Monday, April 22, 2024
Monday, April 22, 2024

క్రోనీ లాలన

పురాణం శ్రీనివాస శాస్త్రి

ఆపద్బాంధవుడిలా కనిపిస్తుంది. తలలో నాలికలా తోస్తుంది. కుటుంబంలో విడదీయరాని దోస్తు అవుతుంది. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారాది విద్యల్లో ఆరియు తేరినట్లు కనిపిస్తుంది. దేముడు మరుగున పడిపోయే దైవ స్వరూపంలా అనిపిస్తుంది. కేపిటలిజం ‘మహా చెడ్డ’ మంచి మిత్రుడోలె చేరువవుతుంది. ‘నేను నేను కాదు నేను నీవే’ అంటూ మన జేబులో చేయి పెట్టి నీ, నా అభేదంతో ‘కైంకర్యం’ చేస్తుంది. ఇన్ని వేషాలు, రూపాల ఆసామీని ఏమంటాం? మోసగాడు అని కేపిటలిస్టు మోసగాడే కానీ ఆత్మీయుడిలా కనిపించి తిష్ఠవేసే టైపు కాబట్టే దాన్తో జాగ్రత్త అన్నారు మార్క్సిస్టు విజ్ఞులు. కేపిటలిస్టు మోసగాడు, మార్క్సిజంని కూడా దూరం పెట్టకుండా మచ్చిక చేసుకుంటున్నాడు. కాంగ్రెస్‌వాళ్లు సంస్కరణాభి లాషుల్లా కనిపిస్తూ కేపిటలిజానికి తివాచీలు పరిచి రిఫార్మ్స్‌ ముసుగులో కేపిటలిస్టు బుట్టలు దేశ జనులకు అల్లారు. ఇప్పుడు కేపిటలిస్టుల్లో ఎంపిక చేసిన కొద్దిమంది ‘క్రోనీ’లకు సెంటు పూసే గన్మెంటు వచ్చాక ‘క్రోనీ కేపిటలిజం’ అనే కొత్త పోకడ మొదలెట్టి అందులో పాతబడిపోతున్నారు మన పాలక ఏలికలు. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన జపం, వస్తూత్పత్తి జపం, వ్యవసాయ సాగుబడి జపం, జిడిపి నిలకడ జపం వగైరా అన్ని జపాలూ మానేసి అన్నిటినీ కలిపి కేపిటలిస్టు జపం నేర్చాయి. ‘కేపిటలిస్టు ఒక్కడూ ఉంటే చాలు... క్రోనీ రకం వాడు అయితే మరీ మంచిది. ఇక మనం రాం భజన చేసుకుంటూ స్వర్గంలో సద్గతులు పెంచుకుంటూ కూచోవచ్చు. ఏ సామాజిక రంగం గురించీ బెంగ అక్కరలేదు’ అన్నట్టు మన పాలక ఏలిక స్వాములు ‘క్రోనీ లాలన’ సాగిస్తున్నారు. క్రోనీ లాలన బాహాటంగా సాగిస్తూ, ఒప్పందాలు చాటుమాటుగా చేసుకోడం ఇప్పటి రివాజు. అసలు ఇప్పుడు పరిపాలన అంటే పెద్ద బిజినెస్‌ డీల్‌ అనుకొనేవాళ్లు పోగయ్యారు. ‘‘దేశం ఆస్తులను ‘వ్యాపారంగులోళ్లకి’ అయినకాడికి అమ్మేయడం మదర్‌ ఆఫ్‌ ఆల్‌ సంస్కరణాస్‌’’ అంటున్నారు నిస్సిగ్గుగా. ఉద్యోగాలడిగితే ఒకడు పకోడీలు అమ్ముకోమంటాడు...