Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చేనేతపై ప్రభుత్వాల చిన్నచూపు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన లోపాలతో చేనేతరంగానికి తీవ్రనష్టం వాటిల్లుతోంది. దేశ ఆర్థికవ్యవస్థలో, ఉపాధికల్పనలో చేనేత రంగం కీలకమైంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటా ఎక్కువ. అంతేకాకుండా దేశ వారసత్వ సంపదైన చేనేతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్‌ ఉంది. అయినా ఈ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగంపై దాదాపు 3 లక్షల మంది ప్రత్యక్షంగా, 8లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా అంటే.. నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్‌ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు…వంటివి తయారు చేయడం, నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్‌ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం. ఈ రంగంపై ఇంతమంది ఆధారపడి జీవిస్తున్నా, ప్రభుత్వాల ప్రోత్సాహం కరువైంది. దాంతో చేనేత రంగం అనేక ఒడిదుడుకులకు లోనవుతోంది. చేనేత కార్మికులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వీరు అసంఘటిత రంగంలో ఉండటం వల్ల పోరాట పటిమలేక నానా అవస్థలు పడుతున్నారు. ఏమీ సాధించుకోలేని స్థితిలో ఉన్నారు.
1985లో రూపొందించిన చేనేత రిజర్వేషన్‌ చట్టం సరిగా అమలు కావడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ కొరవడిరది. ఈ చట్టం ప్రకారం చేనేతను ప్రోత్సహించేందుకు 11 రకాల వస్త్రోత్పత్తు లను చేనేతకు కేటాయించారు. రిజర్వు చేసిన వస్త్రాలలో ముఖ్యమైనవి భారతీయ మహిళలు ధరించే చీరలు. చేనేత రిజర్వేషను చట్టం అమలు బాధ్యత రాష్ట్రాలకు అప్పగించి అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేయాలి. చేనేతకు రిజర్వుచేసిన వస్త్రాలను పవర్‌లూమ్స్‌పై తయారు చేయకూడదు. అయితే, చాలా రాష్ట్రాల్లో మరమగ్గాలపై యాజమాన్యాల ఆధిపత్యంవల్ల ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలేదు. చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని అమలు చేయవలసిన కేంద్రం దానిని పట్టించు కోవడం లేదు. పాఠశాలల పిల్లలకు చేనేతవస్త్రాలతో తయారుచేసిన యూనిఫాం ఇవ్వవలసిన పథకాన్ని అమలు చేయడంలేదు. ఆప్కో చైర్మన్లుగా చేనేతవర్గాలకు చెందినవారే వ్యవహరిస్తున్నారు. వారు చిత్తశుద్ధితో చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేయకపోవడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.
మన దేశంలో చేనేత వస్త్రాలకు, ముఖ్యంగా చీరలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మన దేశంలో తయారయ్యే చేనేత వస్త్రాలు నాణ్యమైనవిగా ప్రసిద్ధి. ముఖ్యంగా చేనేత చీరలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ప్రసిద్ది పొందాయి. చేనేత వస్త్రాలు ధరించడం ఆరోగ్యానికి మంచిది కావడంతో వాటికి డిమాండ్‌ పెరుగుతోంది. చేనేత కార్మికులకు మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలనే చేనేత కార్మికులూ ఎదుర్కొంటున్నారు. స్వాతంత్య్రోద్యమంలో చేనేత కీలక భూమిక పోషించింది. చేనేత రంగంపై మన దేశంలో లక్షలాది మంది జీవిస్తున్నారు. అటువంటి చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్‌టీ విధించడం అత్యంత దారుణం. చేనేతకు ఉపయోగించే నూలుకు వేసే రంగులు, రసాయనాలపై 18 శాతం జీఎస్టీ విధించడంతో చేనేత వస్త్రాల ధరలు పెరిగిపోయాయి. కానీ, చేనేత కార్మికుల మజూరీలు పెరగలేదు. చేనేతను కుంగ దీస్తున్న, చేనేత కార్మికులకు తీవ్రమైన పోటీ ఇస్తున్న మరమగ్గాల వస్త్రాలపై 6 శాతం మాత్రమే జీఎస్టీ విధించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు అనేక ఉద్యమాలు చేశారు. చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టి ప్రధానిమోదీకి లేఖలు రాశారు. చేనేత కార్మికులు అసంఘటితంగా ఉండటంతో ఉద్యమాన్ని రైతులు మాదిరిగా నిర్వహించలేకపోతున్నారు.
