Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… పిఠాపురం వచ్చి…

‘‘గుడివాడ ఎల్లాను.. గుంటూరు పోయాను… ఏలూరు, నెల్లూరు.. ఎన్నెన్నో తిరిగాను’’ ఉదయాన్నే భూపాలరాగంలో పాట అందుకున్నాడు సాంబ. ‘‘సాంబా.. ఆపు.. నువ్వు పాడుతున్న పాటేంటి. రాష్ట్రంలో జరుగుతున్నదేమిటీ’’ చాలా ఆవేశంగా ఊగిపోతూ అన్నారు రబ్బర్‌ సింగ్‌…
‘‘గురుగారు… అదేంటి నే పాట బాగానే పాడానుగా. అలా కేకలేస్తారేమిటి’’ కంగారుగా అన్నాడు సాంబ. ‘‘అది కాదు సాంబా.. ఆ పాట ఎలా ఉండాలంటే’’ అంటూ పాట పాడటం ప్రారంభించారు రబ్బర్‌ సింగ్‌. ‘‘భీమారం ఎల్లాను… గాజువాక పోయాను… చిత్తూరు, పొత్తూరు ఎక్కడెక్కడో తిరిగాను.. చివరాఖరికి… పిఠాపురం వచ్చాను…’’ ఇలా పాడాలి సాంబ ఈ పాటని అని జ్ఞానోదయం చేశారు రబ్బర్‌ సింగ్‌. అది విన్నాక సాంబకి ఆనందమూ, ఆశ్చర్యము, ఓ అలౌకికానందమూ కలిగాయి. నిజానికి ఆ సమయంలో సాంబ చాలా బిజీగా ఉన్నాడు. రబ్బర్‌ సింగ్‌ అంతకుముందు అనేకచోట్ల చేసిన ప్రసంగాల్లో కొన్ని ఆణిముత్యాలని ఓ పుస్తకంలో రాసుకుంటున్నాడు సాంబ. ఈ పని పురమాయించింది కూడా రబ్బర్‌ సింగే. అప్పటికే చాలా అనుమానాలు వేధిస్తున్నాయి సాంబని. గురువుగారు రబ్బర్‌ సింగ్‌ బాపట్లలో మాట్లాడుతూ ‘‘వురేయ్‌…. నేను బాపట్లలో పుట్టానురా’’ అన్నారు. మళ్లీ కొన్నాళ్లకి చీరాల వచ్చినప్పుడు ‘‘మీకు తెలుసా నా జన్మస్థలం ఇదే’’ అని కూడా భాషించారు. ఇలా కొద్ది రోజుల్లోనే ప్రకాశం జిల్లాలో పర్యటనకు వెళ్లిన రబ్బర్‌ సింగ్‌ అక్కడున్న కుర్రకారుని చూసిన తన్మయత్వంలో ‘‘నా చాలా చిన్నప్పుడు ఇక్కడే ఆడుకున్నాను’’ అని కూడా ప్రవచించారు. ఒకే మనిషి ఒకే జన్మలో ఇలా ఇన్నిచోట్ల పుట్టడం, పెరగడం, ఆపై అక్కడికి వచ్చి తన జన్మ రహస్యాలు విప్పడం పక్కనే ఉండి చూస్తున్న, వింటున్న సాంబ కళ్లలోంచి ఆనంద బాష్పాలు తన కజిన్‌ బ్రదర్‌తో కలిసి వచ్చినట్లుగా వచ్చాయి. ‘‘ఏమి కాలాతీత వ్యక్తులు గురువు గారు. ఏకకాలంలో అనేక రూపాల్లో… అనేక ప్రాంతాల్లో పుట్టడం, సంచరించడం ఎంత అద్భుతం. అన్నమయ్య అన్నట్లు ‘‘ఇది కాదు తపము, ఇది కాదు జన్మము’’ అనుకోకుండా ఉండలేకపోయాడు సాంబ. ఇదే మాటని రబ్బర్‌ సింగ్‌తో చెబుతూ ‘‘మీరు కారణజన్ములు’’ అన్నాడు కూడా. అప్పుడే ఎన్ని మందులు వాడినా తగ్గని ఎడమ వైపున మెడని కుడి చేత్తో గోక్కుంటూ ‘‘ సాంబా నాపై ఇంత ప్రేమేలా. ఇంతటి వాత్సల్యమేలా…’’ అన్నారు రబ్బర్‌ సింగ్‌. అలా అంటూనే ఇలాంటి పొగడ్తలకు పడిపోకూడదంటూ ‘‘నా ఇష్ట కవి టంగటూరు జోగేంద్ర శర్మ గారు రాసిన కవితని వినిపిస్తాను’’ అని గొంతు సవరించుకున్నారు. ఈ గొంతు సవరణ, కుర్రకారుని చూసి ఆవేశపడడం, జుట్టుని ఓ చేత్తో పదే పదే పైకి తోసుకోవడం ఇంతకు ముందే అనుభవంలో ఉన్న సాంబ ‘‘వద్దు… ఆ కవిత నిన్నే చెప్పారు. ఇప్పుడు మనం మొక్కజొన్న పొత్తుల కార్యక్రమం ముగిసింది కదా… తమరు ఎక్కడ పోటీ చేయాలో మాట్లాడుకుందాం’’ అని బలవంతాన ఆ కవి సమ్మేళనాన్ని నిలువరించారు సాంబ. ‘‘పిచ్చివాడా… నీకు