Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆశా కార్మికుల వెతలు తీరేదెన్నడు?

డాక్టర్‌ జ్ఞాన్‌ పాఠక్‌

ఆశా కార్మికులు సమాజంలో అత్యంత కీలకమైన వ్యక్తులు. సమాజానికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు వారి బాగోగులను పట్టించుకోవడం లేదు. భారతదేశానికి సంబంధించి ఆశా కార్మికులను కనీసం కార్మికులుగా కూడా గుర్తించడంలేదు. చెత్తా చెదారాన్ని పోగుచేసి అమ్ముకుని జీవించే వాళ్లను చూసినట్లుగానే ఆశాకార్మికులను కూడా చూస్తున్నారు. తాజాగా ప్రపంచ ఉద్యోగ, సామాజిక దృక్పధం (డబ్ల్యుఈఎస్‌ఓ) సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ 2022లో తన నివేదికలో ఆశా కార్మికుల స్థితిపై ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ నివేదికను తాజాగా విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాకార్మికులను ప్రపంచ ఆరోగ్యవిభాగం నాయకులుగా గుర్తించింది. విచారకరమైన విషయం ఏమంటే భారతదేశం వీరిని ఉద్యోగులుగా ఏనాడూ గుర్తించలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆశా కార్మికుల పని పరిస్థితులు అత్యంత నాశి రకంగా ఉంటున్నాయి. అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. ఉద్యోగ భద్రతలేదు. పనిచేసేచోట భద్రత లేకపోగా ఆరోగ్య రిస్క్‌ ఉంటున్నదని డబ్ల్యుఈఎస్‌ఓ2023 నివేదిక తెలిపింది. ఇలాంటి పరిస్థితులన్నీ భారతదేశంలో ఆశాకార్మికులు అనుభవిస్తున్నారని అ నివేదిక పేర్కొంది. ఆశా కార్మికులంతా మహిళలే. వీరిని జాతీయ ఆరోగ్యం విషయం కార్యక్రమం కింద 2005లో నియమించారు. దేశవ్యాప్తంగా 10లక్షల మందికిపైగా ఆశాకార్మికులు పనిచేస్తున్నారు. వివిధ సామాజిక తరగతుల ప్రజలకు, ఆరోగ్య వ్యవస్థకు మధ్య వీరు అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రసూతి కార్యకలాపాలు, శిశు ఆరోగ్యం, సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులు తదితర ఆరోగ్యసమస్యలపైన వీరు పనిచేస్తున్నారు. ఫలితంగా ఆయా తరగతుల ప్రజల ప్రజాసంబంధాలపై సానుకూల ప్రభావం ఉంటుంది. వీరు పనిచేసే ప్రాంతాలలో వ్యాధినిరోధక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అలాగే మరణాలరేటు తగ్గింది. కోవిడ్‌19 మహమ్మారి దేశంలో ప్రవేశించి విస్తరించి నప్పుడు వైరస్‌ పట్ల, తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యాధికి సంబంధించిన పాజిటివ్‌ కేసులు తదితర వివరాలు సేకరించి ప్రభుత్వానికి తెలియజేశారు. వీరు నిర్వహించే సాధారణ బాధ్యతలకు అదనంగా ప్రజలు టీకాలు వేయించుకునేందుకు, ప్రసూతి కేసుల భద్రత, పిల్లల్లో వ్యాధి నిరోధకత, ప్రజాసమూహాల ఆరోగ్య రక్షణ బాధ్యతలను నిర్వహించారు. ఈ సేవలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆశాకార్మికులను, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ నాయకులను ప్రశంసించారు.
