Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రపతిని అవమానించడం కాదా!

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. రాజ్యాంగ బద్దంగా దేశాధినేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాకుండా మోదీ ప్రారంభించ నుండటం వివాదాస్పద మైంది. సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం చేయించనందుకు నిరసనగా అతి కొద్ది ప్రతిపక్షపార్టీలు మినహా 20కిపైగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించనున్నాయి. ఇదే సందర్భంలో హిందూ మహాసభ నాయకుడు దామోదర సావర్కర్‌ 140వ జన్మదినోత్సవం రోజు మే 28వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. దేశ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొనని త్రివర్ణపతాకాన్ని నిరాకరించి, దేశసార్వభౌమత్వాన్ని గుర్తించకుండా బ్రిటీషు పాలకుల నుండి క్షమాభిక్ష కోరి, వారికి పూర్తిగా సహకరించిన సావర్కర్‌ను ఈ సందర్భంగా స్మరించుకోవడం అత్యంత విచారకరం.
ప్రస్తుతం పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించవలసిన అవసరం ఏమిటనేది ప్రధాన ప్రశ్న. ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఎదురుగా సెంట్రల్‌ విస్టా నిర్మాణంలో భాగంగా నూతన పార్లమెంటు భవనానికి 2020 సంవత్సరంలో మోదీ శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణానికి రూ.20వేల కోట్లు ఖర్చయిందని అంచనా. ఇంకా 12 వేల కోట్లు ఖర్చు మిగిలి ఉంది. కమల పుష్పం ఆకారంలో నిర్మించిన ఈ భవనంలో 888 మంది లోకసభ, 348 మంది రాజ్యసభ సభ్యులు ఆశీనులు కావచ్చు. లైబ్రరీ సదుపాయాన్ని కల్పించారు. వివిధ రాజకీయ పార్టీలకు కేటాయించిన కార్యాలయాల స్థలం కూడా పరిమితం చేశారు.
2020 సంవత్సరంలో నూతన పార్లమెంటు భవన నిర్మాణ ప్రతిపాదన వచ్చిన సమయంలోనే దేశం యావత్తు కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొంటూ తీవ్రమైన కష్టాలు పడుతున్నది. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆసుపత్రి పడకలు, అంబులెన్స్‌, మందుల కొరతతో ప్రజలు అనేక వ్యథలు అనుభవించారు. మొత్తంగా కొవిడ్‌ వ్యాధిని ఎదుర్కొనే వైద్యరంగ బాధ్యతను రాష్ట్రాల ప్రభుత్వాల పైకినెట్ట్టి, ప్రారంభంలో పాత్రలను ధ్వనించడం, దీపాలను వెలిగించడం, రామ్‌దేవ్‌ బాబా నాటు వైద్యం, గోమూత్రంతో కాలక్షేపం చేసి కేవలం అధికారిక ప్రకటనలకు, వ్యాధి సమాచార బులెటన్లకు కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది. ఈ కోవిడ్‌ విపత్కర సమయంలో 20వేల కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణాన్ని చేపట్టింది. ప్రజల వైద్య అవసరాలను పక్కన బెట్టడం, దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది.
ప్రస్తుత పార్లమెంటు భవనం 114 శంఖాలతో, వృత్తాకారంలో సెంట్రల్‌ హాలు, ఉభయసభల నిర్వాహణకు విశాలమైన ఛాంబర్లు (లోకసభ, 250 రాజ్యసభ సభ్యులకై) లైబ్రరీని కలిగి దిల్లీ నగర నడిబొడ్డున విశాలమైన ప్రాంగణంలో ఉన్నది. సుందరమైన ఈ భవనం 1927వ సంవత్సరంలో అప్పటి బ్రిటీషు పాలకులు నిర్మించినది. పెరుగుతున్న సభ్యుల సంఖ్య అవసరాలకు వీలుగా మార్పులు చేసుకొన డానికి వీలైన విశాలమైన భవన సముదాయం. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌లు సైతం గత 250 సంవత్సరాలుగా తమ పార్లమెంటు భవనాలను కాపాడుకొంటున్నాయి.
