Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కోర్టుల తీర్పుల్లో నిష్పాక్షిత ఉందా?

ఎం కోటేశ్వరరావు

ఎన్నికల బాండ్ల రూపంలో కార్పొరేట్ల కంపెనీల నుంచి విరాళాలను తీసుకోవటం అక్రమం అని ఆ పథకం ప్రారంభం నుంచి అనేక మంది చెబుతున్నా గొర్రె కసాయివాడిని నమ్మినట్లు చాలా మంది అదొక మంచి సంస్కరణ అని మద్దతు ఇచ్చారు. సుప్రీం కోర్టు 2024 ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పుతో కొందరు సొంత బుర్రలతో ఆలోచించటం మొదలు పెట్టారు. మరికొందరు బాండ్లను, తీసుకున్న పార్టీలను సమర్థిస్తున్నారు. అనేక కేసుల్లో వచ్చిన తీర్పులు, వాటి తరువాత పదవి నుంచి దిగిపోయిన న్యాయమూర్తులు పొందిన పదవులను చూసిన తరువాత న్యాయవ్యవస్థ మీద జనం విశ్వాసం కోల్పోతున్నారు. అలాంటి స్థితిలో ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు వ్యవహరించిన తీరుతో అనేక మందికి విశ్వాసం పెరిగింది. ఇది మరొక భ్రమకు దారి తీస్తుందా ? మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ దిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా మీద దర్యాప్తు సంస్థలు సమర్పించిన తప్పుడు వివరాల ప్రాతిపదికన దిగువ కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. పదేళ్ల పాటు వేధింపులకు, జైలుపాలై, ఉద్యోగం పోగొట్టుకున్న ఉదంతం చూసిన తరువాత ఎవరికైనా ఏమనిపిస్తుంది ? వ్యవస్థల మీద విశ్వాసం పెరుగుతుందా, తగ్గుతుందా !
పదేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశాన్ని ఊపివేసిన, బీజేపీకి ఓట్లు, అంతకంటే ఎక్కువ సీట్లు రాల్చిన కేసుల్లో 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం ఒకటి. దీని గురించి ఎంత మందికి జ్ఞాపకం ఉందో? మరోసారి 2024 మార్చి 22న దిల్లీ హైకోర్టు దీని గురించి జనానికి గుర్తు చేసింది. అదేమంటే 2017 డిసెంబరు 21 ఎలాంటి ఆధారాలు లేవంటూ కొట్టివేసిన ప్రత్యేక కోర్టు తీర్పును తిరిగి విచారించాలని 2018 మార్చి 20వ తేదీన సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌కు అనుకూలంగా ఆరు సంవత్సరాల తరువాత దిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సదరు తీర్పులో పరస్పర వైరుధ్యాలు కనిపించాయని, దాని మీద అప్పీలు చేయాలా లేదా అనేది సీబీఐ ఇష్టమని చెప్పింది. దీన్నే మరో విధంగా చెప్పాలంటే అనుమతించింది. ఒక తీర్పు మీద చేసిన అప్పీలును పరిష్కరించటానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్న న్యాయవ్యవస్థ మీద, అందునా ఏడుగురు న్యాయమూర్తులు విచారించిన తరువాత సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన తీర్పు మీద జనాలకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది ? ఎన్నికల బాండ్ల మీద స్పందించిన తీరుకు సంతోషించాలా ? 2జీ కేసులో చేసిందాన్ని మరొక విధంగా భావించాలా? యూపీిఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న డీఎంకెే నేత రాజా, అదే పార్టీ ఎంపీగా ఉన్న కనిమొళి, మరో 16 మంది అధికారులు, ఇతరులు 2జీ కేసులో నిర్దోషులని 2017 తీర్పులో కోర్టు పేర్కొని వారిని విడుదల చేసింది. అనుచిత పద్దతుల్లో అయిన వారికి వీలుగా అనుసరించిన పద్దతి కారణంగా లక్షా 76వేల కోట్ల రూపాయలు దేశ ఖజానా నష్టపోయిందన్నది కేసులో వచ్చిన తీవ్ర ఆరోపణ. దిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ లైసెన్సుదారులకు రు.30 కోట్ల మేర రాయితీలు అనుచితంగా ఇచ్చిందని, ప్రైవేటు మద్యం వ్యాపారులు దుకాణాలను దక్కించుకునేందుకు అనువుగా విధానాన్ని రూపొందించినందుకు లబ్ధి పొందిన వారు వంద కోట్ల రూపాయల ముడుపులు అందచేసినట్లు ఆరోపణలు చేశారు.
