Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

కార్మిక పోరాటాల సారధి ఎ.ఐ.టి.యు.సి.

చలసాని వెంకట రామారావు

చరిత్ర ప్రసిద్ధి చెందిన గుంటూరు నగరంలో ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభలు మరో 10 రోజుల్లో (2022 మార్చి 6,7,8 తేదీలలో) జరుగనున్నాయి. ఆంధ్ర రాష్ట్ర కార్మికోద్యమానికి గుంటూరు పట్టణమే తొలి పునాదులు వేసింది. 1935 మార్చిలో గుంటూరులో ప్రతాప రామానుజయ్య అధ్యక్షులుగా, జొన్నలగడ్డ రామలింగయ్య, జర్దా కృష్ణమూర్తి కార్యదర్శులుగా ‘కూలి రక్షణ సమితి’ ఏర్పడిరది. కమ్యూనిస్టులపై నిషేధం వల్ల కూలి రక్షణ సమితుల పేరుతో నాడు కమ్యూనిస్టులు కార్మిక సంఘాలను నిర్మించారు. గుంటూరు తర్వాతనే ఏలూరు, బెజవాడ, నెల్లూరు, బందరు, తెనాలి, భీమవరం వంటి ప్రాంతాలలో సమితులు ఏర్పడ్డాయి. 1935లోనే గుంటూరులో నెలరోజులు కార్మికులకు రాజకీయ పాఠశాలను నిర్వహించారు. నాటి నుండి నేటి వరకు గుంటూరు కార్మికోద్యమం రాష్ట్రానికి తలమానికంగా నిలిచింది. ప్రెస్‌ కార్మికులను, జూట్‌ మిల్‌, పొగాకు, పత్తి కార్మికులను సంఘటితం చేసి వారి హక్కులకై పోరాటాలు నిర్వహించారు. 1936లో ముఠా కార్మికులకు కార్మిక సంఘం ఏర్పాటు చేశారు. 1943 నాటికి కార్మిక సంఘాలలో 2,200 మంది సభ్యులున్నారు. తొలి రోజుల్లో రిక్షా, గుర్రపుబళ్లు, ఒంటెద్దు బళ్లు, మున్సిపల్‌, రైస్‌ మిల్‌ కార్మికులు సంఘటితమై యూనియన్లు స్థాపించుకుని ఆందోళనలు నిర్వహించారు.
కూలి రక్షణ సమితి నేతృత్వంలోనే 1935లో ప్రెస్‌ వర్కర్సు యూనియన్‌ జట్కా బండి వాళ్ల సంఘాలను స్థాపించారు. సమ్మె చేస్తున్న జూట్‌మిల్లు కార్మికులకు అండగా ఉండి యూనియన్‌ స్థాపించారు. లాగుడు బండి కార్మికుల సమస్యలపై కూడా సమితి పనిచేసింది. 12 కరపత్రాలను సమితి ప్రచురించగా రెంటిపై ముద్రణ చట్టం కింద నాయకులకు శిక్షలు విధించారు. వ్యవసాయ కార్మిక సంఘం కూడా సమితి ఆధ్వర్యంలోనే నెలకొల్పారు. 1935 జూన్‌ 2న గుంటూరు ప్రెస్‌ వర్కర్సు యూనియన్‌ గద్దె వెంకట్రాయుడు అధ్యక్షులుగా, ఉదయగిరి సుబ్బారావు, పి. పరమేశ్వరరావు కార్యదర్శులుగా ఏర్పడిరది. 1936 ఏప్రిల్‌ 26న ఆంధ్రరాష్ట్ర ప్రెస్‌ వర్కర్సు మహాసభ తెనాలిలో జరిగింది. అనంతరం తెనాలి ప్రెస్‌ కార్మికులు, బైండిరగ్‌ కార్మికులు చాలా సందర్భాలలో సమ్మెలు చేశారు. పనివారిని తొలగించిన ప్రెస్‌ల వద్ద ఆందోళనలు నిర్వహించారు. యాజమాన్యాలు లాకౌట్‌ ప్రకటిస్తే కార్మికులకు మద్దతుగా పులుపుల వేంకట శివయ్య, ముక్తేవి మాధవాచార్య, కాకుమాను సుబ్బారావు, పోలేపెద్ది నరసింహమూర్తి, పి.లోకనాథం తదితరులు సంఫీుభావం తెలియజేశారు.