ఏపీ బడ్జెట్‌లో చేనేత రంగానికి ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. వైఎస్‌ఆర్‌ నేతన్న పథకానికి రూ.200 కోట్లు కేటాయించారు. అందులో రూ.3 కోట్లు వరకు ఉద్యోగుల జీతాలకు పోతాయి. రాష్ట్రంలో రెండు లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే 81,700 మందికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం వర్తించడానికి రూపొందించిన నిబంధనలు చాలా విచిత్రంగా ఉన్నాయి. సొంత ఇల్లు లేక అద్దెకు ఉండే ఇంట్లో మగ్గం ఉన్న కార్మికులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇల్లు లేక మగ్గం కూడా పట్టే అంత ఇంటికి అద్దె చెల్లించలేక మగ్గాల షెడ్లలో అత్యంత దయనీయంగా బతికేవారికి మాత్రం ఈ పథకం వర్తించడంలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు చేనేత రంగం గురించి తెలియకపోవడం, చేనేత కులాలకు చెందిన నేతలకు పరిస్థితులు వివరించే అవకాశం రాకపోవడం ప్రధాన సమస్యగా ఉంది.
రాష్ట్రంలో 950 వరకు చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో బోగస్‌ సంఘాలు అనేకం ఉన్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిజమైన చేనేత కార్మికులు కాకుండా ఈ బోగస్‌ సంఘాలు నాబార్డు రుణాలు, ప్రభుత్వ రాయితీల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణలో 615 చేనేత సహకార సంఘాలున్నాయి. నూలు, రంగులపై 40 శాతం రాయితీ ఇస్తున్నారు. ముఖ్యంగా కేరళలో చేనేత కార్మికులకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ సహకార సంఘాల వ్యవస్థ పటిష్టంగా ఉంది. చేనేత కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మహిళా చేనేత కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. మన ప్రభుత్వంలోని చేనేత నాయకులు అక్కడి సౌకర్యాలను అధ్యయనం చేసి, అమలు చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణలో చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఇంటిల్లపాది రాత్రి, పగలు శ్రమించే చేనేత కార్మిక కుటుంబాలకు తగిన కూలి గిట్టదు. ప్రభుత్వాలు వారికి కావలసిన మార్కెటింగ్‌ వ్యవస్థను రూపొందించలేక పోతున్నాయి.
చేనేత కార్మికులకు, వినియోగదారునికి మధ్య ఉండే దళారీ వ్యవస్థను తొలగించి ‘వీవర్‌ టు కస్టమర్‌’ విధానంద్వారా నేతన్నలకు, వినియోగదారులకు ఉపయోపడే వ్యవస్థను రూపొందించాలని చేనేత కార్మిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. చేనేత వస్త్రాలను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ఉంచాలని వారు కోరుతున్నారు. జీఎస్టీ నెంబర్‌ లేనిదే ఆన్‌లైన్‌లో అమ్మడం వీలుకాదు. ప్రభుత్వం ప్రత్యేక మార్కెటింగ్‌ వ్యవస్థను రూపొందించవలసి ఉంది. చేనేత వస్త్రాల ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థాలు పత్తి ఉత్పత్తి నుంచి ఇతర అన్ని వనరులు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి. నైపుణ్యత కలిగిన శ్రామికులు ఉన్నారు. నిర్వహణ, సాంకేతికత రెండిరటిలోనూ శిక్షణ పొందిన మానవ వనరులున్నాయి. ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందిస్తే చేనేత కార్మికుల బతుకులు ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుంది. చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో నిధులు కేటాయించవలసిన అవసరాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి.
శిరందాసు నాగార్జున
సీనియర్‌ జర్నలిస్టు, 9440222914

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img