అవినీతి ఎంత అయినా అందుకు పాల్పడిన వారిని వదల కూడదు. వంద కోట్ల నిగ్గుతేల్చటంలో రెండు సంవత్సరాలుగా సీబీఐ, ఈడీ కూడా విఫలమైంది. కొందరిని అనుమానితులు, సాక్షులు, నిందితులు అంటూ అరెస్టుచేసి వివరాలు చెప్పాలని వారిని అడుగుతున్నది, నిందితులను నిరవధికంగా బెయిలు రాకుండా జైలుపాలు చేసింది. తాము నిధులు ఇచ్చామంటూ అప్రూవర్లుగా మారిన కొందరు చెప్పటం తప్ప ఆ సొమ్ము ఎవరి ఖాతాకు, ఎలా చేరిందన్నది ఇంతవరకు తెలియదు. బీఆర్‌ఎస్‌ నాయకులు కల్వకుంట్ల కవితను ముందు సాక్షి అన్నారు, తరువాత నిందితురాలిగా ప్రకటించిన తరువాత అరెస్టు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తమ ముందుకు హాజరుకావాలని ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చింది. తాను ఏ హోదాలో రావాలో చెప్పమని అడిగితే అదేం కుదరదు మేం రమ్మన్నాం గనుక రావాల్సిందే అన్నట్లుగా వ్యవహరించింది. దాంతో తనను బలవంతం చేస్తున్నారని, రక్షణ కల్పించాలని కేజ్రీవాల్‌ దిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా వ్యక్తిగత హోదాలో విచారణకు రావాలని, వచ్చిన తరువాత అరెస్టు చేస్తామని గాని, లేదని గానీ తాము చెప్పటం లేదని ఈడీ కోర్టులో వాదించింది. కోర్టు కేజ్రీవాల్‌ కోరినట్లుగా రక్షణ కల్పించేందుకు తిరస్కరించింది. వెంటనే ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ ఇంటికి పోవటం సోదా తతంగం, అరెస్టు అంతా నాటకీయంగా జరిగింది. వంద కోట్ల మద్యం కేసు మీద ఇంత తీవ్రంగా కేంద్రీకరించిన అదే సీబీఐ, ఈడీ కాగ్‌ చెప్పిన లక్షా 76వేల కోట్ల నష్టం జరిగిందన్న కేసులో ముడుపులను నిరూపించటంలో ఎందుకు ఘోరంగా విఫలమైనట్లు ? ప్రభుత్వ సంస్థలను తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకుంటారో ఎన్నికల బాండ్ల కేసులో ఎస్‌బీఐ తీరు తిరుగులేని విధంగా వెల్లడిరచింది. సుప్రీం కోర్టు తీర్పును వమ్ముచేసేందుకు తమ దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించాలంటే మూడు నెలలు పడుతుందని కోర్టునే తప్పుదారి పట్టించేందుకు చూసింది. చివరకు విధిలేక వెంటనే సమర్పించింది. అది ఎలా సాధ్యమైంది ? ఎందుకు, ఎవరిని రక్షించేందుకు ముందు ఠలాయించినట్లు ? కచ్చితంగా బీజేపీని రక్షించేందుకే అన్నది స్పష్టం. రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ స్టేట్‌బ్యాంకు పరువు మురికి గంగలో కలిసింది. అక్రమాలకు పాల్పడిన ప్రైవేటురంగ ఎస్‌ బాంకును ఆదుకొనేందుకు అధికారంలో ఉన్న పెద్దలు ఆరువేల కోట్ల రూపాయలను ఎస్‌బీఐ ద్వారా ఇప్పించినప్పుడే అది స్వతంత్ర సంస్థకాదు పాలకుల కీలుబొమ్మ అని తేలింది. సీబీఐ, ఈడీ డైెరెక్టర్ల పదవీ కాలాన్ని నియంత్రించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని 2023 జులైలో ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్‌ తీర్పు ఇచ్చింది. అందువలన ఆ సంస్థల పదవుల్లో ఉన్నవారు, వాటి కోసం అర్రులు చాస్తున్నవారు కేంద్ర పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటారన్నది స్పష్టం. అందుకు సిద్దపడ్డ వారినే ఎంపిక చేస్తారు. అందువలన అవి స్వతంత్ర