మరోడు హమాలీఅయితే మంచిదికాదా అంటాడు... వెరసి అసలుమాకు అస్తమానూ తలలూపే మేలురకం గొర్రెలు కావాలి. వోట్లేసేందుకే ప్రజలు కావాలి. ‘కాబట్టి మీరంతా గొర్రె మనుషులై పోతే మాకు మంచిది, మీకూ మంచిది. ఎంచక్కా మీకు డిమాండ్లుండవు. మాకు ఎన్నికల భయం ఉండదు... అసలు ఇవిఎంలే అక్కరలేదు’ అని ఢంకా బజాయించడమే నేడు మన ఏలినోరు ఏలుబడిని చాప చుట్టేసి లంగ్‌ పవర్‌ చూపిస్తూ చెబుతున్న సంగతి. పరిపాలనసంగతి ప్రజలు మరిచి పోయేలా ఏలినోరిలో ఒకడు ఆవు అంటాడు. ఒకడు గోమూత్రం అంటాడు. సర్వం గోమయం అంటాడు ఇంకో ఏలిక ఎలక. వీళ్లందరి నాయక మ్మన్యుడు అబద్ధాలు ఆపడానికి తప్ప నోరు విప్పడు. ఆయన నోరు విప్పాడంటే నెహ్రూని తిట్టడానికీ, కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించడానికీ, సైన్సు విశేషాలు తనకెంత తెలుసో చెప్పడానికి తప్ప మరొకందుకు కాదు. అన్నట్టు ఆరారగా నెహ్రూ గారు వీళ్ళ నాలుకలపై నానుతూనే ఉన్నారు. ఆక్సిజన్‌ కొరత నుంచి, పెగాసస్‌ నీతి లేని నిఘా వ్యవహారం, అస్సాం` మిజోరం యుద్ధ సరిహద్దుల దాకా ఏ సమస్య తెర మీదకు వచ్చినా నెహ్రూని ఆవహింపజేసి, ఎదురుగా నిలబెట్టి, తిట్ల అష్టకాలు, దండకాలు లంకించుకుని ‘చూశారా సమస్యలు పరిష్కరించేస్తున్నాం’ అనడం నేర్చారు పాలక ఈకలు లేదా పాలకతోకలు, పాలక ఏలికలు. వీళ్ల వక్రీకరణికాలు ఎంత రంజుగా ఉంటాయంటే ‘సర్దార్‌ పటేల్‌’ బీజేపీలోకి ఆరెస్సెస్‌ రూట్‌లో వచ్చిన కాషాయ కషాయ ప్రేమికుడని మనం అనుకుంటాం. ఆదిలో గాంధీని తిట్టి, తరవాత గాంధీ అనుంగు శిష్యుడై, ఆజన్మాంతం కాంగ్రెస్‌ గొడుగు నీడ వీడని నెహ్రూ కుడి భుజం అనుకోం. ఆరెస్సెస్‌ను నిషేధించిన నాయకుడని తెలియదు. అబద్ధపు బాజాల మోతే నేటి పాలక ప్రతాపం అనుకునేంతగా వారి మాటల మాయలో పడతాం.
వాళ్లని పోలింగు పరాజయంలోపడేస్తే మనం ఇకవారి ఏ మాయ లోనూ పడక్కరలేదు. అన్నట్టు సర్దార్‌పటేల్‌గారు బార్‌ కౌన్సిల్‌ మీటింగుల్లో గాంధీగారిమీద జోకులేస్తూ, తేలిగ్గా కొట్టిపారేస్తూ, ఆయన అహింస ఆలోచనని ఈసడిరచేవారట. ఐతే పటేల్‌ కేసుల్లేని కష్టకాలంలో పడ్డప్పుడు గాంధీగారు దళిత ప్రేమ ఆయనపై కురిపించి తన కేసులు కొన్ని ఆయనకి ఇప్పించి ఒడ్డున పడేశారట. అప్పటినుంచీ 1950లో పోయేదాకా పటేల్‌ గాంధీని తలమీద మోశారు. అలాగే నెహ్రూని గురువుగా పెట్టుకుని కుడి భుజం అయిపోయారట. మన సంఫీుయులు చెప్పేది విన్నా, రాసేది చదివినా పటేల్‌ బీజేపీలో చేరిపోయాడనుకుంటాం. అబద్ధాలకి చేయెత్తు శిల్పరూపం ఇచ్చేవాళ్ల మాయా మేయ జగంలో మనం ఉన్నాం. 2024లో ఆ మాయా ప్రపంచపు గాలిపటం దారం తెగిందా బతికిపోతాం! లేదా ఆక్సిజన్‌కొరతకి అబద్ధాలు తోడైనట్లు ఉక్కిరిబిక్కిరవుతాం. అంతా ఇవిఎంల మాయ మరి! క్రోనీ లాలన కొనసాగాలన్నా అదే!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img