Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గురువు స్థానం గొప్పదే…!! కాని…??

డా॥ లచ్చయ్య గాండ్ల

అందుకే మన చదువంతా చిలుకను పంజరంలో పెట్టి బోధించే విధానమేనని కవీంద్రుడు గోడలుండని శాంతినికేతన్‌ను స్థాపించాడు. (ఇది నేడు గాడి తప్పింది). బ్రెజిల్‌ శాస్త్రవేత్త పాలోఫ్రెయిరె మన పాఠశాలల్ని అపాయకర మైనవిగా అభివర్ణించాడు. మన ఉపాధ్యాయులు తమకు తామే అభివర్ణించుకున్నట్లుగా ఎందరినో తీర్చిదిద్దడమంటే, రేపటి తరాన్ని దోపిడి వర్గాలకు అనుగుణంగా, బానిసలుగా తయారుచేయడమే. నేడిది ప్రపంచ వ్యాపితమైంది. వృత్తి విద్యలైనా, ఉన్నత విద్యలైనా డాలర్ల సంపాదకేనని కరోనా మహమ్మారి తేల్చి చెప్పింది. గురువును పవిత్రంగా చూసే భావజాలం రాచరిక, భూస్వామ్య, బ్రాహ్మణ ఆలోచనల ఆరో వేలే! అందుకే ఎల్లకాలాల్లో దోపిడీ వర్గాల సామ్రాజ్య వాదుల, ఆధిపత్యవాదుల, మతవాదుల ప్రయోజనాల్ని కాపాడే బోధననే పాఠశాలల్లో కొనసాగుతున్నది. ఇందులో ఉపాధ్యాయుడు ఓ చదరంగపు సిపాయి మాత్రమే.

గత జులై నెలలో వచ్చిన గురుపూర్ణోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమంలో ‘గురువు స్థానం గ్రేట్‌’…అంటూ ఓ కథనం చక్కర్లు కొట్టింది. దీన్ని అత్యధికంగా పంపిణీ చేసింది కూడా ఉపాధ్యాయులే! ఇందులో ‘మాబడి’ అనే పుస్తకంలో 17వ శతాబ్దం నాటి ఇంగ్లాండ్‌ రాజైన చార్లెస్‌2కథను ఉటం కించారు. తన కొడుకు చదువుకునే బడిని రాజు సందర్శించాలనుకొని, సంబంధిత పాఠశాల హెడ్మాస్టరైన బస్బీకి సమాచారం పంపిస్తాడు. విద్యార్థు లంతా తనను గౌనవిస్తుండగా, తాను రాజు వచ్చినప్పుడు లేచి నిల్చొని, టోపి తీసి నమస్కరించాల్సి వస్తుందని, దీంతో పిల్లల ముందు తన గౌరవం తగ్గు తుందని భావించి, రాజును రావద్దని కోరుతాడు సదరు హెడ్మాస్టరు. దీన్ని గుర్తించిన రాజు, తానే తన టోపీని తీసి వస్తానని చెప్పినట్లుగా ఆ కథనం ఉంది. దీని సారాంశాన్ని ఎంతమంది పిల్లలు గ్రహించి అర్థం చేసుకుంటారో తెలియదు గాని, నేటి ఉపాధ్యాయులు తమ స్థానం గొప్పదని, గౌరవించాలని, పూజించాలని చెప్పుకున్నట్లుగానే ఇది ఉంటుంది. నిజానికి ఈ నినాదం విద్యార్థుల మస్తిష్కాల నుంచి జనించింది కాదు. రాజు ఇంగ్లాండును, మొత్తంగా బ్రిటన్‌ను రెండు దఫాలుగా (1649 1685) పాలించాడు. ఆయన మత సంబంధమైన విద్యను ప్రోత్సహించినవాడు. ఈయన తండ్రి కాలంనుంచే ఇంగ్లాండ్‌లో మత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ కావాలని ప్రజాస్వామ్యవాదులు అంతర్గత యుద్ధం చేపట్టి, ఆయన కాలంలోనే రాచరిక వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా పార్లమెంటరీ వ్యవస్థను సాధించుకున్నారు. దీన్ని బట్టి నాటి విద్యా విధానాలు ఏ స్థాయిలో ఉండేవో, ఉపాధ్యాయులు గౌరవ మర్యాదలు ఏ విధంగా ఉండేవో ఊహించవచ్చు! భారతదేశాన్ని బ్రిటీషువారు ఆక్రమించక ముందు నుంచే మన దేశంలో సామాజిక విద్య అన్ని వర్గాలలో కొనసాగేది. దీన్ని మద్రాస్‌ మోడల్‌ అని గుర్తించిన ఓ బ్రిటీషర్‌, ఇంగ్లాండ్‌లో కూడా ఇలాంటి విద్యా విధానాన్ని ఆశించాడు. 19వ శతాబ్దం ప్రథమార్థం దాకా, ఇంగ్లాండ్‌లో సామాన్యులకు అందలేదు. రాచరిక కుటుంబాలకు, వారి తాబేదార్లకే విద్య పరిమితంగా ఉండేది. ఈ విధానాన్ని తమిళనాడుకు చెందిన ధర్మపాల్‌ అందమైన వృక్షంగా అభివర్ణించి ఓ పుస్తకాన్ని రాయగా, అది 1955, 1983, 2000 సం॥ మూడుసార్లు ప్రచురించారు. అందమైన వృక్షమనే మాటల్ని గాంధీ 20 అక్టోబర్‌, 1931లో లండన్‌లోని రాయల్‌ సొసైటీలో మాట్లాడిన సందర్భంగా ఉటంకించాడు. ఈ మాటల్నే ధర్మపాల్‌ తన పుస్తకానికి పెట్టుకుంటే, ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా పనిచేసిన ఇంగ్లాండుకు చెందిన మిధ్యా విద్యావేత్త జేమ్స్‌టూలే 2000సం॥లో హైదరాబాదు పాతబస్తీని సందర్శిం చిన సందర్భంగా రాసిన నివేదికకు కూడా ఈ పేరునే పెట్టుకున్నారు. బ్రిటీషులో విద్యా విధానం అప్రజాస్వామికమేననేది ఆయన భావన!
