Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఈసీపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, కమిషనర్లను ఎంపిక చేయడానికి కమిటీని నియమిస్తూ గత గురువారం సుప్రీంకోర్ట్టు ధర్మాసనం ఉత్తర్వు జారీ చేసింది. ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (లేదా అతి పెద్ద ప్రతిపక్షం నాయకుడు), భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఇక ముందు ఈ కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇతర కమిషనర్లను ఎంపిక చేస్తుంది. అనంతరం వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ ఉత్తర్వు చరిత్రాత్మకమైంది. ఇందులో నర్మగర్భమైన ప్రభావంఉంది. ఇంత వరకు పాలకులే వీరిని ఎంపిక చేస్తున్నారు. సాధారణంగా తమకు అనుకూలంగా ఉన్నవారినే ఎంపికచేసి ప్రయోజనం పొందుతున్నారనే అభిప్రాయం ప్రబలంగా ఉంది. ఇకపై అలాంటి అవకాశం ప్రభుత్వానికి ఉండకుండా ఈ ఉత్తర్వు అడ్డుకట్టవేస్తుంది. 2014లో జరిగిన ఎన్నికలనాటి నుండి ఎన్నికల కమిషన్‌ బీజేపీ ప్రభుత్వానికి లొంగిఉంటూ, ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలోనూ సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదన్న ఆరోపణలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ప్రధానమంత్రి, ఆయన సహచరులు ప్రతిపక్షాలపైన, మైనారిటీలు, ఇతర మతాలపైన నిరాధారమైన నిందలువేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా స్వల్ప విషయాలకే ప్రతిపక్ష అభ్యర్థులను తక్షణం అరెస్టుచేసి శిక్షించడం తరచూ జరుగుతోంది. పాలక బీజేపీ అభ్యర్థులు తప్పులుచేసినా తప్పించుకుంటున్నారు. వీరిపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ చాలా అరుదుగా చర్యలు తీసుకుంటారు. పాలకపార్టీకి అనుకూలంగా పోలింగ్‌ తేదీలను జాప్యం చేయడం లేదా సర్దుబాటు చేయడం సార్వసాధారణమైంది. విచ్చలవిడిగా డబ్బు దుర్వినియోగం చేస్తున్నా, పంపిణీచేస్తున్నా ఎన్నికల కమిషన్‌(ఈసీ) పట్టించుకోకపోవడం చాలా మామూలు అయిపోయింది. పాలకపార్టీ దౌర్జన్యాలను పట్టించుకోవడంలేదు. ప్రతిపక్షాలను మాత్రం వదిలిపెట్టడం లేదు.
కేఎం.జోసెఫ్‌ నాయకత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయమూర్తులు అజయ్‌రస్తోగి, అనిరుద్ధబోస్‌, హృషీకేష్‌రాయ్‌, సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానం వెలువరించింది. అయితే జస్టిస్‌ రస్తోగి ఈ తీర్పుతో ఏకీభవిస్తూనే ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర కమిషనర్ల పదవీకాలం భద్రత అంశాలను జోడిరచి తీర్పు చెప్పారు. రాజ్యాంగంలో 324(2) అధికరణ ప్రకారం, పార్లమెంటు చట్టం చేసేంతవరకు తమ ఉత్తర్వు అమలులో ఉంటుందని కూడా న్యాయమూర్తులు పొందుపరిచారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టం లోని అంశాలకులోబడి రాష్ట్రపతి సీఈసీని, ఇతర కమిషనర్లను నియమిస్తారు. ఈ తీర్పు చరిత్రాత్మకమైంది. ఇంతవరకు పాలకపార్టీ పరిధిలోఉన్న సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియనుండి ఆ పార్టీని తప్పించారు. అధికరణ 324(1) ప్రకారం, ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) స్వతంత్రతను ఈ తీర్పు కాపాడిరది. ఈ అధికరణకు ఓటర్ల జాబితాను తయారుచేయడం, నియంత్రించడం, మార్గదర్శనంచేయడం, పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీ లకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు ఎన్నికలునిర్వహించే అధికారం ఉంటుంది.
