Friday, May 31, 2024
Friday, May 31, 2024

రైతులపై కక్షసాధింపు బడ్జెట్‌

రావుల వెంకయ్య

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న 2023`24 సంవత్సరాలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆడంబరంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇది భారతదేశ ప్రజలకు ‘‘అమృతకాల’’ బడ్జెట్‌ అన్నారు. సప్తరుషులు సాక్షిగా ఏడు అంశాలపై 45 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ ఉంది. అందులో మొదటి స్థానంలో 5లక్షల కోట్లతో రక్షణరంగం ఉంటే, 7వ స్థానంలో (చివరి స్థానంగా) వ్యవసాయరంగం ఒక లక్ష నలభై ఐదు వేల కోట్లతో 3.2%గా ఉంది. గత సంవత్సరం 3.84%తో ఒక లక్షా యాభై ఒక్క వేల కోట్లు కేటాయింపులు ఉండేవి. దానర్థం వ్యవసాయరంగానికి కేటాయింపులు పెరిగనట్లా? తరిగినట్లా? అక్షరాల నూటికి నూరు శాతం తగ్గినట్లే. యావత్‌ ప్రజలకు ఈ బడ్జెట్‌ అమృతకాలం కాదు. గరళ (విషం) కాలంగా భావించాలి. ఇది కార్పొరేట్లకు, అదానీ, అంబానీలకు అమృత కాలంగా భావించాల్సి ఉన్నది.
ఎరువుల సబ్సిడీకి రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల నుండి లక్షా డెభై ఐదు వేల కోట్లకు తగ్గించారు. సేంద్రీయ ఎరువులు రైతులే తయారు చేసుకోవాలని సెలవిచ్చారు. గోబర్‌ గ్యాస్‌ లాంటి పురాతన ఎరువులకు రైతులను వెళ్ళమంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిని 68 వేల కోట్ల నుండి 60 వేల కోట్లకు తగ్గించారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకానికి గతంలో 10,435 కోట్లుగా ఉంటే నేడు 7,150 కోట్లకు కుదించారు. కిసాన్‌ ఉన్నతి యోజన 7,183 కోట్ల నుండి 7,066 కోట్లకు తగ్గించారు. నీటి పారుదల రంగానికి దేశవ్యాప్తంగా కేవలం 7 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ధరల స్థిరీకరణ నిధికి మొదట 3 వేల కోట్లుగా ప్రకటించి ప్రతి సంవత్సరం తగ్గిస్తూ గత సంవత్సరం 1,500 కోట్లుగా ఉంటే నేడు కోటి రూపాయలకు నామమాత్రం చేశారు. మద్దతు ధరల కోసం ప్రధాన మంత్రి ఆశా పథకాన్ని దాదాపు రద్దు చేసినట్లే. ఆహార సబ్సిడీకి 2.8 లక్షల కోట్ల నుండి 1.97 లక్షల కోట్లకు కుదించారు. మార్కెట్‌ యార్డులకు పంగనామాలు పెట్టినట్లే. రాబోయే కాలంలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (యఫ్‌.సి.ఐ) కనుమరుగయ్యే ప్రమాదం కలిగినట్లే. పేద ప్రజలకిచ్చే రేషన్‌ బియ్యం రద్దు చేయాలనే ఆలోచన కనబడుతున్నది.
రాబోయే కాలం ప్రకృతి వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామన్నారు. ఈ 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తామన్నారు. కానీ వాటికి కేటాయించినది కేవలం 10 వేల కోట్లు మాత్రమే. చిరుధాన్యాలకు గిట్టుబాటు ధర మాటమాత్రంగా కూడా చెప్పలేదు. ఇప్పటికే చిరుధాన్యాల ఉత్పత్తిలో మనమే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాము. వ్యవసాయంలో సాంకేతిక విప్లవం తెస్తామని, డిజిటలైజేషన్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ మీద యం.