Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆగస్టు 9 ‘‘సేవ్‌ ఇండియా డే’’

వి.యస్‌.బోస్‌

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులకు పాతరవేసి నియంతృత్వ విధానాలు అనుసరిస్తోంది. కార్మిక, కర్షక, ప్రభుత్వరంగ వ్యతిరేక చర్యలను, కార్పొరేట్‌ అనుకూల చర్యలను అతివేగంగా అమలు చేస్తోంది. గత ఏడాది మార్చి నుంచి నెలకొన్న కరోనా పరిస్థితులను ఉపయోగించు కొని అనేక దుష్ట చట్టాలను తెచ్చింది. దేశంలో కార్మికవర్గం అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నప్పటికీ 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌ల రూపంలో తీసుకొచ్చి కార్మికహక్కులను హరిస్తోంది. దేశవ్యాపితంగా కార్మికులు, ఉద్యోగ సంఘాలు సమైక్యంగా చేస్తున్న నిరసనలు, ఉద్యమాలు, సమ్మెలతో భారతావని మారుమ్రోగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొద్దుబారిన శరీరంతో చలనం లేని మట్టిబొమ్మలా ప్రవర్తిస్తున్నది. ఈ చట్టాల ద్వారా యూనియన్‌ పెట్టుకునే హక్కు, యాజమాన్యాలతో సంప్రదింపుల హక్కు, 8 గంటల పనిహక్కు, పని ప్రదేశాలలో భద్రతా సౌకర్యాలు పొందే హక్కు, కనీస వేతనాల హక్కు మొదలైన సర్వహక్కులను హరించేస్తున్నారు. లేబర్‌ కమిషనర్‌ స్థానంలో మీడియేటర్‌, అనేక లేబర్‌ కోర్టుల స్థానంలో ఏకైక హైకోర్టు దర్శనమివ్వ బోతున్నాయి. బీజేపీ ప్రభుత్వం కార్మికులను 21వ శతాబ్దంలోకి నడపటానికి బదులు 18వ శతాబ్దానికి నెట్టేసి నాటి బానిస వ్యవస్థను స్థాపించే ప్రయత్నం చేస్తోంది. మాటలలో సాయం, చేతలలో హక్కుల హరణం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ దగాకోరు విధానాలపై రైతు సంఘాలు దేశవ్యాపితంగా 8 నెలలుగా చలి, ఎండ, వాన అనే తేడా లేకుండా అన్ని కాలాల్లో ఒకే దీక్షతో మూడు దుష్ట చట్టాలను రద్దు చేయాలని అలుపెరుగని, వీరోచిత పోరాటం కొనసాగిస్తున్నారు. వీరి పోరాటానికి భారతావని జేజేలు పలుకుతూ వారికి అండగా నిలబడిరది. చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధర చట్టబద్దం చేయాలని, మండీ వ్యవస్థను కొనసాగించాలని తద్వారా ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సిఐ)ను బలోపేతం చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. చట్టాలు రద్దు చేసేది లేదు, కానీ సంప్రదింపులకు మేము సిద్దమని తొండిమాటలు వల్లిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. రైతుల పోరాటం విజయం సాధించాలని శ్రామికులు, కార్మికులు, సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. వారి విజయం దేశంలో ఆహార భద్రతకు రక్షణగా భావిస్తున్నారు. వారు విజయం సాధించకపోతే ఆకలి కష్టాల్లో ప్రజలు, అంతులేని ఆదాయంతో ఆదానీ, అంబానీలు సంతోషంతో కులికే పరిస్థితిలు సమాజంలో ఏర్పడుతాయి.
మూడు వ్యవసాయ చట్టాల్లో నిత్యావసర వస్తువుల చట్టం ఒకటి. నిత్యావసర వస్తువుల నిల్వ, పంపిణీని ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించి ఈ రంగంలో ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్‌ సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కార్పొరేట్‌ సంస్థలకు డబ్బు ఖర్చు కాకుండా సిడబ్ల్యుసి గోడౌన్లను అందుబాటులోకి తేవటం సివిల్‌ సప్లయ్‌ సంస్థలకు గోడౌన్లు లేని పరిస్థితిని సృష్టించి కష్టాల్లోకి నెట్టేయటం ఒకేసారి జరుగుతుంది. దీంతో సివిల్‌ సప్లయ్‌ సంస్థలు కష్టాలు ఎదుర్కొని కుంటుపడే పరిస్థితులు సృష్టించి ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పాలనే కేంద్ర ప్రభుత్వ నిగూఢమైన కుట్రలో ఇది భాగం.
రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా రాష్ట్రాల అనుమతులు లేకుండా ఎలక్ట్రిసిటీ చట్టాన్ని తీసుకురావటం దేశ సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నది. ఈ చట్టం మూలంగా పేద ప్రజలకు, రైతులకు ఇతర వర్గాలకు సబ్సిడీలు ఉండవు. ఉన్నత వర్గాలకు తక్కువ ధరలకే విద్యుత్‌ను అందిస్తారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న అనేక రాష్ట్రాలపై కేంద్రం ఇ.డి., సిబిఐ లాంటి నిఘా సంస్థలతో దాడులు చేయించడం కేంద్ర పెత్తందారి విధానానికి నిదర్శనం.
