జిల్లా కలెక్టర్
విశాలాంధ్ర,పార్వతీపురం : ఇళ్ల నిర్మాణం వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. డివిజన్, మండల అధికారులతో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ నిర్మాణాలలో ప్రతి వారం వాటి నిర్మాణ దశలలో ప్రగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ సహాయకులు రూఫ్ కాస్టింగ్ (ఆర్.సి) దశలో ఉన్న ఇళ్లను ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సందర్శించాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 15 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన అన్నారు. రీ సర్వే లక్ష్యం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆయన చెప్పారు. ఈవీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ ఓ.ఆనంద్, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.రామ చంద్ర రావు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్ తదితరులు పాల్గొన్నారు.