Monday, April 22, 2024
Monday, April 22, 2024

పరిష్కారం పేర విచ్ఛిన్న బీజాలు

ఆర్వీ రామారావ్‌

చరణ్‌ జిత్‌ సింగ్‌ చన్నీని పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిని చేయడంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం వ్యూహం ఏమైనప్పటికీ అది సానుకూల పరిణామమే. పంజాబ్‌ జనాభాలో దళితుల జనాభా 32 శాతం ఉందని అంచనా. వచ్చే ఏడాది మార్చిలోగా పంజాబ్‌ శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉంది. మళ్లీ అధికారం సంపా దించడానికి కావలసిన వ్యూహాలు రూపొందించడంలో ఆశ్చర్యం లేదు. కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ రాజీనామా తరవాత కొత్త ముఖ్యమంత్రి ఎవరు అని ఆలోచించినప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి మొట్ట మొదట తట్టిన పేరు అంబికా సోనీ. అయితే ఆమె పంజాబ్‌ లాంటి రాష్ట్రానికి సిక్కు ముఖ్యమంత్రిగా ఉండడమే మంచిదన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించారు. ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగు నెలల వ్యవధే ఉంది కనక చరణ్‌ జిత్‌ సింగ్‌ చన్నీ ఎలాంటి వ్యూహా రచన చేస్తారు, భిన్న శ్రుతులు వినిపిస్తున్న పంజాబ్‌ కాంగ్రెస్‌ ఒకే రాగం ఆలపించేట్టు చేయడంలో ఏ మేరకు సఫలం అవుతారు అన్నది వేచి చూడవలసిన అంశమే.
కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ మీద అసమ్మతి విపరీతంగా ఉన్న దశలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయవలసిన అవసరం ఏర్పడిరది. అమరేంద్ర సింగ్‌ కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకుడే కాక విస్తృతమైన గౌరవ మర్యాదలు పొందినవాడు. కానీ ఆయన పటియాలా మహారాజు భూపేంద్ర సింగ్‌ మనవడు. ఆ రాచరిక ఛాయలు అమరేంద్ర సింగ్‌లో అవశేషాలుగా కాకుండా బలంగానే ఉన్నాయి. అందుకే ఆయన దర్శనమే మహాభాగ్యంగా ఉండేది. ఎక్కువ కాలం వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇంట్లోనే గడుపుతారంటారు. ఫ్యూడల్‌ లక్షణాలున్న రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు. వారందరూ మాజీ సంస్థానాధీశుల వారసులు కాకపోవచ్చు. కానీ వారికి సంక్రమించిన సంపత్తో లేదా సంపాదించిన సంపత్తో రాచఠీవి ప్రదర్శించడానికి ప్రేరేపణ కావొచ్చు. సంపన్నులు, కులీనులు రాజకీయాల్లో జనానికి మేలు చేయలేరని కాదు. అలాగని సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నాయకులందరూ ప్రజలకు అనుకూలంగా మెలగిన దాఖలాలూ లేవు. పంజాబ్‌లో అసమ్మతి పెరగడానికి కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ నడవడిక ఒక్కటే కారణం కాదు. కాంగ్రెస్‌ అధిష్ఠానం వ్యవహార సరళిలో వచ్చిన మార్పు అసమ్మతి సెగ స్థాయి నుంచి దావానలం కావడానికి దారి తీసింది. ముఖ్యమంత్రిగా చరణ్‌ జిత్‌ సింగ్‌ చన్నీ సోమవారం ప్రమాణం స్వీకరించడానికి కొద్ది సమయం ముందు పంజాబ్‌ కాంగ్రెస్‌ పరిశీలకుడు హరీశ్‌ రావత్‌ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ సమరం పి.సి.సి. అధ్యక్షుడు నవ జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ న్యాయకత్వంలో జరుగుతుందని ప్రకటించారు. ఇలాంటి మాటలు ఇతర నాయకులను ఇబ్బంది పెట్టకుండా ఉండవుగా! పంజాబ్‌ పి.సి.సి. మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ బహిరంగంగానే రావత్‌ మాటలను దుయ్యబట్టారు. అసమ్మతి వర్గానికి అసలు నాయకుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ. చన్నీ ఆయనకు సన్నిహితుడే. కానీ సిద్ధూ నేతృత్వంలోనే ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పడం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారిని బలహీనపరచినట్టే అన్న విమర్శ గట్టిగానే వినిపించింది.