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించి తద్వారా ప్రైవేటీకరించటానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బహిర్గతం చేసి ఆ ఫ్యాక్టరీలలోని కార్మికులు, ఉద్యోగులు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నారు. వారి పోరాటాలను నిషేధించటంలో భాగంగా కేంద్రప్రభుత్వం అత్యవసర రక్షణ సేవల ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి కార్మికులు సమ్మె చేసే హక్కును, నిరసన తెలిపేహక్కును హరిస్తోంది. ఈ చట్టం ద్వారా సమ్మె చేస్తే జైలు, మద్దతు తెలిపితే జైలు, సమ్మెకు సహకరిస్తే జైలు ఇలాంటి నిర్భందాలతో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేయటానికి కార్మికుల రాజ్యాంగ హక్కును హరించటానికి బీజేపీ సిద్ధమైంది.
కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ కంపెనీలలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే వెసులుబాటును చట్టంమార్చటంద్వారా తీసుకొచ్చింది. ఈ కంపెనీలోని కార్మికులు ఆగస్టు 4న దేశవ్యాపిత సమ్మెచేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీచేశారు. జాతీయ బ్యాంకులను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా బ్యాంకులను విలీనం చేయటం, బ్యాంకు శాఖలను తగ్గించటం, బ్యాంకింగ్‌ వ్యవస్థలో దేశ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం మొదలు పెట్టింది. అయినా ప్రైవేటు బ్యాంకులకు ధీటుగా జాతీయ బ్యాంకులు వాటి సమర్ధతను చాటిచెపుతున్నాయి. జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరించ రాదని ఎఐబిఇఎ (ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌) లాంటి యూనియన్లు చేస్తున్న పోరాటాలపై సోషల్‌ మీడియాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ కేంద్ర ప్రభుత్వ అనుకూల వర్గాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగసంస్థల్లో వాటాలను ఉపసంహరించటం, ప్రైవేటీకరించటం ద్వారా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను మూసేయడానికి మోదీ కంకణం కట్టుకున్నాడు. తద్వారా దేశ స్వావలంబనకు తీవ్ర నష్టం తెస్తున్నారు.
ఒకే దేశం`ఒకే పన్ను అనే నినాదాన్ని ప్రచారం చేసిన మోదీ పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్‌ను ఆమోదించకుండా వెన్నుచూపారు. చీకటి వ్యాపారస్తులను నల్లధన కుబేరులను నిద్రపోకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన మోదీ వారంతా విదేశాలకు పారిపోయి సుఖమైన జీవితం గడుపుతుంటే చోద్యం చూస్తున్నారు. కరోనా కాలంలో వలస కార్మికుల కష్టాలు చూసిన ప్రజలంతా కన్నీరు పెట్టారు కానీ మోదీ ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు. కరోనా కాలంలో ప్రజలు, కార్మికులు కష్టాలు అనుభవిస్తే కేంద్ర ప్రభుత్వ అనుయాయులైన అంబానీ లాంటి కార్పొరేట్‌ సంస్థల ఆస్తులు విపరీతంగా పెరగటంలో అర్ధం ఏమిటి? ఇదేనా బీజేపీ పాలనా నీతి.
నిరంకుశ పోకడలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను ఓడిరచే వరకు నిరంతర సమరశీల పోరాటాలు నిర్వహించాలని కేంద్రంలోని కార్మిక సంఘాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. అనేక ఉద్యమాల, పోరాటాల కొనసాగింపుగా ఆగస్టు 9వ తేదీన ‘‘క్విట్‌ ఇండియా’’ స్ఫూర్తితో ‘‘సేవ్‌ ఇండియా డే’’ కార్యక్రమాన్ని నిర్వహించాలని భారత కార్మికవర్గానికి పిలుపునిచ్చాయి. కార్మికులంతా కదన రంగంలోకి దిగి కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపును జయపద్రం చేయాలి. అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి విజయవంతం చేయాలని రాష్ట్రంలోని కార్మిక, ఉద్యోగ సంఘాలూ పిలుపునిచ్చాయి. కార్మికులు, ఉద్యోగులంతా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 9391356527

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img