గుంటూరు జిల్లా దొర పొగాకు పంటకు ప్రసిద్ధి. ఇండియన్‌ లీస్‌ టుబాకో డెవలప్‌మెంట్‌ కంపెనీ (ఐఎల్‌టిడి) రైతుల నుండి పొగాకు కొనుగోలు చేసి శుభ్రపరచి, గ్రేడిరగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసింది. చీరాలలో ఐఎల్‌టిడి కంపెనీ ఏర్పాటు చేసింది. రోజు కూలీ పావలా, 10 గంటలు పని చేయాలి. సెలవులు లేవు. 1937లో మల్లాది యజ్ఞనారాయణ నాయకత్వంలో యూనియన్‌ ఏర్పడిరది. 3000 మంది కార్మికులు సభ్యులుగా చేరారు. 1938 ఫిబ్రవరి 8వ తేది తమ సమస్యలపై యూనియన్‌ గుర్తింపు కోరుతూ కార్మికులు సమ్మె చేశారు. యాజమాన్యం ఇద్దరు కార్మికులను పని నుండి తొలగించింది. కంపెనీని మూసివేశారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పులలో ఇరువురు కార్మికులు చనిపోయారు. చీరాల కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించింది.
1938 జనవరి చివరిలో ప్రభల కృష్ణమూర్తి అధ్యక్షులుగా గుంటూరు మున్సిపల్‌ స్కావెంజర్సు యూనియన్‌ ఏర్పడిరది. 15 రూపాయల కనీస వేతనం, 8 గంటల పని, ఉచితంగా జత దుస్తులు, ఆదివారం సెలవు వంటి డిమాండ్లు చేశారు. 1939లో తాడేపల్లి కృష్ణా సిమెంట్‌ వర్కర్సు లేబరు యూనియన్‌ పులుపుల శివయ్య అధ్యక్షులుగా ఏర్పడిరది. గుంటూరు జిల్లాలో ఈ కాలంలోనే దొంతు నాగయ్య, బండ్ల గరటయ్యల నాయకత్వంలో చేనేత కార్మిక సంఘం స్థాపించారు. 1938 జులైలో నూలు కరువు యాత్రను బాపట్లలో నిర్వహించారు. ఇదే నెలలో చేనేత కార్మిక 3వ మహాసభను గాడిచర్ల హరిసర్వోత్తమరావు అధ్యక్షతన గుంటూరులో జరిపారు. ఈ మహాసభలో నాడు ప్రధానమంత్రిగా (స్వాతంత్య్రం రాకముందు రాష్ట్ర పాలకుడిని ప్రధానమంత్రి అనేవారు) ఉన్న రాజగోపాలాచారి పాల్గొన్నా కార్మికుల సమస్యలపై స్పందించలేదు. 1938 డిసెంబరులో తెనాలిగుంటూరు బస్‌ డ్రైవర్లు సంఘం ఏర్పాటు చేసుకుని రిజిష్టరు చేయించారు. జీతాలు పెరిగాయి. నాలుగు రూపాయలు బేటా, నెలకు ఒకరోజు సెలవు సాధించుకున్నారు. తెనాలి రైస్‌మిల్లు కార్మికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా, కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ సమ్మె జరిగింది. తొలి రోజుల్లో కార్మిక సంఘాల నిర్మాణంలో కమ్యూనిస్టులు క్రియాశీలకంగా వ్యవహరించారు. జాతీయోద్యమం, రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కార్మికులలో దేశభక్తి భావాలను కలిగించటంతోపాటు, వారి హక్కుల పరిరక్షణకు, యాజమాన్యాల దురంతాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేశారు. స్వాతంత్య్రానంతరం గుంటూరు జిల్లాలో అనేక పారిశ్రామిక సంస్థలు ఆవిర్భవించాయి. ముఖ్యంగా చాలా బహుళజాతి సంస్థలు పొగాకు కంపెనీలను స్థాపించి గుంటూరు దొర పొగాకును రష్యా, చైనా వంటి దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేశాయి. పొగాకు కంపెనీలలో పనిచేసే కార్మికులకు కామ్రేడ్స్‌ మల్లయ్యలింగం, కనపర్తి నాగయ్యలు యూనియన్‌ స్థాపించి కార్మికుల వేతనాల పెంపుదల, పని పరిస్థితులలో సౌకర్యాల కల్పనకు ఎంతో కృషి చేశారు. బహుళజాతి కంపెనీల దోపిడీ నిరోధించి కార్మికుల, రైతుల హక్కుల కోసం వీరు పని చేశారు. అగ్రింకార్‌, నవభారత్‌, గోల్డెన్‌, నేషనల్‌ బి.