Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

క్షీణిస్తున్న ప్రజాస్వామ్య విలువలు

ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్య విలువలను పక్కనపెడుతూ నిరంకుశత్వ భావనలను భుజాన వేసుకొని పయనిస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. స్వీడెన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ గోతెన్‌బర్గ్‌కు సంబంధించిన వి-డెమ్‌ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసిన ‘డెమొక్రసీ రిపోర్ట్‌ 2023 : ఆటోక్రటైజేషన్‌ చేంజింగ్‌ నేచర్‌’ నివేదిక ప్రపంచవ్యాప్త దేశాల్లో ప్రజాస్వామ్య లేదా నిరంకుశ పాలనలకు సంబంధించిన లోతైన విశ్లేషణలుచేసి తమ ఫలితాలను వెల్లడిరచింది. ప్రపంచ దేశాల ఉదార ప్రజాస్వామ్య సూచిక (లిబరల్‌ డెమొక్రటిక్‌ ఇండెక్స్‌, యల్‌డిఐ) ఆధారంగా పాలన విధానాలను పరిశీలించిన పిదప దేశాలను నాలుగు సమూహాలుగా విభజించింది. ఉదార ప్రజాస్వామ్య దేశాలు, ఎన్నికల ప్రజాస్వామ్య దేశాలు, ఎన్నికల నియంకుశత్వ దేశాలు, పూర్తి నిరంకుశత్వ దేశాలుగా వర్గీకరించారు. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో అకడమిక్‌ స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలు తగ్గినట్లు, నిరంకుశత్వ ధోరణి పెరిగినట్లు తేల్చారు.
ఉదార ప్రజాస్వామ్యం అమలు అవుతున్న దేశాల జాబితాలో అగ్రభాగాన డెన్మార్క్‌, స్వీడెన్‌, నార్వే, కోస్టారికా, న్యూజిలాండ్‌, స్విస్‌, ఎస్టోనియా, బెల్జియం, ఐర్లాండ్‌, ఫిన్‌లాండ్‌ లాంటి 10 దేశాలు ఉన్నాయి. ఎన్నికల నిరంకుశత్వం వర్గంలో భారతదేశం ఉంది. ఉదార ప్రజాస్వామ్య సూచిక ఆధారంగా తయారు చేసిన 179 దేశాల జాబితాలో భారత్‌కు 97వ స్థానం దక్కినట్లు ఈ నివేదిక వెల్లడిరచింది. మనదేశంలో బహుళత్వ వ్యతిరేక రాజకీయ ప్రజాస్వామ్య సూచీలో పార్టీల వ్యవస్థ వల్ల నిరంకుశత్వ పాలనకు దారులు పడుతున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రజాస్వామిక సూచీలో 108వ స్థానాన్ని, సమీక్ష పూర్వక ప్రజాస్వామ్య సూచీలో 102వ స్థానాన్ని, సమతావాదభాగ సూచికలో 123వ స్థానాన్ని భారత్‌ పొందింది. దక్షిణ ఆసియా దేశాల యల్‌డిఐ జాబితాలో 88వ స్థానంలో శ్రీలంక, 71వ స్థానంలో నేపాల్‌, 65వ స్థానంలో భూటాన్‌ మెరుగైన స్థానాలను దక్కించుకోగా, భారత్‌ మాత్రమే వెనుకబడి 93వ స్థానాన్ని పొందడం విచారకరం. పాకిస్థాన్‌కు మాత్రం 110వ స్థానం దక్కడం జరిగింది.
ప్రపంచ దేశాల్లో నిరంకుశత్వ పాలన విధానాలు క్రమంగా పెరుగుతున్నాయని, 2022లో 42 దేశాలు నిరంకుశత్వ పాలనను చేరుకున్నట్లు తెలిపింది. ప్రపంచ జనాభాలో 72 శాతం ప్రజలు (5.7 బిలియన్‌) నిరంకుశత్వ పాలనలో మగ్గుతున్నట్లు, వీటిలో 28 శాతం (2.2 బిలియన్‌) పూర్తి నిరంకుశత్వ పాలనలో జీవిస్తున్నట్లు విశ్లేషించారు. ఎలక్టోరల్‌ ఆటోక్రసీ అనుభవిస్తున్న జనాభా 3.5 బిలియన్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాల్లో ప్రజాస్వామ్యం పలుచనవటం, నిరంకుశత్వ భావనలు చిక్కబడడం గమనించారు. ప్రపంచవ్యాప్తంగా 13 శాతం (దాదాపు ఒక బిలియన్‌) జనాభా మాత్రమే ఉదార ప్రజాస్వామ్యాలను అనుభవిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. పలు దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ 35 దేశాల్లో తగ్గుతున్నదని, 47 దేశాల్లో మీడియా నియంత్రణ పెరుగుతున్నదని, 37 దేశాల్లో పౌర సమాజపాత్ర తిరోగమన దిశలో పడిపోవడం, 30 దేశాల్లో ఎన్నికల విలువలు తుంగలో తొక్కుతున్నాయని తెలిపింది. 2020 నుండి కరోనా విపత్తు చర్యల్లో భాగంగా వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పాలనలను, పార్లమెంటరీ నిర్ణయాలను, పౌరుల హక్కులు/స్వేచ్ఛలను తోసేసి నిరంకుశత్వ పాలన వైపు మొగ్గు చూపారని తెలుస్తున్నది.
చమురు కొరత, యుద్ధాలు, విపత్తులు, లాక్‌డౌన్‌లు, కఠిన నియమ నిబంధనలు లాంటి ప్రతికూలతలను బూచీగా చూపుతూ వివిధ దేశాల్లో నిరంకుశ పాలన జరిగినట్లు తెలుస్తున్నది. కరోనా మహమ్మారి కాలంలో 42 దేశాలు నిరంకుశత్వ పాలనల్లో మగ్గాయి. వివిధ సంస్థలు తమ అధ్యయనాల ద్వారా భారత్‌ను ఎన్నికల నిరంకుశత్వం,పాక్షిక స్వేచ్ఛ, వెనుదిరుగుతున్న ప్రజాస్వామ్యం, ప్రధాన తిరస్కరణ దేశంగా విశ్లేషించడం జరిగిందని గుర్తు చేసుకోవాలి. ప్రజాస్వామ్య విలువలకు పట్టం కడుతూ, నిరంకుశత్వ ధోరణులకు చరమగీతం పాడడం జరిగితేనే 8 బిలియన్ల ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో సహజీవనం గడుపుతారని నమ్ముదాం, ఆ దిశగా గళాలు విప్పుదాం.
డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి, సెల్‌: 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img