Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీ నీటి హక్కులపై దాడిని తిప్పికొట్టాలి

కేసీఆర్‌ ప్రభుత్వం అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్నది. కె.ఆర్‌.యం.బి. ఆదేశాలను సహితం ఖాతరు చేయడం లేదు. అసంబద్ధ వాదనలు, డిమాండ్లతో నదీజలాల సమస్యను జఠిలం చేయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. కె.ఆర్‌.యం.బి. సమావేశాన్ని వేదికగా వాడుకొని రాజకీయపరమైన డిమాండ్లతో ఈ నీటి సంవత్సరంలో నీటి వినియోగానికి అవరోధాలు సృష్టించే ధోరణి ప్రస్ఫుటంగా కనపడుతున్నది. వాటిని దీటుగా తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

టి. లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్‌, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం ప్రకాశం జిల్లా నీటి హక్కులపై తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నది. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో పలు దఫాలు సమావేశమై సెప్టెంబరు 1న జరగబోయే కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో తెలంగాణ వాదనలను బలంగా వినిపించడానికి సన్నద్ధం చేసినట్లు వార్త లొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైపు నుండి అలాంటి కృషి జరిగినట్లు కనపడడం లేదు. నీటి హక్కులపై తెలంగాణ రాష్ట్రం చేస్తున్న దాడి, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గజిట్‌ నోటిఫికేషన్‌ పర్యవసానాలపై రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సాగునీటి రంగంపై అవగాహన ఉన్న ఉద్యమకారులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలను తీసుకోవాలన్న డిమాండును పెడచెవిన పెట్టారు. సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించి నట్లు కూడా వార్తలు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. అధికారులు కొన్ని సమస్యలపై మాత్రమే స్పందించి, బోర్డుకు ఉత్తరాలు రాసిన ఘటనలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలలోను చిత్తశుద్ధి కొరవడిరది. రాజకీయ అనుబంధాలకు అతీతంగా అందరినీ కూడగట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి.
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 మేరకు కేంద్ర ప్రభుత్వం కృష్ణా-గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధులను నిర్ణయిస్తూ 2021 జులై 15న జారీచేసిన గజిట్‌ నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 14 నుండి అమలులోకి రానున్నది. సెప్టెంబరు 1న జరుగనున్న బోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఆం.ప్ర.పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు కృష్ణానది యాజ మాన్య బోర్డు కార్యాలయాన్ని హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలి. కృష్ణానది పరివాహక ప్రాంతానికి బయట వందల కి.మీ. దూరంలో ఉన్న విశాఖపట్నంకు బోర్డు కార్యాలయాన్ని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. బేషరతుగా దాన్ని ఉపసంహరించుకొని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న కర్నూలుకు బోర్డు కార్యాలయాన్ని తరలించమని బోర్డు సమావేశంలో నిర్దిష్టంగా ప్రతిపాదించి, తదనుగుణంగా నిర్ణయం తీసు కొనేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కేసీఆర్‌ ప్రభుత్వం అడ్డ గోలు చర్యలకు పాల్పడుతున్నది. కె.ఆర్‌.యం.బి. ఆదేశాలను సహితం ఖాతరు చేయడం లేదు. అసంబద్ధ వాదనలు, డిమాండ్లతో నదీజలాల సమస్యను జఠిలం చేయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. కె.ఆర్‌.యం.బి. సమావేశాన్ని వేదికగా వాడుకొని రాజకీయపరమైన డిమాండ్లతో ఈ నీటి సంవత్సరంలో నీటి వినియోగానికి అవరోధాలు సృష్టించే ధోరణి ప్రస్ఫుటంగా కనపడుతున్నది. వాటిని దీటుగా తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. కాబట్టే, బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు నేటికీ అమలులో ఉన్నది. బచావత్‌ ట్రిబ్యునల్‌ నీటి వినియోగ ఆధారంగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటా యింపులను చేసినప్పటికీ చేయలేదంటూ అడ్డగోలుగా వాదిస్తూ, తెలంగాణలో పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్నదని, కనీసం 50:50 నిష్పత్తిలో నీటిని కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నది. నీటి వినియోగంలో గందరగోళం సృష్టించడం ద్వారా లబ్ధి పొందాలన్నదే వారి లక్ష్యంగా కనపడుతున్నది. ఆ కుటిల నీతిని ఛేదించాలి. ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ శాఖాధికారులు తాజాగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయి. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా ‘‘ఫస్ట్‌ ఇన్‌ టైం, ఫస్ట్‌ ఇన్‌ రైట్‌’’ అన్న సూత్రాన్ని కొలబద్దగా పరిగణించి, 1960 సెప్టెంబరు నాటికి ప్రణాళికా సంఘం అనుమతి ఉన్న ప్రాజెక్టులకు 75% ప్రామాణికంగా నికర జలాలను కేటాయించింది. అదనంగా జురాలకు, శ్రీశైలం రిజర్వాయరు వద్ద ఆవిరి పద్దు కింద నీటిని కేటాయించింది. ఈ విషయంలో సమర్థవంతంగా వాదనలు వినిపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు తోడు, ఆ తీర్పు పరిధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బీమాకు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు చేసిన రెండు సర్దుబాట్లను పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీ, తెలంగాణ 299 టీఎంసీ వాడుకోవాలని 2015 జూన్‌ 18, 19 తేదీలలో కుదిరిన ఒప్పందం సముచిత మైనది. ఆ ఒప్పందంపై కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖ ప్రధాన కార్యదర్శులు సంతకాలు చేశారు. ఆ ఒప్పందం మేరకే ఇప్పటి వరకు నీటిని వినియోగించుకుంటున్నారు. ఆ ఒప్పం దాన్ని తిరగదోడాలని కేసీఆర్‌ ప్రభుత్వం విఫల ప్రయత్నం చేస్తున్నది. ఆ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టాలి.
శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 834 అడుగులు. దానికిలోపు నీటి నిల్వ ఉన్నప్పుడు జలవిద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగించకూడదు. కృష్ణా డెల్టా-నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల క్రింద సాగునీటి అవసరాలకు అనుగుణంగా శ్రీశైలం జలాశయం నుండి విద్యుత్తు ఉత్పత్తికి నీటిని వాడాలని విస్పష్టంగా మార్గ దర్శకాలున్నాయి. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కె.ఆర్‌.యం.బి. ఆదేశాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల లోపు నీటి నిల్వ ఉన్నప్పటి నుంచే శ్రీశైలం ఎడమ విద్యుత్‌ కేంద్రంతో పాటు నాగార్జునసాగర్‌, పులిచింతల కేంద్రాల నుండి జల విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించి కొనసాగిస్తు న్నది. ఆల్మట్టి నిర్మాణం తర్వాత శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం తగ్గిపోయి, 834 అడుగులపైన నీటి నిల్వ ఉండే రోజులు గణనీయంగా తగ్గిపోయాయి. తెలంగాణ ప్రభుత్వ దుశ్చర్యలను బోర్డు సమావేశంలో గట్టిగా నిలదీసి, అడ్డుకట్ట వేయాలి. తద్వారా, కరవు పీడిత రాయలసీమ ప్రాంత నీటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నది. ఆం.ప్ర. పునర్వ్యవస్థీకరణ చట్టం-2014, షెడ్యూల్‌ 11(10) జాబితాలో ఉన్న తెలుగు గంగ, గాలేరు – నగరి, హంద్రీ – నీవా, వెలుగొండ ప్రాజెక్టులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో లేవంటూ గోల చేస్తూనే ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలంటూ, కె.ఆర్‌.యం.బి.కి ఆర్థిక తోడ్పాటు ఇవ్వద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తరాలు రాసింది. తాజాగా హంద్రీ – నీవాపై అభ్యంతరం తెలియజేస్తూ కె.ఆర్‌.యం.బి.కి ఉత్తరం రాసింది. విభజన చట్టంలో పేర్కొన్న కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విభజన తర్వాత పాలమూరు – రంగారెడ్డి, డిరడి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన ఎస్‌.ఎల్‌.బి.సి. తదితర ప్రాజెక్టుల నిర్మాణాన్ని మాత్రం కొనసాగిస్తు న్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద వైఖరిని ఎండగట్టి, మన ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి.
కె.సి.కెనాల్‌ నీటి వినియోగంపై వివాదాన్ని సృష్టించే కుటిల రాజనీతితో కేసీఆర్‌ ప్రభుత్వం ఆగస్టు11న కె.ఆర్‌.యం.బి. ఛైర్మన్‌కు ఉత్తరం రాసింది. కె.సి.కెనాల్‌కు కేవలం 10టీఎంసీలు మాత్రమే వినియోగించుకొనే అర్హత ఉన్నదని ఆ ఉత్తరం సారాంశం. దీనిపై ఇప్పటి వరకు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం స్పందించలేదు. ఈ అంశంపై కె.ఆర్‌.యం.బి. సమావేశంలోనైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బలంగా గళమెత్తాలి. 150 ఏళ్ల చరిత్ర ఉన్న పురాతనమైన కె.సి.కెనాల్‌ నీటి వినియోగంపై వివాదాన్ని సృష్టించే కుట్రను భగ్నం చేయాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం-1956 అమలులోకి వచ్చింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం బచావత్‌ ట్రిబ్యునల్‌ను నియమించింది. కృష్ణానదిలో 75% నీటి లభ్యత ప్రామాణికంగా లభించే 2060 టీఎంసీలను మహారాష్ట్ర, కర్ణాటక, పూర్వ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రాజెక్టుల వారీగా బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 800 టీఎంసీల్లో కె.సీ. కెనాల్‌కు39.90 టీఎంసీలు కేటాయించారు. ఆ కేటాయింపును డిస్టర్బ్‌ చేయడానికి వీల్లేదని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కూడా తేల్చిచెప్పింది.
తుంగభద్ర జలాశయంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం 132.47 నుండి 100.85 టీఎంసీలకు తగ్గిపోయింది. ఆ నీరంతా సుంకేసుల ఆనకట్ట మీదుగా శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. తుంగభద్ర ఎగువ కాలువకు కేటాయించిన 32.5 టీఎంసీ, తుంగభద్ర దిగువ కాలువకు కేటాయించిన 29.5 టీఎంసీలు నీటి సంవత్సరంలో కూడా వినియోగించుకొన్న దాఖలాలు లేవు. బచావత్‌ ట్రిబ్యునల్‌ కె.సి.కెనాల్‌కు కేటాయించిన 39.9 టీఎంసీలను వివాదాస్పదం చేయడానికి విఫల ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎందుకు మౌనం వహించిందో ఆశ్చర్యంగా ఉన్నది. మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రాజోలుబండ కుడి కాలువ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించకుండా మూలన పడేసింది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఈ పథకం ప్రాధాన్యతను గుర్తించి 4 టీఎంసీలు కేటాయించింది. అది ఇంకా అమల్లోకి రాలేదు. దాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం వివాదాస్పదం చేస్తున్నది. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుగా నిలిచింది. మరొకవైపున తుమ్మెళ్ళ, తదితర ఎత్తిపోతల పథకాలను నిర్మించుకొంటున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న అధర్మ నీటి యుద్ధం నుండి ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కులను పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపైన ఉన్నది.
వ్యాస రచయిత ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి
అధ్యయన వేదిక కన్వీనర్‌, 9490952221

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img