మొట్టమొదటి సారి దళితుడిని ముఖ్యమంత్రిని చేసి బ్రహ్మాండమైన వ్యూహం అనుసరిస్తున్నామన్న మురిపెం తీరక ముందే రావత్‌ వ్యాఖ్యలు కడివెడు పాలలో విషపు చుక్క వేసినట్టయింది. కాంగ్రెస్‌ నాయకులే కాదు బీజేపీ ఐ.టి. సెల్‌ నాయకుడు అమిత్‌ మాలవియా సైతం సిద్ధూ నాయకత్వంలోనే ఎన్నికలలో పోటీ చేస్తామని అనడం ఎన్నికలు జరిగి సిద్ధూ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే దాకా మాత్రమే చన్నీ కొనసాగుతారన్న అర్థం స్ఫురిస్తోందని, ఇది దళితులను అవమానించడమే అన్నారు. బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి కూడా రావత్‌ తీరుపై విరుచుకు పడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేసి ఎన్నికలలో ఆ వర్గం మద్దతుతో విజయం సాధించాలన్న వ్యూహం ఉంటే ఇలాంటి మాటలు కచ్చితంగా దళితులలో అనుమానాలు రేకెత్తిస్తాయి. ఏరు దాటిన తరవాత తెప్ప తగలేసే రకం కాంగ్రెస్‌ అనుకునే అవకాశం ఉంది. అసలు దళితులను ముఖ్యమంత్రి చేయడమే అపురూపం. ఒక వేళ ఈ వ్యూహం ప్రకారం కాంగ్రెస్‌ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి కోసమే నానా యాగీ చేసిన సిద్ధూకు కళ్లాలు అప్పగిస్తే దళితులను మభ్యపెట్టినట్టే కదా. పైగా చన్నీని ముఖ్యమంత్రిని చేసినంత మాత్రాన దళితులందరూ కట్టగట్టుకుని కాంగ్రెస్‌కే ఓటు వేస్తారన్న భరోసా ఏమీ లేదు. బహుజన సమాజ్‌ పార్టీకి పంజాబ్‌లో పెద్ద బలం లేకపోవచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో పలుకుబడి ఉంది. ఆ పార్టీయే బహుజనులది కనక దళితులందరూ కాంగ్రెస్‌కు బ్రహ్మ రథం పడతారనుకోవడం భ్రమ. అయితే బి.ఎస్‌.పి. అకాలీ దళ్‌తో పొత్తు పెట్టుకుంటోంది. దళితుల్లో ఉపకులమైన రాందాసియా వర్గంలో బి.ఎస్‌.పి.కి పట్టుంది. వీరి జనాభా 10 శాతం ఉంటుంది. చన్నీ కూడా రాందాసియా ఉపకులానికి చెందిన వాడే. బీజేపీకి పంజాబ్‌లో అంత బలమేమీ లేదు. కానీ దమ్ముంటే దళితుడిని ముఖ్యమంత్రిని చేయండి అని ఇదివరకు బీజేపీ కాంగ్రెస్‌కు సవాలు విసిరింది. మరిప్పుడు కాంగ్రెస్‌ ఆ పని చేసింది కనక కాంగ్రెస్‌ ను ఎదిరించడానికి అవకాశం తగ్గుతుంది. 2017 ఎన్నికలలో 20 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆం ఆద్మీ పార్టీ తాము గెలిస్తే దళితుడిని ఉపముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ఆ పార్టీ వాదన కూడా కాంగ్రెస్‌ వ్యూహంతో చిత్తయింది. కానీ కేజ్రీవాల్‌ కాన్షీరాం కుటుంబానికి చెందిన వారిని తమ పార్టీలో చేర్చుకుని దళితులను ఆకట్టుకోవాలనుకుంటున్నారు. బి.ఎస్‌.పి. నాయకుడు కాన్షీరాం పంజాబ్‌లోని రోపార్‌లో సిక్కు మతానుయాయుల కుటుంబంలోనే జన్మించారు.
అన్ని చోట్లలాగే పంజాబ్‌లో కూడా దళితుల్లోనూ అనేక ఉపకులాలున్నాయి. రాందాసియా ఉపకులానికి, మజబీ సిక్కులకు మధ్య స్పష్టమైన విభజన ఉంది. వాల్మీకులు, బాజీగర్‌ లాంటి ఉపకులాలూ ఉన్నాయి. 117 స్థానాలున్న పంజాబ్‌ శాసనసభలో షెడ్యూల్డ్‌ కులాల వారికి 34 సీట్లు ప్రత్యేకించారు. కానీ దళితుడు ముఖ్యమంత్రి అయింది ఇప్పుడే. 20 శాతం జాట్‌ సిక్కులే ఎక్కువ కాలం అధికారం చెలాయించారు. అధికారంలోకి రావడానికి సంఖ్యాబలం అవసరం కావచ్చు కానీ అదే సర్వస్వం కాదు. ఎందుకంటే ఏ మతం వారు, ఏ సామాజిక వర్గం వారూ కట్టకట్టుకుని ఒకే పక్షానికి ఓటు వేయరు. పంజాబ్‌లో దళితుడిని ముఖ్యమంత్రిని చేసినందువల్ల ఉత్తరప్రదేశ్‌లో కొంత ఫలితం దక్క వచ్చు. మరో వేపు నుంచి చూస్తే సొంతంగా 17 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క చోట కూడా దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌ కొంత మెరుగనిపించుకోవచ్చు. కానీ ఒక సానుకూల అడుగు వేస్తే పది అడుగులు అడుసులో వేసే తత్వం కాంగ్రెస్‌ తత్వం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది.
