Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సైన్స్‌ రచన సామాజిక అవసరం

సైన్స్‌ … కథ కమామిషు

నిర్వహణ : డా॥ నాగసూరి వేణుగోపాల్‌

అవసరం! అవకాశం!
అవును, సైన్స్‌ రచన సామాజిక అవసరం…
అలాగే, సైన్స్‌ రచన చేయగలగడం వ్యక్తిగత అవకాశం…
ఈ విషయాలు స్పష్టంగా తెలియని కాలంలో – నా సైన్స్‌ చదువుకూ, సైన్స్‌ రచనకూ పునాది పడిరది. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1976లో-ఎనిమిదో తరగతి పుస్తకాల చదువు మధ్యలో తెలుగుఅకాడమీ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం భౌతిక శాస్త్రం తొలి అధ్యాయం అమితంగా ఆకర్షించింది.
రాత్రి ఎలా ఏర్పడుతుంది, పగలు ఎలా వస్తుంది, వర్షం ఎందుకు పడుతుంది. .. ఇలాంటి ప్రశ్నలు పది హేను, ఇరవై వేసి – వీటికి జవాబులు చెబుతూ సైన్స్‌ ఎలా మొదలైందో వివరించి, సైన్స్‌ చరిత్ర ఒక పాతిక పేజీల పాటు సాగుతుంది. ఈ పుస్తకం 1968లో వచ్చిన తొలిప్రచురణ కావచ్చు. తర్వాతి సంవత్సరాలలో పేజీలు తగ్గించాలని ఈ అధ్యాయాన్ని పరి హరించారు. భౌతిక శాస్త్రం తొలి పేజీల్లో న్యూటన్‌ – ఆపిల్‌ పండు కథ కన్న ఎక్కువ ఆకర్షించిన విషయం ఒకటుంది. అయస్కాంతసూచి కాటుకడబ్బా అంతపరిమాణంలో ఉ ంటుంది. అందులో ఒక సూది వంటిది – ఎల్లప్పుడూ ఉత్తరాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాంటి సూచిని తీసుకుపోతున్న ఒక పెద్దాయనకు – ఒక ప్రాంతానికి పోగానే సూచి ఇంకో దిశను చూపించిందట. సూచి పాడయిందని సదరు పెద్దాయన దాన్ని పడవేసి చక్కా పోయారట. అదే అనుభవం మరోసారి ఇంకొ కాయనకు జరిగిందట. ఆయన ఆశ్చర్యపోయి, శోధించి తెలుసుకుందేమిటంటే, అక్కడ ఇనుప ఖనిజం గనులున్నాయని. రెండో వ్యక్తి శాస్త్రవేత్త ! ఈ విషయం తొలుత చదివినపుడు విపరీతంగా ఉద్వేగపడ్డాను,ఆనందపడ్డాను! ఇలాంటి విషయాలు ఎక్కువమందికి చెబితే బావుంటుందని అనిపించింది. అప్పటికే రచన మీద మమకారం ఉంది కనుక, ఈ నేపథ్యం సైన్స్‌ రచనకు పునాది వేసి ఉండవచ్చు. సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు – కళాశాల బయట చదువవచ్చు. కానీ, సైన్స్‌ పూర్తిగా చదువుకోలేమని స్పష్టత ఉండటంతో భౌతిక శాస్త్రాల వైపు చదువు సాగింది. ‘‘…. నిజానికి దేన్నైతే దైవ శక్తిగా నిన్న భావించామో, దాన్నే నేడు ప్రకృతి శక్తిగా లెక్కిస్తున్నాం. ఎక్కడయితే భౌతిక శాస్త్రజ్ఞుడు విచారించి విషయాన్ని కనుక్కుంటాడో అక్కడ నుంచి పూజారి పలాయనం చిత్తగిస్తాడు. మనకు అర్థం కానిదీ, తెలియనిదీ ‘దేవునిగా’ చలామణి అవుతుంది. నిక్కచ్చిగా చెప్పాలంటే అసలు అజ్ఞానం అనేది దేవుడికి సమానం అవుతుంది. సైన్స్‌ విస్తరించి అభివృద్ధి చెందటంతో రోజు రోజుకు దేవుడి స్థానమూ, ప్రభావమూ కుంచించుకు పోతున్నాయి….’’ అని డా॥ హెచ్‌. నరసింహయ్య ‘‘సైన్స్‌ అండ్‌ హ్యూమనిజం’’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. ఈ వ్యాసాన్ని 1986లో కర్ణాటకరాష్ట్రం పి.యు.సి. అచ్చుపుస్తకంలో ఉపోద్ఘాతంగా చదివినపుడు మళ్ళీ 1976 కాలపు ఉద్వేగానికి లోనయ్యాను. ఐదారుసార్లు చదివాను. చదివిన కొద్దీ, నేనే చదివితే ఏం ప్రయోజనం, తెలుగులో ఉంటే ఎక్కువ మంది తెలుగు వారు చదువుతారు గదా అనే ఆలోచన వచ్చింది. అలా ఆ వ్యాసాన్ని అనువాదం చేశాను. ఈ అనువాదం కనీసం ఆరేడు సార్లు తిరగ రాసి ఉంటాను. ఆ ఆలోచనలపై మక్కువ అంతటిది. ఈ అనువాదం నానా పత్రికల కార్యాలయాలు తిరిగాను. చివరికి 1990 జనవరిలో తెలుగు అకాడమీ పత్రిక ‘‘తెలుగు’’లో ప్రచురించింది.