తాజాగా సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వు అత్యంత ప్రాధాన్యత కలది. రాజ్యాంగ కర్తవ్యం నెరవేర్చేందుకు అధికరణ 324(2) ప్రకారం, పార్లమెంటు చట్టం చేయకపోవడంవల్ల ఏర్పడిన శూన్యతను ఈ ఉత్తర్వు భర్తీ చేస్తుంది. అధికారంలో ఉన్న ప్రతిపార్టీ తమ రాజకీయాల అభీóష్టానికి అనుగుణంగా, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తిరిగి గెలుపొందడానికివీలుగా ఈసీ సభ్యులను నియమించే పూర్తి అధికారం కావాలని కోరుకుంటాయి. మన దేశం రిపబ్లిక్‌గా అవతరించి 73ఏళ్లు గడచిన తర్వాత కూడా ఈసీ సభ్యులను సంపూర్ణ ప్రజాస్వామికంగా, పారదర్శకంగా నియమించేందుకువీలుగా చట్టంచేయాలని అధికారంలోఉన్న ఏ పార్టీ ప్రయత్నించలేదు. చట్టంచేసి రాజ్యాంగ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు పూనుకోలేదు. అనేకమంది రాజ్యాంగ అసెంబ్లీసభ్యులు, రాజ్యాంగ రూపకల్పన కమిటీ చైర్మన్‌ డా.బిఆర్‌ అంబేద్కర్‌ ఈ అంశంపై అనాడే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారనేది మనం మరువరాదు. ఎన్నికల కమిషన్‌ నియామకంపై 1949 జూన్‌ 16న అధికరణ 289 రాజ్యాంగ ముసాయిదాపై (రాజ్యాంగంలోని అధికరణం 324తో సమానమైనది) అంబేద్కర్‌ మాట్లాడుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ లేదా ఇతర ఎన్నికల కమిషనర్‌ పదవికి అర్హతలేని వ్యక్తిని నియమించకూడదు అన్న అంశం లేదని చెప్పారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ అంబేద్కర్‌ ఇతర రాజ్యాంగ అసెంబ్లీ సభ్యులు వ్యక్తంచేసిన ఆందోళనను గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం. భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలన్నది లక్ష్యం. అయితే ఈ సంస్థ స్వతంత్రత దిగజారిపోతున్నది. ప్రత్యేకించి 2019 లోక్‌సభ ఎన్నికల నాటినుంచి పాలక బీజేపీ ప్రభావంతో ఈ స్వతంత్రత దిగజారు తోంది. 2022లో ప్రధానమంత్రి కార్యాలయం చర్చలకు రావలసిందిగా ఈసీ సభ్యులను పిలిపించింది. అక్కడ ప్రభుత్వం చెప్పిన అంశాలకు అనుగుణంగా ఈసీ సభ్యులు నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణాక్రమంలో ప్రధాని మోదీ హోం మంత్రి అమిత్‌ షాలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి నప్పటికీ వారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పడానికి కమిషన్‌ సభ్యులలో అశోక్‌ లవసా మాత్రమే తిరస్కరించారు. ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలతర్వాత, అశోక్‌ లవసా కుటుంబాన్ని తీవ్రంగా హింసించారు. ఆయన నిరసన వ్యక్తం చేసినందుకు గాను తగిన మూల్యం చెల్లించవలసి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రప్రభుత్వం తక్షణం స్పందించి సీఈసీని, సభ్యులను ప్రజాస్వామికంగా, పారదర్శకంగా నియమించ డానికి వీలుగా పార్లమెంటు చట్టంచేయాలి. ఈ తీర్పు దేశ స్వాతంత్య్రాన్ని, ఎన్నికల కమిషన్‌ బలోపేతం చేసేందుకు, చట్టంచేయడం సానుకూలమైనచర్య అవుతుంది. భారత ప్రజా స్వామ్యవ్యవస్థలో స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహించడానికి ఇది తప్పనిసరి.
డా. సోమ మర్ల

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img