినీతి, అక్రమాలకు నిలయాలు కావడంతో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయి. చివరకు సైన్యాధికారులు కూడా అమెరికా ఇచ్చిన బిలియన్ల డాలర్లను స్వాహా చేయడంతో తాము యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకోవలసిన అవసరం దేనికి అన్న ఆలోచన సైన్యంలో వచ్చింది. తమ సైన్యానికి పోరాడే శక్తి, పట్టుదల ఉన్నా అమెరికా పాలకులు, తమ దేశ రాజకీయ నాయకుల ద్రోహం ఫలితంగా తాలిబన్లు విజయం సాధించారని లెఫ్టినెంట్‌ జనరల్‌ సమీ సాదత్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అమెరికన్‌ సామ్రాజ్య వాదుల కుట్రలను మరోసారి బహిర్గతం చేశాయి. వాస్తవానికి సామ్రాజ్యవాదులు ప్రత్యేకించి అమెరికా లక్ష్యం వేరు. అఫ్గాన్‌ను వ్యూహాత్మక కేంద్రంగా చేసుకుని ఆసియాదేశాలపై రాజకీయఆధిపత్యం సాధించాలన్న దుష్టతలంపు అమెరికా కున్నది. అంతేగాక కమ్యూనిజాన్నిఅరికట్టడంÑ చైనా, రష్యాల ప్రాభవాన్ని దెబ్బ తీయాలన్న ఆకాంక్షÑ ఇరాన్‌, ఇరాక్‌, సిరియా తదితర మధ్య ప్రాచ్యదేశాల ఇంధన వనరులను కొల్లగొట్టి రవాణా చేసుకోవడానికి ఆటంకం లేకుండా చేసుకోవడం ప్రధాన ధ్యేయం. దానిలో భాగమే అఫ్గాన్‌తోపాటు మధ్యప్రాచ్యదేశాలలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు అంతర్యుద్ధ చిచ్చు పెట్టి నేటికీ చల్లారకుండా చేస్తున్నాయి. సామ్రాజ్యవాద దేశాల రాజకీయ కుట్రలకు అఫ్గాన్‌ను కేంద్రంగా చేసుకోవడం 1978లోనే మొదలైంది. ఆ నాటికి అమెరికా మిత్రదేశంగా పాకిస్తాన్‌ తప్ప ఆసియాలో ఏ దేశమూ లేదు. ఆసియా, యూరప్‌లో భాగంగా ఉన్న నాటి సోవియట్‌ యూనియన్‌ (రష్యా), చైనా సోషలిస్టు దేశాలుగా ఉండటం, భారత్‌ అలీనదేశంగాఉండటం అమెరికాకు కంటగింపుగా ఉంది. 1978లోనే మహమ్మద్‌ దావూద్‌ను పదవీచ్యుతుడిని చేసి ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడిపిఎ) ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ అధికారంలోకి వచ్చింది. కమ్యూనిజం ప్రభావం పెరుగుతుందన్న భయం అమెరికా, పాకిస్థాన్‌లకు పట్టుకుంది. అదే సందర్భంలో అఫ్గాన్‌ అంతర్గత పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. ప్రజా విప్లవంతో కమ్యూనిస్టులు (పిడిపిఎ) అధికారంలోకి వచ్చినా మత ఛాందసవాద తెగల నాయకులు (యుద్ధ ప్రభువులు) ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో పిడిపిఎ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అమెరికా ప్రభుత్వం, పాకిస్థాన్‌, అమెరికా గూఢచారి సంస్థ రంగంలోకి దిగాయి. ఆపరేషన్‌ సైక్లోన్‌ పేరుతో అమెరికన్‌ ప్రభుత్వం 500 మిలియన్‌ డాలర్లను కేటా యించింది. అఫ్గాన్‌ వార్‌ లార్డ్‌ అమ్నియత్‌ను సిఐఎ ఏజెంట్‌ గ్యారి కలిసి 6 లక్షల డాలర్లను లంచంగా ఇచ్చాడు. అఫ్గాన్‌, ఇతర ముస్లిం దేశాల నుంచి, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌, ఇస్లామిక్‌ కాలేజీ నుంచి టెర్రరిస్టు లను సమీకరించి వారికి అమెరికా రహస్య సైనికులు, పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ, అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ సాయుధ శిక్షణ ఇచ్చి అఫ్గాన్‌ అస్థిర పరిస్థితులను సృష్టించాయి. ముజాహిదీన్లు, తాలిబన్లు సుమారు దశాబ్దకాలం జరిపిన గెరిల్లా పోరాటానికి అన్ని రకాల సహాయం అందించిన చరిత్ర అమెరికాకున్నది. పిడిపిఎ ప్రభుత్వానికి అండగా ఉన్న సోవియట్‌ యూనియన్‌ సైన్యాలు 1989లో ఉపసంహరించుకోవడం, తాలిబన్‌ టెర్రరిస్టులు 1996లో అధికారం లోకి రావడం, ఆ దేశ అధ్యక్షులుగా ఉన్న నజీబుల్లాను, ఆయన సోదరుడిని కాబూల్‌ నడిబజారులో ఉరితీయడంతో తాలిబన్ల ముష్కర పాలన ప్రారంభమైంది. అమెరికన్‌ సైన్యాలు ఆక్రమించే వరకూ అధికారంలో ఉన్న తాలిబన్ల పాలన గురించి మహిళా సర్భన్‌ సాయిరా నూరాని ఇలా చెప్పారు. తాలిబన్లు రాకపూర్వం ‘‘ప్రతి బాలిక ఉన్నత పాఠశాల, యూనివర్సి టీకి పోగలిగేవారు. మాకిష్టమైన డ్రస్‌ వేసుకునేవారం. సినిమాలకు, కాఫీలకు వెళ్ళేవారం. భారతదేశం నుంచి వచ్చిన తాజా సినిమాలనుచూసి ఆనందించేవారం.. పశ్చిమదేశాల మద్దతుతో అధికారం లోకి వచ్చిన ముజాహిదీన్లపాలనలో(19962001)ఇవన్నీ కోల్పోయాం’’ అని చెప్పిందంటే ఆనాటిపాలన ఎంతఅమానవీయంగా ఉందో స్పష్టమవుతుంది. పిడిపిఎ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆనాడు అమెరికా సామ్రాజ్యవాదం, ఇతర పశ్చిమ దేశాలు అనుసరించిన నీతిబాహ్య రాజకీయాలు అఫ్గాన్‌ ప్రజలకు శాపంగా మారాయి.
