Friday, December 9, 2022
Friday, December 9, 2022

చేనేతకు చేయూతనిద్దాం

డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి

మానవ కనీస అవసరాలుగా కూడు, గూడు, బట్ట వస్తాయి. అన్నదాత వ్యవసాయం తరువాత అతి పెద్ద పరిశ్రమగా నేతన్న చేనేతకు పేరుంది. ప్రతి వ్యక్తికి పుట్టిన క్షణం నుంచి తుది శ్వాస వరకు వస్త్రధారణ తప్పనిసరి. మనం ధరించే వస్త్రాలే మన మానసిక, ఆర్థిక, సామాజిక స్థాయిని గౌరవాన్ని కట్టబెడతాయి. పంచెకట్టులో పురుషులు, చీరకట్టులో స్త్రీలు హుందాగా, అందంగా, ఆకర్షణీయంగా, సాంప్రదాయం ఉట్టిపడేలా కనిపించడానికి ఏకైక కారణం మనం ధరించే అద్భుత వస్త్రాలే. చేతుల్లో మాయాజాలం, సప్తవర్ణ సింగిడి చీర నేతలో సృజన, దారం పోగును నాట్యం చేయించగల నైపుణ్యం నేతన్న హస్తానికే ప్రత్యేకం. నాడు విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ చేనేత వస్త్రాలను ప్రోత్సహించిన మహాత్మాగాంధీకి ఊపిరిగా నిలిచిన నూలు వడికే రాట్నంతో ప్రారంభమైన చేనేత వస్త్రాల ప్రచారం నేడు ఆధునిక సాంకేతిక యంత్రాల మధ్య నలిగి ప్రాభవాన్ని పోతున్నది. సిరిసిల్ల చేనేతవస్త్రాలు, మంగళగిరి చీరలు, బెనారస్‌ వస్త్ర వెలుగులు, ధర్మవరం ధగధగలు, కలంకారీ కళాకాంతుల వస్త్రరంగులు లాంటివి మనల్ని నేటికీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.
భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న వేళ భరతజాతి ఈనెల 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’ పాటిస్తున్నారు. మన చేనేతలు ప్రపంచానికే ఆదర్శమని, మన దేశానికి గర్వకారణమని ప్రచారం చేయాల్సిన సందర్భమిది. 2015 ఆగస్టు 07న ప్రారంభమైన జాతీయ చేనేత దినం వేదికగా చేనేత వస్త్రాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, ఆరోగ్య సాధనకు చేనేత వస్త్రాలను వాడాలనే ప్రచారం చేయడం జరుగుతుంది. చేనేత వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలు 31.45 లక్షలు ఉన్నారని, అదనంగా 4.33 మిలియన్ల ఉద్యోగ ఉపాధులను కల్పిస్తున్నదని నేటి అంచనా. 07 ఆగస్టు 1905న ప్రారంభమైన ‘స్వదేశీ ఉద్యమానికి’ గుర్తుగా ప్రతి ఏట ఆగస్టు 07న చేనేత దినం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జాతీయ చేనేత దినం-2021 నినాదంగా ‘హాండ్లూమ్‌ – ఆన్‌ ఇండియన్‌ లెగసీ’ అనే అంశాన్ని తీసుకున్నారు.
నేతన్న హస్తకళానైపుణ్యంతో వస్త్రాలపై వెలసే రంగుల సింగిడిలు మన కళ్ళకు విందులను వడ్డిస్తున్నాయి. జాతీయ స్థాయిలో నేషనల్‌ హండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నేతృత్వంలో ‘మై హాండ్లూమ్‌ మై ప్రైడ్‌ ఎక్స్‌పో’ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 22 రాష్ట్రాలకు చెందిన 125 చేనేత సంస్థలు పాల్గొంటూ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడం, విక్రయించడానికి అవకాశం కలుగుతోంది. దేశంలో 1246 చేనేత క్లస్టర్లు ఉండగా, ఆంధ్రలో 98, తెలంగాణలో 34 ఉన్నాయి. ప్రపంచ వస్త్ర ఉత్పత్తుల్లో భారతదేశం 6.9 శాతంగా ఉండగా, చైనా 52.2 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకుంటున్నది. ప్రపంచ చేనేత వస్త్ర ఉత్పత్తుల్లో 95 శాతం భారతదేశమే ఉత్పత్తి చేస్తున్నది. మన దేశ సంస్కృతి వారసత్వాలు ఉట్టిపడేలా నేతన్న చూపిస్తున్న హస్తకళానైపుణ్యాలతో చేనేత పరిశ్రమకు ఆదరణ పెరగాలని, నేతన్న కుటుంబం ఆర్థికంగా బలపడాలని మనందరం కోరు కోవాలి. చేనేత పరిశ్రమలో 70 శాతం మహిళలే ఉంటారని, వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేనేత బట్టకు పట్టం కట్టడం అత్యవసరమని గమనించాలి.
చేనేత వస్త్రాల్లో ముఖ్యంగా కాటన్‌, సిల్క్‌, ఉన్ని, ఖాదీ, పట్టు వస్త్రాలు వస్తాయి. నేతన్నకు చవకగానూలు అందుబాటు లోకి తేవడం, పరిశ్రమలు నెలకొల్పడానికి ఆర్థిక చేయూతను ఇవ్వడం, వస్త్ర ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యతగా గుర్తించాలి. నేతన్న ఉత్పత్తుల్లో చీరలు, పంచెలు, కాటన్‌ దుస్తులు, గృహ వస్త్ర ఉత్పత్తులు, బెడ్‌ షీట్స్‌, దుప్పట్లు, శాలువాలు, కండువాలు, కార్పెట్లు, డ్రెస్‌ మెటీరియల్స్‌, అంగవస్త్రాలు లాంటివి అనేకం ఉన్నాయి. చేనేత నూలును ఖాదీ వస్త్రంగా, మిల్లులో ఒడికిన నూలును హాండ్లూమ్‌ ఫాబ్రిక్‌గా వస్త్ర ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంలో భాగంగా ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో చేసి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒడిసా ఇక్కత్‌, ఆంధ్రప్రదేశ్‌ కలంకారి, గుజరాత్‌ బంధనీ, పటన్‌ పటోల, యుపీ బ్రెకేడ్స్‌ ఉత్పత్తులకు అనాదిగా విశేష ఆదరణ కొనసాగుతున్నది. మన దేశంలో బహుళ ఆదరణ పొందిన హాండ్లూమ్‌లలో కాలికో గిల్డ్‌, రేవా సొసైటీ, వైశాలి యస్‌, జిగ్మత్‌ కోచూర్‌, హెర్లూమ్‌ నాగా, రా మాంగో, అబ్రహమ్‌ తాకోర్‌, సరితా హండాలు ఉన్నాయి. మన మూలాలను వెతుక్కుంటూ, సదాచారాలను పాటిస్తూ, చేనేత హస్తకళలను ఆదరిస్తూ, అందమైన హూందాగా కనిపించే చేనేత వస్త్రాలను సగర్వంగా ధరిస్తూ, ఖాదీ త్రివర్ణ పతాకానికి సవినయంగా సలామ్‌ చేద్దాం. నేతన్న కళ్ళల్లో ఆనంద హరివిల్లులు దర్శిద్దాం.
వ్యాస రచయిత సెల్‌ 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img