Friday, April 26, 2024
Friday, April 26, 2024

అంగన్వాడీ, ఆశాల గోడు వినండి

డా. సుచిత్ర కృష్ణ ప్రసాదు

దేశంలో అంగన్వాడీల, ఆశా కార్యకర్తల గోడు వినే పాలకులు కనిపించటం లేదు. శిశు అభివృద్ధి పథకం కింద దాదాపు 14 లక్షల మంది అంగన్వాడీలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద 9 లక్షల మంది ఆశా కార్యకర్తలు సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థలో ఇంత భారీ సంఖ్యలో మహిళలు పని చేయటం బహుశా ప్రపంచంలోనే మన దేశంలో ఎక్కువ. దశాబ్దాలుగా తమను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని కోరుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఈ పథకాల కింద పని చేస్తున్న వారిలో దాదాపు అందరూ అణగారిన వర్గాల నుండి వచ్చిన వారే. పని భారం ఎక్కువ, ఎప్పుడో ఇష్టానుసారంగా వారికి చెల్లింపులు ఉంటున్నాయి. వీరికి సరైన వేతనం లేదు. పారితోషికంగా కొంత చెల్లిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద అసోసియేషన్‌ వీరిది కావచ్చు. నాయకత్వంలో అత్యధికులు మహిళలే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి చెరి కొంత నిధులను సమకూరుస్తాయి. అలుపెరుగని పని చేస్తున్నప్పటికీ వేతనం కాకుండా దశాబ్దాలుగా పారితోషికమే ఇస్తున్నారు.
వలంటీర్లుగా మాత్రమే పరిగణిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వీరు సేకరించిన ఆరోగ్యం, శిశు అభివృద్ధి సమాచారం ఆధారంగానే ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు చేస్తాయి. కొవిడ్‌ మహమ్మారి దేశంలో ప్రవేశించిన నాటి నుంచి వీరు అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైరస్‌ సోకిన వారిని గుర్తించటం, వైరస్‌ విస్తరణ స్థాయి తెలుసుకోవటం, లాక్‌డౌన్‌ సమయాల్లో అణగారిన వర్గాల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయటం లాంటి అనేక కీలకమైన పనులు నిర్వహించారు. కొవిడ్‌ వారియర్‌లుగా పనిచేశారు. గతంలో వీరు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసి ప్రయోజనం పొందడానికి వీలులేదని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పదవులను వదులుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఆఫీసు పదవుల్లో ఉండటానికి వీలు లేదని చెప్పింది. అయితే ఇలాంటి ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలా ఎన్నికైన వారు అంగన్వాడీలుగా పని చేయరాదని హైకోర్టులు అభిప్రాయపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేయకూడదని పంచాయతీరాజ్‌ చట్టాలు ఉన్నాయి. అంటే వీరు వలంటీర్లుగానే ఉండాలన్నది ప్రభుత్వాల అభిప్రాయం.
పని విధానాన్ని అనుసరించి నెలకు రూ. 250/లు ఇన్సెంటివ్‌ ఇచ్చే విధానాన్ని 2018 అక్టోబరు నుంచి అమలు చేస్తున్నారు. పోషన్‌ అభియాన్‌ పథకం కింద ఐసిడిఎస్‌ కామన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే వాళ్లకు నెలకు రు.500/`లు ఇన్సెంటివ్‌ ఇస్తున్నారు. ఆశాలకు కూడా వారి పని విధానాన్ని అనుసరించి పారితోషికం చెల్లిస్తున్నారు. శిశు రక్షణలో పనిచేసే మహిళలకు అతి తక్కువగా పారితోషికాలు చెల్లిస్తున్నారు. అత్యధికంగా సేవలు పొందుతూ న్యాయంగా వారికి రావలసిన వేతనాలను చెల్లించటం లేదు. మహిళా కార్యకర్తలకు నిర్ణీత సమయంలో కనీస వేతనాలు, డీఎ, పని నుండి తొలగిస్తే ఇవ్వవలసిన ప్రయోజనాలను కార్మికుల మాదిరిగా వీరికి కూడా అందించాలి. బోనస్‌ను హక్కుగా పరిగణించాలి కాని దాతృత్వంగా మాత్రం కాదు. లేబర్‌ ఇన్స్‌పెక్టర్లు తదితర అధికారులు వీరు నివసించే ప్రాంతాలను సందర్శించి వారికి తగిన సదుపాయాలను కల్పించాలి. దేశంలోనే కొన్ని ప్రాంతాలలో ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్య విధానంలో అంగన్వాడీ కేంద్రాలను నడుపుతున్నారు.
వివిధ ప్రభుత్వ పథకాల అమలులో మహిళలు పని చేస్తున్నందున ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని వీరి యూనియన్లు చిరకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ ప్రయోజనాలు, వేతనాల సవరణ వర్తింప చేయాలి. ఇటీవల ప్రవేశపెట్టిన కార్మిక చట్టాల సవరణలో భాగంగా తాత్కాలిక కార్మికులను అనేక కేటగిరీలుగా విభజించటం, ప్రామాణిక ఉత్తర్వులను నిర్వీర్యం చేయటం, సమ్మె హక్కుపై ఆంక్షలు విధించటం లాంటివి ఉన్నాయి. అయితే కార్మికులుగా గుర్తింపునిస్తూ ఆమోదించటం కొంత ఊరట కలిగించే అంశం. అలాగే అత్యవసర సేవలను అందించే కార్మికులుగా గుర్తించాలి. క్షేత్ర స్థాయిలో తిరుగుతున్న వీరు వాస్తవంగా అత్యవసర సేవలను అందిస్తున్నారు. వీరు నిజంగా సమ్మె చేస్తే సమాజం మొత్తం ఇబ్బందుల పాలవుతుంది. కొవిడ్‌ మహమ్మారి కాలంలో అదనపు గంటలు కూడా పనిచేశారు. కొవిడ్‌ మూడో దశలో కీలకమైన పనులు నిర్వహించవలసింది వీరే. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి వీరి డిమాండ్లను నెరవేర్చాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img