Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

అసలేం జరుగుతోంది…!

బండారు రాధాకృష్ణ

రావయ్యా బావా ఈ మధ్య నల్లపూసవై పోయావ్‌. పార్వతి మీ అన్నయ్యకు కూడా కాఫీ పట్టుకురా. ఏం రాను బావా ఒక్కరోజు నీ దగ్గరికి రాకపోతే పిచ్చెక్కిపోతుంది. అటువంటిది నెల రోజులైందంటే కేవలం ఈ కరోనాకు జడిసె. అవునులే మీరు మా ఇంటికి రావద్దు. మేము మీ ఇంటికి రామనే నినాదం పాటించాలి కదా. ఏది ఏమైనా నీ దగ్గరికొచ్చి ఒక అరగంట ఆ రోజు పత్రికలలో వార్తలు వినకపోతే పిచ్చెక్కుతుంద నుకో. నీ దగ్గరికి రాలేక పేపరు కొని చదివితే నాకు పిచ్చెక్కిపోతుంది బావా. ఎందుకయ్యా అలా చదివి వదిలేయాలి. అంతేగాని వాటి గురించి ఆలోచిస్తే ఎవరికైనా పిచ్చెక్కుతుంది. ఎందుకంటె ఒక పేపరు రాసిన దానికి భిన్నంగా మరో పేపర్లో కనబడుతోంది.
అందుకే బావా నీవైతే ఆలోచించి విశ్లేషించి చెబుతావని. ప్రస్తుతం జగన్‌ కేవలం సంక్షేమ కార్యక్రమాలు తప్ప అభివృద్ధిని గాలికి వదిలేశాడం టున్నారు. లక్షల కోట్లు అప్పుతెచ్చి పేదలను కూర్చోపెట్టి పెడుతున్నారని కొంతమంది నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఏమంటావ్‌. అనడానికే ముంది. సంక్షేమ కార్యక్రమాలకు కోట్లు ఖర్చుపెట్టే మాట వాస్తవం. అయితే అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించడమే కాదుగ. అభివృద్ధి ఒక శాతం ప్రజలకు ఉపయోగపడేదిగ ఉండకూడదు. 70శాతం ప్రజల జీవన ప్రమాణం పెరగడం అభివృద్ధి అంటారు. అయితే, బావా కూర్చోపెట్టి అన్నం పెడితె సోమరులవుతారని వారికి పని చూపించి స్వయంగా బతకటం నేర్పాలని అంటున్నారుగా. నిజమే బావా ఈ కరోనా కాలంలో పని చూపకపోయినా యిది తగ్గిన తరువాతనైనా వారికి పని కల్పించి ఈ ఉచితాలు తగ్గించకపోతే కూర్చుని తినడానికి అలవాటు పడ్డవాడు తిరిగి కష్టపడడానికి ముందుకు రాడు కనుక ఆ విధమైన ఇబ్బంది రావచ్చు. అయితే ప్రస్తుతం కరోనా కాలంలో వారికి తిండి పెట్టి ఆకలి చావుకు గురికాకుండ చూడటం ప్రభుత్వ బాధ్యత కూడ.
అసలు ఈ పేదరికం తరతరాలుగ కొనసాగవలసిందేనా. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు పూర్తయినా ఒక శాతం తప్ప మిగతా మిగతా పేదవారి పిల్లలు పేదవాళ్లుగానే బతకుతున్నారుగా. అది కరెక్ట్‌ బావా. మన ప్రభుత్వాలు శాశ్వత నివారణ కాకుండ ఉపశమనం మాత్రమే చేస్తున్నాయి. తరాలు మారినా పేదవాడి పూరిపాకలు మారడంలేదు. ఆ పాకల మీద ఎర్రజెండా ఎగురుతూనే ఉంది. కాని ప్రభుత్వాలు ఖాతరు చేయడంలేదు. మరి ఏం చేయాలి బావా ఈ జగన్‌ ప్రభుత్వం ఏమైనా చేస్తుందంటావా. అయితే జగన్‌ ప్రభుత్వానికి ఈ కరోనా వంక దొరికింది. అందుకే పేదవాడికిచ్చేవి ఆపమని ప్రతిపక్షాలు అనలేకపోతున్నాయి. మనిషికి విద్య, వైద్యం ముఖ్యమే. ఆ రెంటిపై శ్రద్ధ కనబడుతోందిగాని 6వ తరగతివరకైనా తెలుగు మీడియం ఉంటే బాగుండేది. ఇకపై అమ్మానాన్న పిలుపులు కూడ వినబడవేమో. అసలు బావా పేదింటి పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసిననాడు ఈ పేదరికం కనుమరుగవుతుంది. ఇప్పటి వరకు అది అగ్రవర్ణ పిల్లలకే సాధ్యమైంది.
ఇపుడు నాడు నేడు పేరుతో స్కూళ్లు బాగుపడుతున్నాయిగ బావా. స్కూళ్లు బాగుపడి పరిసరాలు శుభ్రంగా ఉండవలపిందె. కాని అంతమాత్రాన చదువురాదు కదా. ఉపాధ్యాయులు, అదికారులు సహ కరించకపోతే పెట్టిన కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అది నిజమే బావా ప్రభుత్వం మారినా అవినీతి తగ్గినట్లులేదు. పైవాడితో పాటు అధికారులు అనధికారులు మారాలి కదా. ఏం జరుగుతుందో చూద్దాం మరి. ప్రభుత్వం ఒక పని చేయాలి బావా. అది ఏమిటంటే వృత్తిదారులు తయారుచేసే ప్రతి ప్రొడక్టు ప్రభుత్వమే కొని అమెజాన్‌ లాంటి సంస్థల ద్వారా అమ్మి తయారుచేసిన కార్మికుడికి గిట్టింపు రేటు ఒక కమిటీ ద్వారా నిర్ణయించి వాడి మజూరి వాడికిస్తే ఈ ఉచితాలతో పని ఉండదు. అపుడు ఈ కోట్లన్ని అభివృద్ధిపైనే పెట్టవచ్చు. నిజమే బావా ఈ కరోనా తగ్గిన తరువాతనైనా ప్రభుత్వం ఆ పనిచేస్తే బాగుంటుంది. సరె బావా మళ్లీ రేపు వస్తా సెలవు.
వ్యాస రచయిత సీనియరు జర్నలిస్టు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img