సరే! బస్బీ కథ వాస్తవం అనుకుంటే, మన ఉపాధ్యాయుల్లో ఈ స్థాయి ఆలోచనాపరులు, అధికారుల్ని అడ్డుకునేవారు ఉన్నారా? అనేది కూడా ఓ ప్రశ్న! పిల్లలకు, పిల్లల చుట్టూ ఉండే సమాజానికి జవాబుదారీతనం వహించని ఉపాధ్యాయ వర్గం, అధికారుల మన్ననల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇతిహాసపు గురువుల్ని చూద్దాం. గురువుకు ప్రత్యామ్నాయ పదంగా చెప్పుకునే ద్రోణుడు పాండవ పక్షపాతి. మన పాలకులు అందుకే ద్రాణాచార్య అవార్డుల్ని ఇస్తారుగానీ, ఏకలవ్య అవార్డులు ఇవ్వరు. దేవ గురువు వశిష్టుడు, అసుర గురువు శుక్రాచార్యుడు ఆయా రాచరిక వ్యవస్థల్ని కాపాడడానికే బోధించారు గాని, సమాజ వికాసానికి కాదు. వేద (రామాయణ/ మహాభారత) కాలంలో ఏ ఒక్క గురువు, రుషి సామాన్యులకు బోధించిన దాఖలాలు లేవు. పైగా ఎవరైనా స్వయంకృషితో సాధన చేస్తే దండిరచిన కథనాలే కోకొల్లలు. క్రీపూ, గ్రీకు, రోమన్‌ గురువులలో కొంత వైవిధ్యం కనపడుతుంది. మొదటి తత్వవేత్తగా గుర్తింపు పొందిన సోక్రటిస్‌ జ్ఞానమే ప్రధానమని, విద్యార్థులకు న్యాయం, ధర్మం పేరున బోధిస్తున్నామనే భావనతో కాకుండా చర్చిస్తున్నామనే ఆలోచనతో బోధించాలని కోరారు. ఆయన ప్రజాస్వామ్యవాదిగా ఉంటూ, స్వమతాన్ని వ్యతి రేకించాడు. దీన్ని రాజద్రోహంగా భావించిన ఎథెన్స్‌ రాజు సోక్రటిస్‌ను జైల్లోపెట్టి విషం తాగించాడు. తన శిష్య వర్గం జైలు నుంచి తప్పిస్తామన్నా నిరాకరించిన సోక్రటిస్‌ రాజాజ్ఞకు శిరసావహించాలని ఉపదేశించి, ఆత్మత్యాగం చేశాడు.
ఈయన శిష్యుడైన ప్లాటో, మొట్టమొదట ఉన్నత విద్యను అభ్యసించే సంస్థని స్థాపించి గణతంత్ర అనే పుస్తకాన్ని రాశాడు. పరోక్షంగా రాచరిక వ్యవస్థకు ఓ ప్రత్యామ్నాయ వ్యవస్థను స్థాపించాడు. ఆయన నిర్ద్వందంగా ఇతిహాస గాథల్ని, కట్టుకథలని, వాటిని పిల్లలకు బోధించవద్దని హెచ్చరించాడు. ఈ లెక్కన మన ఉపాధ్యాయుల్లో ఎంతమంది ప్లాటోలు ఉన్నారో తెలియదు. అరిస్టాటిల్‌ విజ్ఞాన వేత్త. వృక్ష, జంతు శాస్త్రాలపై, తత్వశాస్త్రంపై పట్టుగల వ్యక్తి. సోక్ర టిస్‌, ప్లాటోలకు శిష్యుడే! కాని, ఈయన పాలకవర్గ మార్గాన్ని (నేటి మన ఉపాధ్యా యుల్లా) ఎంచుకొని అలెగ్జాండర్‌కు గురవై, ప్రపంచ జైత్రయాత్రకు పురికొల్పాడు.