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కార్యక్రమం అమలుకు వీరిని నియమించడమేకాక, అవసరమైన శిక్షణ కూడా ఇచ్చారు. 25`45 ఏళ్ల మధ్య వయసు, సెకండరీ స్థాయి విద్యను పూర్తిచేసిన మహిళలను ఆశా వర్కర్లుగా నియమించారు. సమాజంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ముందుగా ప్రజల ఆరోగ్య రక్షణ, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు తదితర అంశాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించడమేకాక, అవసరమైతే వ్యాధి గ్రస్తులను ఆసుపత్రులకు తీసుకువెళ్లడం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రభుత్వం వీరిని నియమించినప్పటికీ ఉద్యోగులుగా గుర్తించి నెలసరి వేతనాలు ఇవ్వడం లేదు. కేవలం ఆరోగ్య లక్ష్యాలను పరిపూర్తిచేసిన వారికి ‘‘ప్రోత్సాహకాలను’’ మాత్రమే అందచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆశా కార్మికులు పోరాటాలు చేయడంతో చాలా రాష్ట్రాలు నిర్దిష్ట వేతన విధానాన్ని ప్రవేశపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలను పెంచింది. సగటున ఆశాకార్మికులకు భారతదేశంలో రూ.10,000(దాదాపు 120 డాలర్లు) ఇస్తున్నారు. రోగులను ఆసుపత్రికి తీసుకురావడానికి ఆశా కార్మికులు సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం రవాణా ఖర్చులు కూడా ఇవ్వడంలేదు. పనిభారం ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు ఆశాకార్మికులలో మూడవవంతుకుపైగా కార్మికులు గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తున్నారు. ఒక్కొక్కరు 2000 మంది ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవలసిఉంది. గ్రామీణప్రాంతాలలో ప్రజలను కలుసుకోవడం కూడా సవాలుగానే ఉంటుంది. ప్రత్యేకించి చాలాగ్రామాలకు బస్సు సౌకర్యం ఉండదు. ఆప్రాంతాల్లో పర్యటించ డానికి ఆటోరిక్షాలే ఆధారం. వీటికోసం ఎక్కువగా ఖర్చు చేయవలసి ఉంటుంది. పైగా హింస, వేధింపులు లాంటివి ఎదుర్కోవలసి ఉంటుంది. అనేకమంది ఆశాకార్మికులను మాటలద్వారా, చేతల ద్వారా హింసిస్తుంటారు.
పైగా వీరు సంబంధిత అధికారులకు సమాచారం తెలియ జేసేందుకు తగిన మార్గాలు లేవు. తమ సమస్యలను అందుబాటులోఉన్న సూపర్‌వైజర్‌లకు తెలియజేసి పరిష్కారాలను కోరుకుంటారు. ఈ సమస్యలలో అనేకం ఆశాకార్మికులను అనిర్దిష్ట స్థాయితో ముడిపెడతారు. ఈ కార్మికులను వలెంటరీ కార్మికులుగా, కోడళ్లుగా చూస్తున్నారు. ఉద్యోగులుగా చూడడం లేదు. కోవిడ్‌ సమయంలో ఆశా కార్మికుల పనిభారం ఎక్కువగా ఉంది. కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించి వారిని రక్షణ కేంద్రాలకు చేర్చడం, శిశు ఆరోగ్య పరిస్థితులను ఎల్లవేళలా తెలుసుకోవడం చేశారు. ఆశా కార్మికులలో ఎక్కువమందికి మాస్క్‌లు, శానిటైజర్‌లు సరఫరా చేసినప్పటికీ తరచుగా అవిసరిపోకపోవడం, నాణ్యత లేకపోవడం అవసరమైనన్ని సరఫరా చేయకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆటంకాలను, కష్ట సమయాలను ఎదుర్కొని దేశవ్యాప్తంగా ఆశా కార్మికులు పనిచేశారు. ఆ సమయంలోనూ రవాణా ఖర్చులుగానీ, ఇతర చిన్న చిన్న ఖర్చులుగానీ ప్రభుత్వం చెల్లించలేదు. ప్రభుత్వాలు ఎలాంటి సహాయం అందించక పోయినప్పటికీ ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకు ప్రైవేటు వ్యక్తులు, వివిధ కుటుంబాలు, స్నేహితులు ముందుకువచ్చి సహాయం అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img