సైన్స్‌ ఎందుకు-పాపులర్‌ సైన్స్‌, సైన్స్‌ అనువాదం, పర్యా వరణం, పర్యావరణ కథల సంపాదకత్వం, సైన్స్‌ ఫిక్షన్‌ కథల సంపాదకత్వం – వగైరా వాటికి ఎందుకు అని ప్రశ్నించు కుంటే, ఇదివరకు పేర్కొన్న రెండు విషయాలు ఆధారంగా కనబడతాయి. సైన్స్‌ ఎందుకు – తర్వాత తారస పడే ప్రశ్న విరివిగా సైన్స్‌ రచనలు ఎందుకు రాశారు – అని ఎవరయినా (నా రచనల తీరు గమనించిన వారు) ప్రశ్నించగలరు. 1986 మార్చి 9న ఆదివారం ఆంధ్రప్రభ సంచికలో ‘‘వేమన వాదనలో కవిత’’ అనే సాహితీ విమర్శ ప్రచురితమైన తొలి పూర్తి స్థాయి వ్యాసం. రెండవది ఆంధ్రపత్రిక దిన పత్రిక 1987 అక్టోబరు 25న తెలుగు పత్రికల సంపాదకీయాలపై సంపాదకీయ పుటలో ప్రధాన వ్యాసం. 1987 డిసెంబరు 8వ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకీయ పుటలో ‘సోలార్‌ వాటర్‌ హీటర్‌’ మీద సైన్స్‌ వ్యాసం మూడవది. ఆనాడు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రికలు మూడూ పెద్ద పత్రికలే. మొదటి వ్యాసం సాహిత్యం కాగా, రెండవది జర్నలిజం, మూడవది సైన్స్‌. కనుక ముప్పేటగా మూడిరటిలో ప్రయత్నం సాగింది. అయితే సాహితీ విమర్శకులు చాలా మంది ఉన్నారు. జర్నలిజానికి సంబంధించి విమర్శలు చేయడానికి నా స్థాయి సరిపోలేదేమో. సైన్స్‌ రాసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ కారణాల చేత నా కలం సిరాలో ఉండే సాహిత్యం, జర్నలిజం, సైన్స్‌ పార్శ్వాలలో సైన్స్‌ ప్రస్ఫుటంగా పాఠకులకు కనబడిరది. 1993లో ‘ఆహ్వానం’ మాస పత్రికలో నా సైన్స్‌ వ్యాసాలు రెండు నెలల కొక సారి కొంతకాలం ప్రచురిత మయ్యా యి. 1996 ఫిబ్రవరిలో ‘తెలుగు విద్యార్థి’ మాస పత్రికలో, 1996 మార్చిలో ఆంధ్రభూమి దినపత్రికలో నా సైన్స్‌ కాలమ్స్‌ మొదలయ్యాయి.
1997లో ఆంధ్రభూమి దినపత్రికలోనే మొదలయిన ‘సైన్స్‌ స్కాన్‌’ ‘సైన్స్‌ -సామాజికం’ పార్శ్వాన్ని స్పృశించింది. 1998లో రెండు సైన్స్‌పుస్తకాలు ప్రచురించాను. ఇవి నా తొలి పుస్తకాలు. నేడు 20 దాకా సైన్స్‌ కాలమ్స్‌ రాసి ఉండవచ్చు. 20 దాకా సైన్స్‌ పుస్తకాలు ప్రచురించి ఉండవచ్చు! ఈ నేపథ్యంతోనే ఈ వ్యాసం ప్రారంభంలో అవసరం, అవకాశం అన్నది.!!
