Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నూతన ఔకస్‌ యుద్ధ కూటమితో మహా ప్రమాదం

బుడ్డిగ జమిందార్‌

సెప్టెంబరు 24న వాషింగ్టన్‌లో ‘క్వాడ్‌’ సమావేశాలు జరుగనున్న సమయంలో ఆస్ట్రేలియా, యూకే, అమెరికాల మధ్య ఒక యుద్ధ కూటమికి అవగాహనకు వచ్చాయి. దీని పేరు ఔకస్‌. అత్యంత రహస్యంగా మూడు దేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ కూటమి ఏర్పాటు నిర్ణయాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కోట్‌ మోరీసన్‌లు ప్రకటించారు. ఈ ఔకస్‌ ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియాకు జలాంతర్గాములను అణు ఇంధన శక్తితో నడిపే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా, ఇంగ్లాండులు అందిస్తాయి. ఆసియాపసిఫిక్‌లో ‘భద్రత శ్రేయస్సు’ పరిరక్షించటానికి ఈ నిర్ణయం తీసుకొన్నామని అమెరికా అధ్యక్షుడు అన్నాడు. ఈ ఒప్పందం మేరకు నిర్మితమగు జలాంతర్గాములు చైనాకు వ్యతిరేకంగా, ఇంకా హిందూ మహాసముద్రంపసిఫిక్‌ మహాసముద్ర తీరాలను ఆనుకొని ఉన్న దేశాలను నిరంతరం అమెరికా బెదిరిస్తూ ఉంటుంది, కనుక ఈ ప్రాంత దేశాలన్నీ అమెరికాకు తలొగ్గి నడుచుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. అంతేగాకుండా చైనా, రష్యాలను బూచీలుగా చూపించి ఇక్కడి దేశాలను ఆయుధ పోటీలోకి దింపటం ద్వారా, అమెరికా ఆయుధ కంపెనీలు యధేచ్ఛగా ఇష్టమొచ్చిన రేట్లకు ఆయుధాల్ని అమ్ముకొని అత్యధిక లాభాలను పొందవచ్చు. ఈ నిర్ణయం పరోక్షంగా ఒకవైపు ఇదివరలో ప్రకటించిన ‘క్వాడ్‌’ కూటమి ప్రాధాన్యతను తగ్గించినట్లుగా భారత్‌, జపాన్‌లను సంప్రదించక, లెక్కచేయక తీసుకొన్నట్లు ఉంది. ఒక వైపు ‘క్వాడ్‌’ను మిగతా దేశాలతో పొడిగిస్తామని ఇదివరలో అమెరికా ప్రకటించింది. ఆ సమయంలో ఈయూ దేశాలు కూడా సంసిద్ధతను వ్యక్తపరిచాయి. ఫ్రాన్స్‌, జర్మనీలు కూడా ఆసియాపసిఫిక్‌లో స్వేచ్ఛా రవాణా కోసమని పాఠాలు కూడా చెప్పాయి. ఔకస్‌ ఒప్పందాన్ని గురించి చైనా ‘‘ప్రచ్ఛన్నయుద్ధ మనస్తత్వంతో సైద్ధాంతిక పక్షపాత బుద్ధిని అమెరికా బైట పెట్టిందని’’ వ్యాఖ్యానించింది. క్వాడ్‌ సమావేశాలకు మోదీ పయనం ముందు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంథోనియో గుటెర్రెస్‌ ఎపి వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత అమెరికాచైనా సంబంధాలు ప్రచ్ఛన్నయుద్ధం దిశగా దారి తీసేముందే సమస్యలకు చర్చల ద్వారా పరిష్కార మార్గాలు వెదకాలని ఇరుదేశాలకు సూచించారు. ఒకవేళ ఇరుదేశాలు ప్రచ్ఛన్న యుద్ధానికి దిగితే ఇది అమెరికాసోవియట్‌ యూనియన్‌ మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం కంటే ప్రమాద కరమైందని గుటెర్రస్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ‘ఔకస్‌’ ఒడంబడిక ఐరోపాఅమెరికాల మధ్య ఇటీవల పెరుగుతున్న పొరపొచ్ఛాలు, అగాధాన్ని మరింత పెంచాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌ పరిస్థితి మామూలుగా లేదు. దశాబ్దాల అమె రికాఫ్రాన్స్‌యూకేల మధ్య సంబం ధాలు బెడుస్తున్నాయి. ఫ్రాన్స్‌ తన రాయ బారులను ఆస్ట్రేలియా, అమెరికాల నుండి వెనుకకు రప్పించింది. యూకేఫ్రాన్స్‌ల మధ్య జరగబోవు రక్షణ మంత్రి త్వశాఖ చర్చలను రద్దు చేసుకొంది. దీనికి బలమైన కారణం ఉంది. ఏమనగా ఇప్పుడిప్పుడే ఆయుధ అమ్మకాలను, రఫెల్‌ యుద్ధ విమానాల పేరిట, జలాంతర్గాముల పేరిట ప్రపంచ మార్కెట్లకు విస్తరిస్తున్న తరుణంలో అమెరికాయూకేలు ఆస్ట్రేలియాను తన వైపు తిప్పుకోవటం మింగుడు పడలేదు. 