పై ఉదాహరణలను విశ్లేషించుకుంటే, దాదాపు గురువులంతా పాలక పక్షపాతం గలవారేనని తేలుతుంది. (కొంతమంది కాకపోవచ్చు!) అందుకే అబ్రహం లింకన్‌ తన కొడుక్కి సామాజిక వాస్తవాలైన దుఃఖాన్ని, బాధల్ని, సంతోషాల్ని విడమరిచి చెప్పమని ఉపాధ్యాయుల్ని కోరాడు. ఔరంగజేబ్‌ రాజు కాగానే ఆయన గురువు దర్బారుకు వెళ్లి, తనకేదైనా ఉన్నతస్థాయి అవకాశం కల్గించాలని కోరగా, తనకు నిజమైన విద్యను బోధించిన ఓ రాజకుమారుడిగా, అతి వినయం ప్రదర్శించి అబద్దాల్ని బోధించాడని ఔరంగజేబు తన గురువుని తులనాడాడు. ఛత్రపతికి జిజియాబాయే విద్యా బుద్దులు చెప్పిందిగాని ఏ గురువు కాదు. చివరకు చాణక్యుడు తన శిష్యుడైన చంద్రగుప్తున్ని రాజ్య కాంక్షకుడిగా తయారు చేశాడు గానీ, ఓ ప్రజాస్వామ్యవాదిగా కాదు.
అందుకే మన చదువంతా చిలుకను పంజరంలో పెట్టి బోధించే విధానమే నని కవీంద్రుడు గోడలుండని శాంతినికేతన్‌ను స్థాపించాడు. ( ఇది నేడు గాడి తప్పింది). బ్రెజిల్‌ శాస్త్రవేత్త పాలోఫ్రెయిరె మన పాఠశాలల్ని అపాయకర మైనవిగా అభివర్ణించాడు. మన ఉపాధ్యాయులు తమకు తామే అభివర్ణించుకున్న ట్లుగా ఎందరినో తీర్చిదిద్దడమంటే, రేపటి తరాన్ని దోపిడి వర్గాలకు అను గుణంగా, బానిసలుగా తయారుచేయడమే. నేడిది ప్రపంచ వ్యాపితమైంది. వృత్తి విద్యలైనా, ఉన్నత విద్యలైనా డాలర్ల సంపాదకేనని కరోనా మహమ్మారి తేల్చి చెప్పింది. గురువును పవిత్రంగా చూసే భావజాలం రాచరిక, భూస్వామ్య, బ్రాహ్మణ ఆలోచనల ఆరో వేలే! అందుకే ఎల్లకాలాల్లో దోపిడీ వర్గాల సామ్రాజ్య వాదుల, ఆధిపత్యవాదుల, మతవాదుల ప్రయోజనాల్ని కాపాడే బోధననే పాఠశాలల్లో కొనసాగుతున్నది. ఇందులో ఉపాధ్యాయుడు ఓ చదరంగపు సిపాయి మాత్రమే. అందుకే చైనా విప్లవం విజయవంతమైనా, విద్యారంగాన్ని మావో మార్చలేకపోయాడు. కారణం, ఉపాధ్యాయుల్లో గూడు కట్టుకున్న సంప్రదాయ ఆలోచన్లే! నిన్నటిదాకా కనిపించని పూలే దంపతులు నేడు పాలకవర్గాల దృష్టిలో పడడానికి గల కారణాల్ని ఉపాధ్యాయులు విశ్లేషించు కోలేక పోతున్నారు. మనువాద సంరక్షకులైన వారు గొప్ప ఉపాధ్యాయు లంటూనే, సామాజిక కోణంలో పనిచేసిన పూలేల్ని కూడా ఈ మధ్యన పాలకులు భుజాలపై మోస్తున్నారంటే, వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం! ఇది ఉపాధ్యాయ వృత్తి ఎంత గౌరవప్రదమైందో అర్థమౌతుంది. ఈ దిశగా పనిచేయగలరు. అప్పుడు ఈ దినోత్సవాల భాగోతం బట్టబయలు అవుతుంది. కాబట్టి, ఉపాధ్యాయులు ఏ వర్గమో తేల్చుకోవాలి. అప్పుడే నిజమైన ఆదరణ లభిస్తుంది.
వ్యాస రచయిత రైట్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ
అధ్యక్షుడు, సెల్‌: 9440116162

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img