ప్రస్తుత కాంగ్రెస్‌కు పదేళ్ల కిందటి కాంగ్రెస్‌కు మధ్య అపారమైన తేడా కనిపిస్తోంది. అసమ్మతి ఎదురైన ప్పుడు అసమ్మతి వాదులకు మద్దతిచ్చే సంస్కృతి ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానంలో బాహాటంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రుల మీద అసమ్మతి ఎక్కడైనా ఉండొచ్చు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న వారికి సన్నిహితంగా మెలగే అహమద్‌ పటేల్‌ లాంటి వారు అసమ్మతి వాదుల ఫిర్యాదు లను పరిశీలించే వారు. పరిస్థితి చేయి దాటిపోకుందా చూసుకోవాలని సదరు ముఖ్యమంత్రికి హితవు చెప్పే వారు. ఇప్పుడు అహమద్‌ పటేల్‌ పాత్ర పోషించే వారు ఎవరూ లేరు. అమరేంద్ర సింగ్‌ వాదన విన్న నాథుడే లేడు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానమే అసమ్మతిని ఎగదోస్తోంది. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పుంఖాను పుంఖాలుగా విమర్శలు గుప్పిస్తుంటే నియంత్రించకుండా ప్రోత్సహించింది. సిద్ధూ తనకు ప్రియాంకా గాంధీతో సత్సంబంధా లున్నాయని తద్వారా రాహుల్‌ గాంధీ కూడా దగ్గరేనని గొప్పలు చెప్పుకున్నాడు. ఇది అధిష్ఠానం పక్షపాత వైఖరికి నిదర్శనం. అమరేంద్ర సింగ్‌ను తప్పించడం అధిష్ఠానానికి అలవి కాని పనేమీ కాదుగా! మర్యాద పాటించక పోవడంవల్ల ఆయన భిన్న పోకడలు పోయే పరిస్థితి అధిష్ఠానమే కొని తెచ్చుకుంది. ఇదివరకైతే ముఖ్యమంత్రులను మార్చవలసి వస్తే వారిని నొప్పించకుండా మీకు మరో బాధ్యత అప్పగిస్తామని చెప్పి ఒప్పొంచే వారు. ఇప్పుడు మాత్రం అమరేంద్ర సింగ్‌ తెలియకుండానే శాసనసభా పక్షం సమావేశం ఏర్పాటు చేశారు. కుట్రలు చేసి, మభ్యపెట్టే సంప్రదాయం కాంగ్రెస్‌లో ఇప్పుడే కనిపిస్తోంది.
అమరేంద్రను తొలగించడం పద్ధతి ప్రకారం జరగలేదు కనకే తాము సవ్యంగానే వ్యవహరించామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చన్నీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్‌ హాజరు కావడంలో ఆంతర్యం ఇదే. అసమ్మతివాదులను ఓపిక పట్టండి అని చెప్పడం సోనియా అలవాటు. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలెట్‌ ముఖ్యమంత్రి పదవులు ఆశించి దక్కనప్పుడు అలిగితే అదే పని చేశారు. ఇప్పుడు అధిష్ఠానం అగ్నికి ఆజ్యం పోసింది.
సిద్ధూ రాజకీయాల్లోకి వచ్చింది బీజేపీద్వారా. 2016 సెప్టెంబర్‌ 2న బీజేపీకి రాజీనామా చేసి అవాజ్‌-ఎ-పంజాబ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. 2017 జనవరిలో హఠాత్తుగా కాంగ్రెస్‌లో చేరారు. అమరేంద్ర సింగ్‌ మంత్రివర్గంలో చేరారు. తరవాత ఆయనతో వైరం పెంచుకున్నారు. తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ పితూరికి అధిష్ఠానం అండదండలున్నాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తి సిద్ధాంత బలం ఏమిటో అధిష్ఠానం అంచనా వేయలేదేమో. కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్‌అధిష్ఠానానికి అనివార్యంఅయింది అనడంకన్నా ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతినిపెంచి పోషిం చడంలో అధిష్ఠానానిదే ప్రధాన పాత్ర అనడమే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. సర్వాధికారాలు అధిష్ఠానం చేతిలో ఉన్నప్పుడు తమ పార్టీలోనే వేరు కుంపట్లు రాజేసే కర్మ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఎందుకో?!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img