Monday, April 22, 2024
Monday, April 22, 2024

నినాదమై… నిలిచె

కూన అజయ్‌బాబు

‘బీజేపీ హఠావో…దేశ్‌కీ బచావో’… దేశంలోని అన్ని వర్గాల్లోనూ విన్పిస్తున్న ఏకైక నినాదమిదే. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ కార్మికులు, పాత్రికేయులతోపాటు అన్నివర్గాలకు చెందిన వారంతా ఒక చోటకు చేరుతున్నారు. తమ తమ డిమాండ్ల పరిష్కారం కోసం హక్కులే ఊపిరిగా ఉద్యమించబోతున్నారు. దేశంలో నెలకొన్న తీవ్రమైన అసంతృప్తి 2021 సెప్టెంబరు 27వ తేదీన భారత్‌బంద్‌ రూపంలో బయటకు కనబడబోతున్నది. ఎన్డీయే కూటమి తప్ప దాదాపు అన్ని రాజకీయపార్టీలు, పది కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సమాఖ్యలు, సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 40 శాతం మంది ప్రజలు ఈ భారత్‌బంద్‌లో పాల్గొంటారన్నది అంచనా. అన్ని వర్గాల హక్కుల పోరుకు సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. భరించరాని వ్యవస్థ ఏర్పడినప్పుడే విప్లవం పుట్టుకొస్తుంది. ఇప్పుడు జనాల్లో ఆగ్రహజ్వాల రగలడానికి కారణాలు లేకపోలేదు. మోదీ సర్కారు విధానాలే ప్రధాన కారణం. రైతులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల సమస్య ఇంకా అపరిష్కృతం గానే వుంది. అన్నదాతలు తమ ఆందోళనను నిరంతరాయంగా కొన సాగిస్తూనే వున్నారు. విద్యుత్‌ (సవరణ) బిల్లు 2021ను రద్దు చేయాలని, న్యాయబద్ధంగా రావాల్సిన చట్టబద్ధ ఎంఎస్‌పి (కనీస మద్దతు ధర) కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నాయకత్వంలో తొమ్మిది నెలలుగా పోరాటం జరుగుతూనే వుంది. సెప్టెంబరు 5వ తేదీన ముజఫర్‌నగర్‌లో ఎస్‌కెఎం ‘మిషన్‌ ఉత్తరప్రదేశ్‌’, ‘మిషన్‌ ఉత్తరాఖండ్‌’ ఉద్యమాలను ప్రకటించింది. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ నయా ఉదారవాద, మత విచ్ఛిన్నకర విధానాలతో సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఎస్‌కెఎం ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఓడిరచడమే లక్ష్యంగా కార్యాచరణ మొదలుపెట్టింది. ‘నేషనల్‌మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి)’ పేరుతో మోదీ ప్రభుత్వం ప్రజల సంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నింది. హర్యానాలోని కర్నాల్‌లో ఆగస్టు 28న హర్యానా మినీసెక్రటేరియట్‌ ముట్టడికి రైతులు పూనుకున్నారు. పోలీసులు జుగుప్సా కరంగా వ్యవహరించి, వారిపై లాఠీఛార్జికి పాల్పడి రక్తపాతం సృష్టించారు. కార్మికులకు వ్యతిరేకంగా అమలు చేయతలపెట్టిన చట్టాలను (నాలుగు లేబర్‌ కోడ్‌లను) కొన్ని రోజులపాటు వాయిదా వేసినప్పటికీ, వాటి అమలు అనివార్యంగా కన్పిస్తున్నది. బ్యాంకులు, బీమా, ఉక్కు, విద్యుత్‌, బొగ్గు,పెట్రోలియం, రక్షణ, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానా శ్రయాలు, ఎయిర్‌ ఇండియా, టెలికం, తపాలా శాఖ, అంతరిక్ష, అణు వైజ్ఞానిక విభా గాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం పూనుకొంటున్నది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలు విచ్చలవిడిగా అమలవు తున్నాయి. అదే సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌)ను అందరికీ ఒకేవిధంగా వర్తింపజేయాలని, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ (ఉపాధిహామీపథకం) బడ్జెట్‌ను పెంచాలన్న డిమాండ్లు కూడా పెండిరగ్‌లో వున్నాయి. భారతీయ సమాజానికి వెన్నెముకగా నిలిచిన రైతులు, కార్మి కులను పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతుండటంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజలు అసహనానికి గురయ్యారు. భారత్‌బంద్‌కు మూడు రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా స్కీమ్‌వర్కర్లు ఈనెల 24వతేదీన తమ హక్కులకోసం అఖిలభారత సమ్మెకు దిగు తున్నారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులతో కలుపుకొని దాదాపు కోటిమంది స్కీమ్‌ వర్కర్లు వున్నారు. ఐసిడిఎస్‌ కింద 26 లక్షలకు పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, 10 లక్షల మంది ఆశావర్కర్లు, దాదాపు 27 లక్షల మంది మిడ్‌డే మీల్‌ వర్కర్లతోపాటు జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌హెచ్‌ఎం) కింద పనిచేసే 108 అంబులెన్స్‌, ప్రాథమిక ఆసుపత్రుల్లో పనిచేసే కార్మికులు, ఎన్‌సిఎల్‌పి, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం స్కీమ్‌ కార్యకర్తలు సైతం సమ్మెలో పాల్గొంటున్నారు. నిజానికి వీళ్లలో సగం మంది కొవిడ్‌ సమయంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా వున్నా, వారికి తగిన గుర్తింపు దక్కలేదు. పైగా స్కీమ్‌ వర్కర్ల కనీస వేతనాలు, పింఛన్లు, క్రమబద్ధీకరణపై 45వ ఐఎల్‌సి చేసిన సిఫార్సులపై ప్రభుత్వం నేటికీ మౌనంగా వుండటం నేరపూరిత చర్య. వీరికి సంబంధించిన ఈశ్రమ్‌ పోర్టల్‌ అంతగా ఉపయుక్తంగా లేకపోవడం వారిని వేధిస్తున్నది. 2021`22 బడ్జెట్‌లో స్కీమ్‌లకు కేవలం రూ. 1400 కోట్ల కేటాయింపులు మాత్రమే జరిగాయి. గత ఏడాది కన్నా ఇది తక్కువ. ఆరోగ్య రంగానికీ కేటాయింపులు అంతంత మాత్రమే. ఆరోగ్య భద్రత కల్పించే ఐసిడిఎస్‌, ఎండిఎంఎస్‌ వంటి పథకాలను మూడు రైతుచట్టాలు, నిత్యావసర వస్తువుల సవరణ చట్టం ప్రమాదకరంలోకి నెట్టివేశాయి.
ఈ నేపథ్యంలో జరిగే సెప్టెంబరు 24 స్కీమ్‌వర్కర్ల దేశవ్యాప్త సమ్మె, 27 భారత్‌బంద్‌లు మోదీ ప్రభుత్వానికి కచ్చితంగా చెంపపెట్టు కానున్నాయి. బీజేపీ పాలనలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి ఈ ఆందోళనలు ఊపిరి పోస్తాయని ఆశిద్దాం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img