ఒ.యు. ప్రవేశపెట్టారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించా ల్సిందే. కానీ అది ప్రభుత్వరంగంలో కాకుండా కార్పోరేట్‌ శక్తులకు కట్టబెట్టే ఒప్పందం చేసుకున్నారు. వారిలో అమెజాన్‌, వాల్‌మార్ట్‌, ఐటిసి, మాన్‌ శాంటో, బ్రెయిర్‌, పతంజలి లాంటి కంపెనీలున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సహకార వ్యవస్థను బలోపేతం చేసి వాటి ద్వారా ఇది అమలు జరిపితే బాగుంటుంది. రైతుల రుణాలు 20 లక్షల కోట్లు పెంచినట్లు గొప్పలు చెప్పారు. వ్యవసాయంతోపాటు పశు పోషణ, పండ్ల తోటలు, మత్స్యశాఖ, కోళ్ళ పరిశ్రమ లాంటివి కూడా కలిపి దీనిలో ఉన్నాయి. ఒక్క వ్యవసాయానికే 50 లక్షల కోట్లకు పైగా కావాలి. ఇప్పుడు బ్యాంకులు రైతులకివ్వాల్సిన పెట్టుబడిలో 50 శాతం కూడా రావటంలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ 2% నుండి 1.5%కి తగ్గించారు. అంటే రైతులపై పెనుభారం మోపినట్లే.
ఈ కేటాయింపులు చూసిన తరువాత ఏమి అర్థమవుతుంది? సంవత్సర కాలంగా కాన్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా నల్ల చట్టాల మీద రైతులు చారిత్రాత్మక దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించారు. 750 మందికి పైగా రైతుబిడ్డలు అమరులయ్యారు. 4 వేలకు పైగా కేసులు నేటికీ నడుస్తున్నాయి. చివరికి నరేంద్ర మోదీ దిగివచ్చి పార్లమెంటు సాక్షిగా నల్ల చట్టాలను ఉపసంహరించుకుని కన్నీళ్లు పెట్టకుని యావత్‌ రైతు జాతికి క్షమాపణలు చెప్పారు. రైతు ఉద్యమకారులకు రాతపూర్వకంగా హామీలు ఇచ్చి ఇప్పుటికి సంవత్సరం దాటింది. ఈ బడ్జెట్‌లో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వారు సెలవిచ్చిన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని, దానికి అనుగుణంగా బడ్జెట్‌లో తగిన కేటాయింపులు పెంచుతారని రైతులోకం అంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. కానీ రైతులకు తీవ్ర ఆశాభంగం ఎదురైంది. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలలో రైతు మద్దతు ధరల విషయం కానీ, రైతు రుణ విమోచన కానీ మాటమాత్రంగా కూడా చెప్పలేదు. ‘రైతు ఉద్యమ ఫలితంగా నా చేత కన్నీరు పెట్టించుకుని క్షమాపణలు చేప్పే పరిస్థితి తీసుకువచ్చారని’ యావత్‌ రైతు జాతిపై కక్ష సాధింపు పద్ధతుల్లో ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు కనబడుతున్నది. రైతులు నిరాశ పడకుండా తిరిగి ఐక్యశక్తిని కూడదీసుకుని అందరినీ కలుపుకుని మరో ఉద్యమానికి అంకురార్పణ చెయ్యాల్సి ఉంది. అందుకు పార్లమెంటులో ఈ బడ్జెట్‌ ముగిసేలోపు వ్యవసాయరంగానికి అనుకూలంగా సవరణలు చేయాలని కోరుతూ మార్చి 20వ తేదీ ‘‘ఛలో పార్లమెంట్‌ ’’కు రైతుసంఘాల సమన్వయ సమితి పిలుపునిచ్చింది. దాన్ని జయప్రదం చేయడం ద్వారా మోదీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి. దానికి రైతులంతా సమాయత్తం కావాలి.
వ్యాస రచయిత ఎఐకెఎస్‌ అధ్యక్షుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img