అమెరికా స్వార్థం రాజకీయ వ్యూహం ఫలితంగా 19962001 నాటి పరిస్థితులు పునరావృతంకావడం ఆందోళనకరం. చైనా, రష్యాలు అఫ్గాన్‌ పరిణామాలను స్వాగతించడం ఆ దేశాల రాజకీయ వ్యూహం ఏమిట న్నది అర్థం కాని ప్రశ్న. పశ్చిమాసియాలో ఇరాన్‌, సిరియా, ఎమెన్‌లలోని ప్రభుత్వాలను కూల్చి తాబేదారు ప్రభుత్వాలను ఏర్పాటు చేయుటకు అక్కడ అంతర్యుద్ధాలకు పాల్పడుతున్న టెర్రరిస్టులకు ఆయుధ, ఆర్థిక సహాయం చేస్తున్న అమెరికా, సౌదీ అరేబియాలు తాలిబన్ల ఎడల ఏ వైఖరి అవలంబిస్తాయి? చైనా, రష్యా, పాకి స్థాన్‌ దేశాలు తాలిబన్ల ఎడల సానుకూల వైఖరి అవలంబిస్తున్నపుడు చతుర్భుజ కూటమి (ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా, భారత్‌) లో భాగస్వామిగా ఉన్న భారత్‌ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. తాలిబన్లు తమ సహజస్వభావాన్ని, మతఛాందసవాదాన్ని విడనాడి ప్రజా స్వామ్య పాలన సాగిస్తారను కోవడం భ్రమే అవుతుంది. తాలిబన్లు ఒకే భావజాలం కలిగిన సంస్థకాదు. భిన్నభావజాలాలున్న ఐక్య టెర్రరిస్టు సంస్థ. ఇప్పటికే అల్‌ఖైదా, జైష్‌ మహమ్మద్‌, లష్కర్‌తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు అఫ్గాన్‌లోకి అడుగు పెడుతున్నాయి. కొన్నేళ్ళుగా అమెరికా జైళ్ళలో మగ్గుతున్న కరుడు గట్టిన టెర్రరిస్టులను అమెరికాప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుత పరిణామ క్రమాలను, గత చరిత్రనుచూసినా తాలిబన్లలో మార్పువస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. భారతదేశంలోని కొంతమంది తీవ్రవాద కమ్యూనిస్టు సోదరులు సామ్రాజ్య వాదానికి వ్యతిరేక జాతీయ విమోచనోద్యమంగా వర్ణించడం హాస్యాస్పదం. ఈ తాలిబన్లు కమ్యూనిస్టు ఉద్యమానికి వ్యతిరేకంగా అమెరికా పెంచి పోషించిన టెర్రరిస్టు ముఠాలన్న విషయం గమనార్హం. ఈ సందర్భంగా కమ్యూనిస్టు అంతర్జాతీయ రెండవ మహాసభలో వలసవాదంపై డాక్యుమెంట్‌ను ప్రవేశపెట్టిన లెనిన్‌చెప్పిన మాటలను గుర్తు చేసుకోవడం సముచితంగా ఉంటుంది. ‘‘ఖానులూ, ముల్లాలూ, భూస్వాములూ, వగైరాలస్థానాలను బలపరిచేలక్ష్యంతో యూరోపియన్‌, అమెరికన్‌, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని కలపడానికి ప్రయత్నించే పాన్‌ ఇస్లామిజం లాంటి ధోరణులతో పోరాడడం అవసరం’’ (లెనిన్‌ సంకలిత రచనలు 8పేజీ 146). దశాబ్దాలుగా అఫ్గాన్‌ ప్రజలను ఆధునిక ప్రపంచ స్రవంతిలో కలవకుండా బలిపీఠంపై నిలబెట్టిన చరిత్ర అమెరికన్‌ సామ్రాజ్యవాదం, తాలిబన్లకు దక్కుతుందనుటలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img