2016 సంవత్సరంలో ఫ్రాన్స్‌ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఆయుధాల ఒప్పందం ప్రకారం 12 జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు రానున్న 10 సంవత్సరాల్లో ఎగుమతి చేయాలి. ఈ ఒప్పం దం ఖరీదు 36,400 కోట్ల డాలర్లు (సుమారు 27 లక్షల 30 వేల కోట్ల రూపా యలు). ఇక ఔకస్‌ ఒప్పందంతో ఫ్రాన్స్‌ఆస్ట్రేలియా ఒప్పం దం అటకెక్కినట్లే. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ మిలిటరీ పోటీతత్వం ఇక్కడ బట్టబయలైంది. ఇది ఫ్రాన్స్‌కు వెన్నుపోటని అధ్యక్షుడు మాక్రాన్‌ వర్ణించాడు. దీనితో యూరపులోని మిలిటరీ కూటమి నాటోలో కూడా లుకలుకలు ప్రారంభమైనట్టే. ఇప్పటికే నాటోకు వ్యతిరేకంగా ‘యూరప్‌ ఆర్మీ’ కావాలని ఎప్పటి నుండో జర్మనీ, ఫ్రాన్స్‌లు పట్టుబడుతున్నాయి.
బ్రెగ్జిట్‌ తర్వాత యూరో మార్కెట్లు కోల్పో యిన బ్రిటన్‌, ఇప్పుడు ఈ యుద్ధ కూటమి ద్వారా ఆసియా ఖండంలో తన నూతన మార్కెట్లు విస్తరించుకోవాలను కొంటుంది. సెప్టెంబరు 21 నాడు ఒక ప్రముఖ తెలుగు జాతీయ దినపత్రికలో మోదీకి బాకా ఊదే వై. సత్యకుమార్‌ యుద్ధాలను ప్రోత్సహించేలా మరో నాటోగా ‘క్వాడ్‌’ కూటమి అనే వ్యాసం రాసారు. నాటోను స్వయానా ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పనికిమాలి నది అని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే నాటో సభ్యదేశం టర్కీ నాటోకు వ్యతి ంకంగా రష్యా నుండి ఎస్‌400 క్షిపణుల రక్షక కవచాలను దిగుమతి చేసుకొం టోంది. ఒక జంటిల్‌మన్‌ ఒప్పందాన్ని అప్పటి సోవియట్‌ యూనియన్‌ అధ్య క్షునితో అమెరికా అధ్యక్షుడు కుదుర్చుకొని ‘నాటో’ను తూర్పు యూరపునకు విస్తరించమని ఒప్పుకొన్నాడు. కానీ సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత ఒకప్పటి తూర్పు సోషలిస్టు దేశాల్లోకి, సోవియట్‌ రిపబ్లిక్కులకు నాటో విస్తరించటమేగాక, భారతదేశానికి సహితం నాటో హోదా యిస్తానని అమెరికా అన్నది. నాటో బెదిరించి చేసిన యుద్ధాలన్నీ ‘అట్టర్‌ప్లాప్‌’గా చరిత్రగాంచాయి. వియత్నాంపై యుద్ధం లిబియా, సిరియా, ఇరాక్‌పై యుద్ధాలు, 20 సంవత్సరాల అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికా నాటో దేశాలు ఘోర పరాజయం పాలయ్యాయి. అక్కడి ప్రజల్ని వలసవాదుల్ని చేసాయి. ప్రపంచంలో 7 కోట్ల మంది వలసలకు నాటో కూటమి కారణమైంది. తాజాగా శాంతియుతంగా ఉన్న ఆసియాపసిఫిక్‌ ప్రాంతాల్లోకి ‘ఆసియా పివోట్‌’ పేరిట పయనమైన అమెరికా క్వాడ్‌, ఔకస్‌ కూటముల ద్వారా ఏమి సాదిద్దామని? జరుగుతున్న ఆసియా అభివృద్ధిని కుంటుపరిచి అగ్రరాజ్య అమెరికా ఉత్పత్తులు 200 కోట్ల మధ్యతరగతి కలిగి ఉన్న ఆసియా ఖండంలో వాణిజ్యం చేసుకోటానికా? అని చరిత్ర తెలిసిన శాంతికాములు ప్రశ్నిస్తున్నారు.