ఈనాడు దేశంలో తాగునీరు సైతం వ్యాపారవస్తువుగా మారి మార్కెట్‌లో కొనుక్కొనాల్సిన పరిస్థితి ఏర్పడిరది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటా పైపులైన్ల ద్వారా కొళాయిల ద్వారా రక్షిత మంచినీరు సరఫరాకు కాగల వ్యయం 4 బిలియన్‌ డాలర్లు. ఈ పరిస్థితుల్లో దేశప్రజలు అవసరాలను విస్మరించి స్వీయప్రతిష్ఠకై, ఎన్నికల ప్రయోజనాల కోసం ఇంతగాÛ వ్యయం చేయడం ఏ మాత్రం అంగీకారం కాదు. సావర్కర్‌ 140వ జన్మదిన వేడుకల్లో భాగంగా నూతనపార్లమెంటు భవన ప్రారంభం అభ్యంతరకరం. దేశ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొనకపోగా, బ్రిటీషు వలసవాదులకు వత్తాసు పలికిన వ్యక్తిని ఈ సందర్భంలో స్మరించడం విచారకరం. సావర్కర్‌ త్రివర్ణ పతాకాన్ని తిరస్కరించడమేకాక, దీని స్థానంలో ‘‘ఓమ్‌’’, ‘‘స్వస్తిక్‌’’ గుర్తులతో కూడిన కాషాయజెండాను ప్రతిపాదించారు. హిందూ, ముస్లిం మతఆధారిత దేశాలు ఏర్పడాలని 1937లో మహమ్మదాలీ జిన్నా కంటే ముందే రెండురాజ్యాల ప్రతిపాదనను చేసింది సావర్కర్‌. బీజేపీమాతృసంస్థ ‘హిందూ మహాసభ’, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశ స్వాతంత్య్రపోరాటంలో ఏ మాత్రం పాల్గొనకపోగా, క్విట్‌ ఇండియా, సిపాయిల తిరుగుబాటును వ్యతి రేకించి, సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలోని భారత రిపబ్లికన్‌ ఆర్మీని అణచివేస్తున్న బ్రిటిషు పాలకులను హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులను సైనికులుగా ప్రతిపాదించింది. (హిందూ మహాసభ 1941, 34వ సమావేశం, భాగల్‌పూర్‌). తమకువిధించిన యావజ్జీవ కారాగార దీక్ష నుండి విడుదల చేయాలని, బ్రిటీషు పాలకులను అభ్యర్థించడమే కాక, విడుదల చేస్తే ఇకముందు రాజకీయాల నుంచి విరమించుకొని, బ్రిటీషు వారికి పూర్తిసహకారాన్ని ఇవ్వగలమని అండమాన్‌ జైలునుంచి సావర్కర్‌ అన్నదమ్ములు ఇద్దరూ వేడుకోవడం వీరి ‘దేశభక్తికి’ మచ్చుతునక.
భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 79 ప్రకారం పార్లమెంటు ఉభయసభలకు నేత, దేశ రాష్ట్రపతి ప్రసంగంతోనే పార్లమెంటు ఉభయసభలు ప్రారంభ మవుతాయి. ఎన్నికైన పార్లమెంటు సభ్యుల కేంద్ర కేబినెట్‌ నియామకాలు రాష్ట్రపతి అనుమతితోనే జరుగుతాయి. 1970 సంవత్సరంలో ఆనాటి రాష్ట్రపతి వి.వి.గిరి పార్లమెంటు అనెక్స్‌ భవనాలను, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి కె.నారాయణన్‌ పార్లమెంటు లైబ్రరీని ప్రారంభించడం సంప్రదాయంగా కొనసాగుతున్నది. దీనికి భిన్నంగా 2020లో నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని మోదీ భూమి పూజ చేయడం, ఈనాడు ఈ భవనాన్ని ప్రారంభించడానికి పూనుకోవడం (దేశ రాష్ట్రపతిని పక్కన బెట్టి) విచారకరం. 2019 సంవత్సరంలో నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని సైతం ఆనాటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (దేశ సైన్యాధిపతి కూడా)ని కాదని మోదీ స్వయంగా ప్రారంభించారు. దేశ ప్రజలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్న విధంగా మోదీ తన ‘స్వీయ’ ప్రతిష్ఠ, కీర్తి కండూతి,ఎన్నికల ప్రయోజనాలను పక్కనబెట్టి సంప్రదాయాలకు అనుకూలంగా రాష్ట్రపతి చేతులమీదుగా నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం చేయగలరని ఆశిద్దాం.
డా.సోమ మర్ల

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img