Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కేరళ అభివృద్ధిలో అచ్యుత మీనన్‌ పాత్ర కీలకం

సుధా మీనన్‌

ఆయన గొప్ప మార్క్సిస్టు మేధావి. విశిష్టమైన రాజనీతిజ్ఞుడు. సమర్థుడైన పరిపాలకుడు. జీవితాంతం చిత్తశుద్ధి కలిగిన కమ్యూనిస్టుగా పని చేశారు. ఆయనే చేలత్‌ అచ్యుత మీనన్‌. కేరళ అభివృద్ధిలో ఆయనది కీలకమైన పాత్ర. ఆధునిక కేరళ రాజకీయ, ఆర్థిక రంగాలలో ఆయనను విస్మరించి చర్చించే అవకాశమేలేదు. 1991 ఆగస్టు 16న ఆయన మరణించారు. ఆయన మృతిచెంది ముప్పైఏళ్లు గడిచింది. ఇప్పటికీ ఆయన వారసత్వం రాష్ట్రంలో చెక్కుచెదరకుండా నిలిచే ఉంది. 1969 నవంబరు 1వ తేదీన రాష్ట్రముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. సంకీర్ణప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేకపోయినప్పటికీ అచ్యుత మీనన్‌ నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి ఉన్న విశిష్ట రాజనీతిజ్ఞతతో పూర్తి ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రిగా పాలించారు. ప్రభుత్వం ఐదేళ్లు పనిచేయటం సాధ్యం కాదన్న వారి సందేహాలు పటాపంచలయ్యాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ అసెంబ్లీకి జరిగినఎన్నికల్లో ఫ్రంట్‌ గెలుపొంది సంకీర్ణప్రభుత్వం ఏర్పడిరది. రెండోసారి కూడా అచ్యుతమీనన్‌కు కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ తోడ్పాటుతో 1977 వరకు ప్రభుత్వం కొనసాగింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అత్యంత దీర్ఘకాలం పని చేసిన ముఖ్యమంత్రులలో ఆయన ఒకరు.
చరిత్రాత్మక భూసంస్కరణల చట్టం
197077 వరకు సాగిన ప్రభుత్వంలో వచ్చిన అనేక సంక్షోభాలను అచ్యుత మీనన్‌ చాకచక్యంతో, సమర్థంగా పరిష్కరించగలిగారు. సుస్థిర, సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన చిహ్నంగా నిలిచారు. అనేక ప్రయోగాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సాధించిన గొప్ప విజయాల్లో భూసంస్కరణ చట్టాన్ని ఆమోదించటం ఒకటి. చరిత్రాత్మకమైన ఈ చట్టం 1970 జనవరి1న అమలులోకి వచ్చింది. ఈ చట్టంతో బడా భూస్వాములు భూమిపైన శాశ్వతంగా హక్కును కోల్పోయారు. ఆయన రాష్ట్రంలో సైన్సు టెక్నాలజీ శాఖతోపాటు అనేక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అభివృద్ధి అధ్యయన కేంద్రాలను నెలకొల్పారు. వాటిలో శ్రీచిత్ర తిరునల్‌ మెడికల్‌ సెంటర్‌, ధరిత్రి సైన్సు అధ్యయన కేంద్రం, నీటి వనరుల నిర్వహణ కేంద్రం, కేరళ అటవీ పరిశోధనా సంస్థ ఉన్నాయి.