ఐ.పి.టుబాకో కంపెనీల వంటివి ప్రధాన కంపెనీలుగా ఉండేవి. 30 వేల మంది కార్మికులు, ప్రధానంగా మహిళలు వీటిలో పనిచేసేవారు. బజరంగ్‌ జూట్‌మిల్‌ కార్మికోద్యమానికి కనపర్తి నాగయ్య, ఎం.జె.హనుమంతరావులు నేతృత్వం వహించారు. హేమలతా టెక్స్‌టైల్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌కు వల్లూరి గంగాధరరావు, వాసిరెడ్డి మల్లిఖార్జునరావులు నాయకత్వం వహించేవారు. గుంటూరు జిల్లాలో పత్తిపంట ప్రారంభమైన తరవాత చాలా స్పిన్నింగ్‌ మిల్లులు, జిన్నింగ్‌ మిల్లులు నెలకొల్పారు. గుంటూరులో వివిధ రంగాలలో పనిచేసిన ముఠా కార్మికులకు జి.వి.కృష్ణారావు, జి.సేర్యంలు నాయకత్వం వహించారు. జి.వి.కృష్ణారావు అన్ని రంగాలలోని కార్మికులతో సన్నిహితంగా ఉంటూ వారికి తలలో నాలుకలా వ్యవహరించేవారు. జి.సూర్యం మంచి ఉపన్యాసకులు. ఆయన షోడా బండితో నవభారత్‌ టుబాకో కంపెనీ గేటు వద్ద చిరు వ్యాపారిగా వచ్చి కంపెనీ కార్మిక నాయకునిగా ఎదిగారు. ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని పరిష్కరించేవారు. గుంటూరులో శ్రీమతి కె.భాగ్యం నాయకత్వంలో వేలాదిమంది మహిళలు పనిచేశారు. ఆమెతో పాటు మంగమ్మ అనే కార్మిక నాయకురాలు పనిచేశారు. నేషనల్‌ టుబాకో కంపెనీలో కోట వెంకటేశ్వర్లు మంచి కార్మిక నాయకులుగా గుర్తింపు పొందారు. ఆయన మంచి ధైర్యశాలి. పల్నాడు ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలో నాగిరెడ్డి నాయకత్వంలో కార్మిక సంఘాల నిర్మాణం జరిగింది. సున్నపు మిల్లులలో, గ్రానైట్‌ పరిశ్రమలో యూనియన్ల స్థాపన, పిడబ్ల్యుడి ఉద్యోగ, కార్మికులలో సి.హెచ్‌.కాంతారావు, వి.శివప్రసాద్‌, అవ్వారి భావనారాయణ, జి.అమరలింగం, ఉప్పలపాటి రంగయ్యలు పనిచేశారు. పై అన్ని యూనియన్ల నిర్మాణంలో ఏఐటీయూసీ సంస్థాగత నిర్మాణంతో ఉద్దండ కార్మిక నాయకుల నేతృత్వంలో పనిచేసింది. 1970 జనవరి 28 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఏఐటీయూసీి 28వ జాతీయ మహాసభలు గుంటూరు నగరంలో బ్రహ్మాండంగా జరిగాయి. వేలాది కార్మికులతో ప్రదర్శన జరిగింది. అప్పటి వరకు సి.పి.ఐ.(ఎం) లో ఉన్న ప్రముఖ కార్మిక నాయకులు, బొంబాయి నగర మేయర్‌ ఎస్‌.ఎస్‌.మిరాజ్‌ కర్‌ పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఏఐటీయూసీి మహాసభలలో పాల్గొన్నారు. ఈ మహాసభలో ఏఐటీయూసీి అధ్యక్ష, ప్రధాన కార్మదర్శులుగా ఎస్‌.ఎస్‌.మిరాజ్‌ కర్‌, ఎస్‌.ఎ.డాంగేలు ఎన్నికైనారు. గుంటూరులో జాతీయ మహాసభలు జరగటం రాష్ట్ర ఏఐటీయూసీలో గుంటూరు ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఏఐటీయూసీ రాష్ట్ర 2వ మహాసభ 1959 మే 810 తేదీలలో గుంటూరులో జరిగింది. 1999 ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీలలో 11వ మహాసభకు గుంటూరు ఆతిధ్యం ఇచ్చింది. ఇప్పుడు 22 సంవత్సరాల తరవాత రాష్ట్ర 17వ మహాసభకు గుంటూరు ఆతిధ్యం ఇవ్వబోతున్నది.
వ్యాస రచయిత ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img