సాహిత్యం అంటే ఇష్టం, జర్నలిజం అంటే మమకారం. కనుక రకరకాల రచయితలను చదవడం,. పలు పత్రికలు పరిశీలించడం అలవాటుగా మారింది. కనుక రచనకు మూల దినుసులు ఏమిటో బోధపడిరది. పత్రికలకు, ప్రజలకు ఏది అవసరమో, దాన్ని ఎలా రక్తి కట్టించాలో అవగతమైంది. అందువల్లనే 1999లో తెలుగులో తొలి పర్యావరణం కాలమ్‌ ‘ప్రకృతి – వికృతి’ని ప్రారంభించాను. ఒక పుష్కరం తర్వాత తెలుగులో పర్యావరణ కథలను 2013లో విహారితో కలసి తొలి సంకలనం వెలువరించాను. ఈ పర్యావరణ తెలుగు కథల సంపాదకత్వానికంటే ముందు తెలుగులో వెలువడిన సైన్స్‌ ఫిక్షన్‌ కథల సంకలనానికి నామిని సుధాకర్‌తో కలసి సంపాదకత్వం వహించాను. అయితే సాహిత్య అకాడమి ఈ పుస్తకాన్ని ఇంతవరకు వెలువరించలేదు. త్వరలోవస్తుంది. పర్యా వరణ కథలసంకలనం నా ఆలోచన కాగా, సైన్స్‌ఫిక్షన్‌ సంకలనం అకాడమి ఆదేశం. ఇప్పుడు మాల్యాద్రితో కలసి ‘సైన్స్‌ ఎందుకు రాస్తున్నాం’ అనే సంకలనం తీసుకు రావడం తెలుగుభాషలో ఆ అవసరం ఏర్పడిరదనే నా ఆలోచనకు రూపం.
ఎందుకు అనే విషయం చెప్పాక, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు లేకపోయినా జవాబు చెప్పడం అనేది నిండుదనం కోసం. నన్నయ మహా భారతం అనువదించిన ప్రాంతంలోనే, కాలంలోనే పావులూరి మల్లన కూడా గణిత సార సంగ్రహం పుస్తకాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. నిష్కర్షగా మాట్లాడాలంటే నన్నయ సామర్థ్యం కంటే, మల్లన సామర్థ్యం మరింత విస్తృతమైంది. అయితే ఈ విషయాలు విశ్లేషించాలంటే సాహితీ విమర్శకులకు గణితం బోధపడాలి. అప్పటి కాలంలో సాహిత్యం మతం ఛాయలోనే సాగింది. మల్లన తన కాలపు అవసరాలకు తగినట్టు మత ప్రతీకలు మార్చి, గణితాన్ని చక్కగా తెలుగు చేశారు. గురజాడ అప్పారావు ఆంధ్రభారతిలో ‘దిద్దుబాటు’’ రాసిన 1910 సంవత్సరంలోనే ఆచంట లక్ష్మీపతి సిజరిన్‌ గురించి ఆంధ్ర పత్రిక సంవత్సరాది సంచికలో సచిత్ర వ్యాసం ప్రచురించారు. ఆంధ్రభారతి కన్నా ఆంధ్రపత్రిక పెద్ద పత్రిక.
సైన్స్‌ తెలుగు రచనల శ్రీకారాలు మహోజ్వలంగా ఉన్నా, తర్వాత జరిగిన కృషి పెద్దగా లేదు. సైన్స్‌ వ్యాసం వస్తువులో, భాషలో, శైలిలో పరిపుష్టం కాలేక పోయింది. గత రెండు దశాబ్దాలలో తెలుగు సైన్స్‌రచన మరింత అధ్వాన్నంగా మారింది. సైన్స్‌ ఫిక్షన్‌ కథలు కన్నా నవలలు ఎక్కువ. అయితే వాటిని బాహాటంగా సైన్స్‌ ఫిక్షన్‌ నవలలని పేర్కొనకపోవడం తెలుగు వార, మాసపత్రికల సంప్రదాయం. ఇక సైన్స్‌ గేయం, సైన్స్‌ నాటిక, సైన్స్‌ కవిత్వం గురించి చర్చించకపోవడం ఉత్తమం. ఇవన్నీ బలపడాల్సిన పార్శ్వాలు. అయితే తెలుగుకే ముప్పు ఏర్పడి, తెలుగుపత్రికల్లో సైన్స్‌ అంతర్ధానమైతే-ఈ పనులు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. అంశాల వారీగా పారిభాషిక పదకోశాలు ఉన్నా, అవి మెరుగు పడలేదు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి సమగ్రమైన నిఘంటువు గానీ, సర్వస్వం గానీ రాలేదు. సాధారణ నిఘంటువు పరిస్థితే ఆశాజనకంగా లేకపోతే, ఇవి ఎలా సాధ్యమని ఎంతో మంది ప్రశ్నించవచ్చు.
ఈ నేపథ్యంలో సైన్స్‌ రచనలో చాలా మెళకువలు అవసరం. చరిత్ర, సామాజికం, ఆర్థిక కోణం, సాహితీ పార్శ్వం సైన్సు ఉండాలి. సైన్స్‌ రచయితకు ఈ స్థాయి దార్శనికతా, దాంతో పాటు దాన్ని సాకారం చేసుకోగల భాషా సామర్థ్యం, పరిశోధనా పటిమ, విశేషమైన ఓపికా ఉండాలి !
ఇదీ అవసరం !! దానికి అవకాశం రావాలి !!!
వీటిలో వైయుక్తికమూ ఉంది, సామాజికమూ ఉంది!
వ్యాస రచయిత సెల్‌ : 9440732392

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img