Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఏపీకి బీజేపీ ఏమి చేసింది?

టి.వి.సుబ్బయ్య

ఏదో ఒక పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పోట ీచేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చిందా? ఈ ప్రశ్న ఆ పార్టీ నాయకులు తమకుతాము వేసుకుంటే ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్న జవాబు వస్తుంది? రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఐదేళ పాటు ప్రత్యేక హోదా ఇస్తామని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హామీ ఇచ్చారు. అప్పుడు రాజ్యసభలో బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు తదితరులు తాము అధికారంలోకివస్తే ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించి అసెంబ్లీ, కోర్టులు తదితర కొన్ని భవనాలు కట్టించారు. రాజధాని నిర్మా ణాలకు శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. వస్తూ కలిషిత గంగానది నీళ్లు తెచ్చారు. ఒక ఇటుకవేసి శంకుస్థాపనచేసి వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ఎక్కువ నిధులు అవసరం. అయినప్పటికీ మోదీ సహాయంగా నిధులను ప్రకటించలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు కష్టమైనపని. రాజధాని నిర్మాణానికి సరైన ప్రాంతాన్ని నిర్ణయించడానికి శ్రీ కృష్ణకమిషన్‌ అధ్యయనంచేసి సూచించిన ప్రాంతాన్ని ఎన్నుకోలేదు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా విజయవాడ రాజధానిగా ఏర్పాటు చేయాలని భావించి, విశాలాంధ్ర అని పేరుపెట్టి మళ్లీ అంతర్గత రాజకీయాల కారణంగా అది సాకారం కాలేదు. 2014లో అంతకుముందు ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ తిరుపతిలో జరిగిన సభలో బీజేపీ గెలిస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటిస్తానని ప్రకటించారు. తిరుపతిలో ఉండే వెంకటేశ్వరస్వామి దేవుడిగా ఆరాధించే మోదీ ఇచ్చినమాట, చేసిన వాగ్దానాన్ని అమలు చేయ కుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా ప్రకటించి ఉన్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి జరిగిఉండేది. అప్పుడు చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలని కోరారన్న వార్తలు వచ్చాయి. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు చేసినంత అన్యాయం మరెవరూ చేయలేదు. మోదీ అధికారం చేపట్టిన నాటినుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని అనుసరించడానికి, కార్పొరేట్లను పెంచడానికి సమయం కేటాయించారు. అత్యంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలోనూ మోదీ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇందులోనూ రాజకీయ పితకలాటం చోటు చేసుకున్నదని సందేహాలు వ్యక్తమయ్యాయి. నిర్మాణ బాధ్యతను కేంద్రం నుంచి చంద్రబాబే కావాలని తీసుకున్నారన్న వదంతులు వచ్చాయి. అందరూ కలిసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఈ నాటికీ పూర్తిగాకుండా చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో ఏరోజైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి, తద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు కలగడానికి ప్రయత్నించారా? ప్రాజక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పే స్థితిలో లేరు. ఇక కాంగ్రెస్‌ హయాంలో 1967లో రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వాలని గొప్పపోరాటం జరిగింది. ఈ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రముఖపాత్ర వహించాయి. రాష్ట్ర ప్రజలంతా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష చేసి తనప్రాణాలు అర్పించారు. కమ్యూనిస్టు పార్టీలకు చెందిన 31 మంది ఎంఎల్‌ఏలు, నలుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఉక్కు ఉద్యమంలోకి దిగి నిరంతరం కృషిచేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఫ్యాక్టరీని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కూడా చాలా కాలానికి ఇందిరాగాంధీ రాష్ట్రానికి వచ్చి శంకుస్థాపన చేసి ఫ్యాక్టరీకి కేవలం ఐదువేలకోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించారు. అప్పటికీ రాష్ట్రంలోనే ఉన్న సింగరేణికి బొగ్గుగనుల నుంచి బొగ్గును కేటాయించలేదు. ఆ తర్వాత నేటికీ ఎలాంటి సహాయం అందకపోగా ఫ్యాక్టరీని ప్రైవేటువ్యక్తులకు అమ్మడానికి బీజేపీ ప్రభుత్వం నిర్ణయిం చింది.ఫ్యాక్టరీని అమ్మవద్దని, ప్రభుత్వరంగ సంస్థగానే ఉంచాలని సంవత్స రానికి పైగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల తరఫున ఏఐటీయూసీ, సీఐటీయు తదితర యూనియన్లు ఇతర చిన్నచిన్న యూనియన్లు ఆందోళన చేస్తున్నాయి. అయితే మోదీ దేశంలో సామాన్యులను అన్యాయంచేసి కార్పొ రేట్లను పెంచి పోషించేలా పాలన చేస్తున్నారు. దేశంలో మత రాజ్యాన్ని తయారు చేయాలని కంకణం కట్టుకున్నారు. క్రమంగా రాజ్యాంగాన్ని, స్వాతంత్య్రానికి స్వస్తి పలికి హిందూమత ఆధిపత్య సమాజాన్ని తీసుకు రావాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఏడు జిల్లాలకు ఐదువందల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలు ఇస్తానని మోదీ చేసిన వాగ్దానాలలో ఒకటి. మొదట్లో 50కోట్లు ఇచ్చి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. అలాగే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తానన్న మోదీ పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ కోసం రాష్ట్రంలో వామపక్షాలు మాత్రమే ఉద్యమం చేశాయి. విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని వాగ్దానంచేసి ఇప్పుడు ఇతర ప్రాంతానికి కేటాయించాలని చూస్తున్నారు. ఏ వాగ్దానాన్ని రాష్ట్రంలో అమలుచేసిన దాఖలాలేదు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటుకు సహకరించారు. ఈ అంశాలలో ప్రధాన ప్రతిపక్షాలు ఉద్యమాలు చేయడానికి సిద్ధపడలేదు. మోదీ ఎన్నికల ప్రచారసభలో కొత్తని నాదాలు చేయడంలో, వాగ్దానాలు చేయడంలో మొనగాడు. రాష్ట్రానికి అన్ని విధాలుగా మోసం చేసినా రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీతో పొత్తుకోసం తహతహలాడటం విచిత్రం. వందలకుపైగా లక్షల కోట్ల అప్పులు చేసి అభివృద్ధిని విస్మరించి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కార్మికులను, కర్షకులకు ద్రోహం చేస్తున్న కేంద్రంలో మళ్లీ అధికారం కావాలని టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్న బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు పెరగనీయడం ఓటర్లు తమకు తామే అన్యాయం చేసుకున్న వారవుతారు. తనమీద కేసులున్నాయి గనక జగన్‌మోహన్‌రెడ్డి అన్నిటికీ మోదీకి లొంగి ఉంటున్నారు. మరి ప్రతిపక్షాలు ఎందుకు దగ్గర కావాలని ఆతృత పడుతున్నాయి?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img