Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

ఓటర్లయినా మారాలి

ఇటీవల కాలంలో భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్న సూచనలు గోచరిస్తున్నాయి. ఇందుకు ఎవరు బాధ్యులు? ప్రజలెన్నుకున్న ప్రతినిధులా? ఓటు హక్కుకు వెలకట్టి కొంటున్న రాజకీయ పక్షాలా? ప్రజలా? ప్రజలెన్నుకున్న ప్రతినిధుల బాధ్యత ఏమిటి? ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారు? ప్రజా ప్రతినిధులు ప్రజలకు కాకుండా తమకు టిక్కెట్టిచ్చిన రాజకీయ పార్టీలకు బాధ్యత వహించడం ప్రజాస్వామ్యంలో చోటు చేసుకుంటున్న ఒక విపరీత పరిణామం. భారత దేశం ప్రపంచంలో రెండవపెద్ద జనాభాగల దేశం. భిన్న మతాలతో, విభిన్న కులాలతో, సంస్కృతులతో ప్రత్యేకతను సంతరించుకున్న దేశానికి నియంతృత్వం, అధ్యక్షతరహా పాలన సరికాదని ఆనాడే రాజనీతిజ్ఞులు భావించారు. ప్రజాస్వామ్య విధానమే శ్రేయస్కరమని, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అన్ని వర్గాల ప్రజలకూ సమన్యాయం జరుగుతుందని భావించారు. ప్రజాభీష్టం ప్రకారమే పాలన జరగాలని, ప్రజలెన్నుకున్న ప్రతినిధుల ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందని, అందుకు ప్రజాస్వామ్యమే సరైనదని భావించారు. ఓటుహక్కు గల యువత ఆలోచనలు,పెద్దల అనుభవాలు ప్రజాస్వామ్యం పదికాలాలు వర్ధిల్లడానికి ఆస్కారం ఏర్పడుతుందని మేధావుల భావన. 18 సంవత్సరాల వయసు నిండిన వారంతా తమ ఓటు హక్కును నిస్సంకోచంగా నిర్భీతిగా వినియోగించుకోవచ్చు.
నేటి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. ఎన్నికల్లో ధనం,కులం,మతం,మద్యం,కండబలం ప్రజాస్వామ్యాన్ని శాసించడం దురదృష్టకరం. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పక్షాలన్నీ అడ్డదార్లు తొక్కుతున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిహాసప్రాయం చేస్తున్నాయి. ఓటరుకూడా ధన ప్రభావానికి లోనౌతున్నాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఓటుహక్కును దుర్వినియోగం చేయడం జరుగుతున్నది. ధనానికి లొంగిపోయిన వ్యక్తులు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కును కోల్పోయినట్టే. ప్రజలు రాజకీయ పార్టీలిచ్చే డబ్బుకు, మద్యానికి లొంగిపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకది మాయని మచ్చ. డా.బిఆర్‌ అంబేడ్కర్‌ మాటల్లో చెప్పాలంటే ఓటు అనేది ప్రజల చేతుల్లో ఒక ఆయుధం. ఓటును అమ్ముకుని జీవితాలను నాశనం చేసుకుంటారో, ఓటు విలువ గుర్తించి, తమను తాము బాగు చేసుకుంటారో ఓటర్ల విజ్ఞతపైనే ఆధారపడి ఉంటుంది.
ఎన్నికల ముందు రాజకీయపక్షాలు ఎరగావేసే తాయిలాల వలలో చిక్కి సామాన్య ఓటరు మోసపోతున్నాడు. ఆ విషయం ఓటరుకు కూడా తెలుసు? ఓటరు బలహీనత, సెంటిమెంట్లు రాజకీయ పక్షాలకు వరం.ఓటరులో చైతన్యం ఉన్నా రాజకీయ పార్టీల వ్యూహాత్మక ఎన్నికల పాచికల్లో ఓడిపోయి, పూచిక పుల్లలా పరిగణించటం, ఎన్నికల తర్వాత కూరలో కరివేపలా తృణీకరించటం ప్రజాస్వామ్య మనుగడకు విఘాతం. ఓటరులో వివేకం కలగాలి. ఎన్నికల సంఘం కూడా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎన్నికల వ్యవస్థలో సమూలమార్పులు రావాలి. పటిష్ఠమైన ఎన్నికల సంస్కరణలు జరగాలి. ఇటీవల భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎన్నికల సంఘం పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం విదితమే. ఎన్నికల సంఘం అధికార పార్టీల కనుసన్నల్లో పనిచేయడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేస్తూ, ప్రధాన ఎన్నికల కమీషనర్‌ నియామకం విషయంలో ప్రధాని, ప్రతిపక్షనాయకుడు, సి.జె.ఐ ల ప్రమేయం ఉండాలని, ఏకపక్ష నియామకం కుదరదని పేర్కొనడం గమనించదగ్గ విషయం. టి.ఎన్‌.శేషన్‌లా నిష్ఫక్షపాతంగా వ్యవహరించే వ్యక్తులే ఎన్నికల నిర్వహణకు సారథ్యం వహించాలి.
ఎన్నికలముందు రాజకీయ పార్టీలు ఎలాంటి వాగ్దానాలు చేయకుండా నిలువరించాలి. వాగ్దానాలవలనే ప్రజాస్వామ్యవ్యవస్థ దెబ్బతింటున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాతే రాజకీయ పార్టీలు ప్రజలకు ఏమి చేయగలుగుతారో అవి చేయాలి. ఎన్నికల ముందు చేసే వాగ్దానాల వల్ల ఓటరు ఒక రకమైన సందిగ్ధావస్థకు గురై, ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నాడు. రాజకీయ ప్రలోభాలు,వత్తిళ్ళు ఓటరును అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇకనైనా ప్రజలు మారాలి. పార్టీల కతీతంగా నిస్వార్ధపరులను, మచ్చలేని మేధావులను ఎన్నికల్లో గెలిపించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్య విజయం.
– సుంకవల్లి సత్తిరాజు, సెల్‌: 9704903463

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img