ప్రభుత్వరంగంలో అనేక సంస్థలు
అచ్యుత మీనన్‌ పాలనలో ప్రభుత్వ రంగంలో అనేక సంస్థలను నెల కొల్పారు. కెల్ట్రాన్‌కేరళ ఎలక్ట్రానిక్స్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ అలాగే అనేక ఇతర కార్పొరేషన్లు, బోర్డులు ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలో ప్రాంతీయ కేన్సర్‌ పరిశోధనా కేంద్రం, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొచ్చిన్‌ యూని వర్సిటీ ఆఫ్‌ సైన్సు అండ్‌ టెక్నాలజీ, చలన చిత్రాల అభివృద్ధి కార్పొరేషన్‌, ఎస్‌సి, ఎస్‌టిల కార్పొరేషన్‌, భూమి అభివృద్ధి కార్పొరేషన్‌, రాష్ట్ర పారిశ్రామిక సంస్థలను స్థాపించారు. అలాగే ప్రతి పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హైస్కూలు ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతటా ప్రభుత్వ ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించారు. రైతు చట్టం, గ్రాట్యుటీ చట్టం, ఇళ్లు లేని పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణ పథకం, కాలేజీ ఉపాధ్యాయులకు నేరుగా వేతనాల చెల్లింపు, బీడీ సహకార సంఘాలు తదితర సంస్థలు అచ్యుత మీనన్‌ కాలంలోనే ఏర్పాటయ్యాయి. ఆయన పాలనా కాలం కేరళ చరిత్రలో స్వర్ణ యుగమే. ఎమర్జెన్సీ కాలంలోనూ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. 64 ఏళ్ల వయసులోనే క్రియాశీల రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. గొప్ప దార్శనికుడిగా పేరు పొందారు. గాంధీ నైతిక సూత్రాలను, నెహ్రూ ఆధునికతను ఆయన అభిమానించారు. మార్క్సిజం సిద్ధాంతంతో మానవాళికి దోపిడీ నుంచి విముక్తి లభిస్తుందని ఆయన బలంగా విశ్వసించారు. జీవిత చరిత్ర అచ్యుత మీనన్‌ త్రిసూర్‌కు సమీపంలోని పుత్తుక్కాడ్‌ గ్రామంలో 1913 జనవరి 13న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మి కుట్టియమ్మ, మదత్తి వెట్టిల్‌ అచ్యుత మీనన్‌లు. విద్యార్థిగా కూడా ఆయన అసాధారణ ప్రతిభ కనబరిచారు. మెట్రిక్‌పరీక్షలో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించారు. బిఏ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు యూనివర్సిటీలో మాథమెటిక్స్‌లో 2వ ర్యాంక్‌ సాధించారు. తిరువనంతపురం ప్రభుత్వ కళాశాల నుండి 2వ ర్యాంక్‌తో బిఎల్‌ పట్టా పొందారు. హిందు చట్టం పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి గోల్డ్‌మెడల్‌ పొందారు. ఏడాదిపాటు న్యాయవాదిగా పనిచేసి అనంతరం జాతీయఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో కేరళ ప్రదేశ్‌కాంగ్రెస్‌ సభ్యుడుగా ఉన్నారు. స్వాతంత్య్రపోరాటంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ కార్యకలాపాలపై భ్రమలు కోల్పోయి కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలో చేరారు. రష్యాలో విప్లవం విజయవంతమైన తరవాత అనేక మంది యువకులలో నూతన ఉత్సాహం కలిగినట్టుగానే అచ్యుత మీనన్‌లోనూ కలిగింది. కమ్యూనిజానికి ఆకర్షితులైన అచ్యుత మీనన్‌ కమ్యూనిస్టు పార్టీ కేరళ శాఖలో సభ్యుడయ్యారు. రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని, రైతులను సమీకరించి అంటరానితనానికి, భూస్వాములదోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్వహించటంలో కీలక పాత్ర వహించారు. కొచ్చిన్‌ స్టేట్‌లో రైతులమార్చ్‌ని నిర్వహించారు. 194248లో కొచ్చిన్‌ స్టేట్‌ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అయ్యారు. 1948లో సీపీఐ సెంట్రల్‌ కమిటీ సభ్యుడయ్యారు. సీపీఐ కేరళ శాఖ కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేశారు. పార్టీ చీలిపోయినప్పుడు సీపీఐలోనే కొనసాగారు. పార్టీ మహాసభలలో అనేక అంశాలపై నిక్కచ్చిగా మాట్లాడేవారు. ట్రావెన్‌కోర్‌ కొచ్చిన్‌ స్టేట్‌ అసెంబ్లీకి 1952లో ఎన్నికయ్యారు.
1956లో కేరళ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయన రూపొందించిన కరపత్రమే 1957 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల ప్రణాళికగా తీసుకున్నారు. ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌ ముఖ్యమంత్రిగా దేశంలోనే మొదటిసారిగా ఎన్నికలలో గెలిచిన కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం కేరళలో ఏర్పడిరది. నంబూద్రిపాద్‌ ప్రభుత్వంలో ఆర్థిక, హోంమంత్రిత్వ శాఖలను అచ్యుత మీనన్‌ సమర్థంగా నిర్వహించారు. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన పాత్ర గర్వించదగినది.
వ్యాస రచయిత కార్మిక హక్కుల కార్యకర్త, పరిశోధకురాలు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img