అమెరికాకు 80 దేశాల్లో 750 సైనిక స్థావ రాలున్నాయి. మొత్తం 159 దేశాలలో 1,73, 000 మంది అమెరికా సైన్యం ఉంది. సిరియాలో 4 స్థావరాలు, ఈజిప్టులో 1, కువైట్‌లో 10, బహ్రైన్‌లో 12, ఎమిరేట్స్‌లో 3, జోర్డాన్‌లో 2, ఓమన్‌లో 6, సౌదీ అరేబియాలో 10 స్థావరాలున్నాయి. 2001 నుండి ఇప్పట వరకూ 30 లక్షల సైనికుల వరకూ అఫ్గానిస్తాన్‌, ఇరాక్‌ లలో వచ్చిపోయేవారని వాస్టన్‌ ఇనిస్టిట్యూట్‌ ఎట్‌ బ్రౌన్‌ యూనివర్సిటీ ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో అతి పెద్ద ఎయిర్‌ఫోర్స్‌ విమానా శ్రయం కతార్‌లోనూ, అతి పెద్ద నౌకాస్థావరం బహ్రైన్‌లోనూ ఉంది. ఇంకా దిగ్బౌటి వంటి అనేక చోట్ల మిలిటరీ స్థావరాల్ని కలిగి మధ్య ప్రాచ్యంలోని చమురును దోచుకొంటుంది. పసిఫిక్‌ ప్రాంతంలోని జపాన్‌లో 120 స్థావరాల్లో 55,713 మంది అమెరికాసైనికులున్నారు. ప్రక్కనే ఉన్న దక్షిణ కొరియాలోని 73 అమెరికా స్థావరాల్లో 26,414 అమెరికా ట్రూపులున్నాయి. కనీసం 60 వేల మంది సైనికులు యూరపులో ఉన్నారు. హాండూరాస్‌, క్యూబా, గ్వాంటానామోలో, పోర్టోరికో, పనామా, కొలంబో, వెనుజులా చుట్టూ ఉన్న దీవుల్లో ఒక దేశమని కాదు లాటిన్‌ అమెరికాలోని అన్ని దేశాల్లో అమెరికా స్థావరా లున్నాయి. వీటికి తోడు వేలాది యుద్ధ విమానాలు. 11 యుద్ధ నౌకలు (అతి పెద్దవి), ఒక్కొక్క నౌక కనీసం 100 యుద్ధ విమానాలతో,, చుట్టూ జలాంతరా ్గములతో పయనిస్తాయి. ఇది చాలక వందలాది మానవరహిత డ్రోన్లు, సుమారు 8000 అణ్వస్త్రాలు కల్గి ఉంది అమెరికా. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు 300 అణ్వస్త్రాలు కలిగి ఉన్న చైనా నుండి, 20 అణ్వస్త్రాలు కలిగి ఉన్న ఉత్తర కొరియా నుండి ముప్పు ఉందని ప్రపంచాన్ని నమ్మబలుకుతోంది. ఆసియా సంస్కృతిని మధ్యప్రాచ్యంలో విచ్ఛిన్నం చేసి, ఇప్పుడు దక్షిణాసియాలో అదే పనిని అమెరికా చేయాలనుకుంటోంది. తన మార్కెట్ల కోసం మానవ నాగరికతను మట్టుబెట్టి, పైశాచిక ఆనందం కోసం కొత్త కూటములను మిలిటరీ రంగంలో అమెరికా ప్రోత్సహిస్తూ నూతన పేర్లు, నూతన నినాదాలు పెడ్తూ ఆయుధాలతో ప్రపంచాన్ని బయటపెట్టాలనుకొనే అమెరికా అంబులపొది నుండి ఆవిర్భవించిన మిలిటరీ కూటమే ఔకస్‌, క్వాడ్‌ తదితరాలు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img