సూక్ష్మం తెలియదోయ్‌… నేను ఇంతకుముందు పాడిన పాట దాని గురించే. భీమారాం ఎల్లాను అని పాడుతున్నానంటే ఆది నా గతం తాలుకా ఆనవాలని గుర్తు చేయడమేనోయ్‌’’ అని సూక్ష్మ రహస్యాలని విప్పారు రబ్బర్‌ సింగ్‌. ‘‘ఈ బండ బుద్ధికి అర్థం కాలేదు సుమండి. సరే ఎక్కడి నుంచి పోటీ’’ అని అడిగాడు సాంబ. ‘‘మనం ఇంతకుముందు గాజువాక ఓటరూ… మేం గాజులోళ్లం కాదా… అని మాంచి పాట పాడుతూ వెళ్తే తూర్పోళ్లు కదా.. ఎటకారం ఎక్కువ. గాజుల జత ఇచ్చేసేరు. గుర్తుంది కదా… అప్పుడప్పుడు ఇలా జరగొచ్చని ఫెడ్రరిక్‌ నాథ్‌ బీరేంద్ర అని కాంబోడియా కవి చెప్పింది గుర్తొచ్చి అప్పుడే మన భీమారం కూడా బెస్ట్‌ అని ఓ కర్చీఫ్‌ ఏసేసా’’ అన్నారు రబ్బర్‌ సింగ్‌. ఆత్రం ఆపుకోలేని సాంబ ‘‘ఎస్‌కిజ్‌మీ… భీమారంలో ఎంద చేట’’ అని తన భాషలో అడిగాడు. ‘‘కంగారెందుకోయ్‌. ఈ బాష ఏ దేశానిది. నే చదివిన లక్షల పుచ్చకాల్లో ఇదెక్కడా లేదే’’ అంటూ ఆశ్చర్యపోయారు రబ్బర్‌ సింగ్‌. ‘‘నీ… ఎంద చేట. అవన్నీ ఎందుకండి. ఏటైపోయింది భీమారంలో’’ అని సాంబ ఉత్సాహంగా అడిగాడు. ‘‘ఏమైందో అందరికీ తెలుసు. మళ్లీ చెప్పాలా. అందుకే ఈసారి కాప్స్‌ ఎక్కువగా ఉన్న పిఠాపురం ఎళ్తున్నా’’ అంటూ అసలు సంగతి చెప్పారు రబ్బర్‌ సింగ్‌. ‘‘కాప్స్‌ అంటే పోలీసులేగా’’ పెద్ద రహస్యం తెలుసుకున్న వాడిలా సంబర పడిపోయాడు సాంబ. ‘‘సాంబ నీకు సుందరంలాగే తొందరెక్కువోయ్‌. కాప్స్‌ అంటే పోలీసులు కాదు… మన సామాజిక వర్గం. ఆళ్లు పిఠాపురం నుంచి నేరుగా అమరావతి అసెంబ్లీకి పంపడం ఖాయమని తేలిందోయ్‌’’ అన్నారు రబ్బర్‌ సింగ్‌. ఆలా అంటున్నప్పుడు రబ్బర్‌ సింగ్‌ కళ్ల ముందు శాసనసభ, తన ఎదురుగా స్పీకర్‌ ఉన్నట్లుగా ఓ భ్రాంతి కదలాడిరది. ‘‘మరి పిఠాపురంలో పొత్తాయన వర్మగారు ఉన్నారంట సింగు గారు’’ అన్నాడు సాంబ. ‘‘ఈ వర్మ ఎవరురా బాబూ. సుబ్బరంగా దెయ్యం సినిమాలు, బయోపిక్‌లు తీసుకోకుండా మనమీదకొస్తున్నాడు’’ అని కంగారుగా అడిగారు రబ్బర్‌ సింగ్‌. ‘‘గురుగారూ.. మీరు ఈక్‌. వర్మ అంటే ఆ సినిమా ఆయన కాదండి బాబూ… ఎప్పటి నుంచో పిఠాపురంలో సొంత క్యాడర్‌ ఉన్న పచ్చ మనిషి. ఆయన్ని కాదని మనం బాగుంటుందా అని’’ సాంబలో ఓ తప్పు జరుగుతోందన్న భావన కనిపిస్తోంది. ‘‘ఇదంతా మన చం.బా.యుడు గారు చూసుకుంటారు. మనకనసరం. పిఠాపురం రాజావారు మనమే. ఇది ఫైనల్‌. ఫిక్స్‌’’ ‘‘ఏంటో ఈయన కోట్స్‌లాగే ఈయన అర్థం కారు. అయినా నాయకుడన్నాక సొంత నియోజకవర్గం ఉండాలి కదా.. చం.బా.యుడి గారికి కుప్పం ఉంది. జగన్‌ గారికి పులివెందుల. రేవంత్‌ రెడ్డి గారికి కొడంగల్‌. రాయ్‌బరేలీలో ఇందిరా గాంధీ. అద్వానీ గాంధీనగర్‌. ఇలా నాయకుడన్న వారికి తనదైన నియోజకవర్గం ఉండాలి కదా అనుకున్నాడు సాంబ. ఇలా అనుకుంటూనే ‘‘ పిల్లి పిల్లల్ని వెంట పెట్టుకుని తిరిగినట్లు నియోజకవర్గం కోసం తిరుగుతారేటో…ఏంది ఈ ఎన్న చేట’’ అని మనసులో అనుకున్నాడు సాంబ.
సీనియర్‌ జర్నలిస్టు,
సెల్‌: 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img