సంస్థలని చెప్పటం జనాన్ని వంచించటం తప్ప మరొకటి కాదు. గతేడాది మార్చి నెలలో పద్నాలుగు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఈడీ అరెస్టుల నుంచి రక్షించాలని సుప్రీం కోర్టు తలుపు తట్టారు. గడచిన పదేళ్ల కాలంలో ఆ సంస్థ చేసిన అరెస్టుల్లో 95శాతం ప్రతిపక్షాలకు చెందిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచన ఎంత ప్రమాదకరంగా ఉందో ఒక కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వెల్లడిరచింది. నిందితుడిని అరెస్టు చేసేందుకు ఈడీ తగిన కారణాలు చూపుతూ ఎలాంటి మినహాయింపులు లేకుండా రాతపూర్వకంగా నోటీసు అందచేయాలని ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, ఇతరులు దాఖలు చేసిన పిటీషన్‌ మీద ఎలాంటి పునరాలోచన అవసరం లేదని పేర్కొన్నది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదనే ఒక్క కారణంతో కూడా ఎవరినైనా అరెస్టు చేయవచ్చనే ఈడీ వాదనను తోసిపుచ్చుతూ ఒక మనీలాండరింగ్‌ కేసులో గతేడాది అక్టోబరులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈడీ తీరు పారదర్శకంగా ఉండాలని, వేధింపులకు గురిచేస్తున్నట్లుగా ఉండకూడదని పేర్కొన్నది. మనీలాండరింగ్‌ చట్టం 2002లో సెక్షన్‌ 50 ప్రకారం సమన్లకు సాక్షి సహకరించటం లేనందున సెక్షన్‌ 19 ప్రకారం అరెస్టుకు అతడు లేదా ఆమె అర్హురాలే అని ఈడీ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. దీని మీద పునరాలోచన చేయాలని ఈడీ వాదనను సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక పిటీషన్‌ దాఖలు చేయటం నిరంకుశ అధికారాలను దానికి కట్టబెట్టాలని చూడటమే. ముంబై కేంద్రంగా హిందూస్థాన్‌ టైమ్స్‌లో పని చేసిన సీనియర్‌ ఎడిటర్‌ సతీష్‌ నందగోంకర్‌ను ఆ పత్రిక ఎడిటర్‌ వేధించిన తీరు అతను మరణించిన తరువాత వెల్లడైంది. మరణానికి దారి తీసిన కారణాలపై ముంబై ప్రెస్‌ క్లబ్‌ పరిశోధన జరిపింది. కొంత మంది ఫ్రీలాన్సర్‌ జర్నలిస్టులు రాసిన వార్తలను ప్రచురించాలని నందగోంకర్‌ సంపాదకుడికి పంపారు. వాటిని ప్రచురించకపోవటమే గాక పనికిమాలినవంటూ అవమానించాడు. అయితే పత్రికలో తనకున్న అవకాశాన్ని వినియోగించుకొని ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో వాటిని ప్రచురించారు. అవి ముద్రణ సంచికల్లో రాలేదు. కొన్ని రోజుల తరువాత నందగోంకర్‌ను ఆన్‌లైన్‌ స్టోరీలను ఎంపిక చేసి ప్రచురించే బాధ్యతల నుంచి తొలగించి అవమానించారు. ఆ ఒత్తిడితో ఆయన గుండెపోటుకు గురై మరణించినట్లు తేలింది. తమకు నచ్చని కథనాలను రాసే జర్నలిస్టులను యజమానులు ఎలా వేధించేది అందరికీ తెలిసిన సత్యమే. దీనికి మీడియా యాజమాన్యాలకు పార్టీలకు, అధికారంలో ఉన్నవారితో ఉన్న పరస్పర ప్రయోజన సంబంధాలే కారణం. గతంలో కూడా వివిధ వ్యవస్థలను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ దుర్వినియోగం చేసింది. ప్రతిపక్షంగా దాన్ని విమర్శించిన బీజేపీి ఇప్పుడు అంతకంటే వేగంగా, దారుణంగా దుర్వినియోగానికి పాల్పడుతోంది. వ్యవస్థల మీద జనాలకు విశ్వాసం కోల్పోవటాన్ని వేగిరం చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img