Friday, April 26, 2024
Friday, April 26, 2024

బహుజనోద్యమానికి జీవితాన్ని ధారపోసిన ఆంవెట్‌

ఆర్వీ రామారావ్‌

గెయిల్‌ ఆంవెట్‌. ఈ పేరు బహుజనోద్యమంతో సంబంధం ఉన్న వారందరికీ పరిచయం ఉన్నదే. 1960లలో మొదటిసారి భారత్‌ సందర్శించిన ఆంవెట్‌ ఇక్కడి కుల వివక్షను, అంటరాని తనాన్ని, బహుజనుల అణగారిన జీవితాన్ని చూసి చలించి పోయారు. 1970లలో రెండోసారి భారత్‌ వచ్చినప్పటి నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కాసేగావ్‌లో స్థిరపడి పోయారు. బహుజనో ద్ధరణ కోసం కృషి చేసిన స్వాతంత్య్ర పోరాట యోధురాలు ఇందూతాయి కృషి ఆంవెట్‌ను అమితంగా ఆకర్షించింది. ఇందూ తాయి కుమారుడు భరత్‌ పటంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. భరత్‌ పటంకర్‌ కూడా బహుజన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారే. ఆయన మార్క్సిస్టు. బహుజన, ఆదివాసీ సమాజాల అభ్యున్నతి కోసం కృషి చేసినవారు. ఉద్యమాలే ఆంవెట్‌ను భరత్‌ పటంకర్‌కు సన్నిహితురాలిని చేశాయి.
మహాత్మా ఫూలే నడిపిన ఉద్యమంపై, ఆయన నెలకొల్పిన సత్యశోధక్‌ సమాజంపై అధ్యయనం చేయడానికి ఆమె మన దేశానికి వచ్చారు. బహుజనఉద్యమాలను అధ్యయనంచేసిన అమెరికా మహిళల్లో ఆమె రెండవవారు. మహాత్మాఫూలే ఉద్యమాన్ని అధ్యయనం చేయడంతో పాటు ఆంవెట్‌ మానవహక్కులకోసం కూడా పోరాడారు. సామాజిక కార్యకర్తగా ఆమె కృషి ఎంత ఉందో దళితులు, ఇతర వెనుకబడిన కులాలు, ఆదివాసీల విషయాల్లో అధ్యయనం కూడా అంతే లోతైంది. ‘‘దళిత్స్‌ అండ్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్‌’’ అన్న ఆమె గ్రంథం ఈ విషయాల మీద ఆసక్తి ఉన్న విశ్వవిద్యాలయ పరిశోధకులకు, విద్యార్థులకు పఠనీయ గ్రంథం అయింది.
80 సంవత్సరాలు నిండిన ఆంవెట్‌ గత బుధవారం (ఆగస్టు 25న) మరణించారు. 1941 ఆగస్ట్‌ 2న ఆమె జన్మించారు. బహుజనుల ఉద్యమాన్ని అధ్యయనం చేయడానికి ఆమె ప్రధానంగా అంబేద్కర్‌, మార్క్స్‌ సిద్ధాంతాలను ఆలంబనగా చేసుకున్నారు. 1873-1930 మధ్య వలసవాద సమాజంలో సాంస్కృతిక విప్లవం అన్న ఆంశం మీద మౌలికమైన పరిశోధన చేసి పిహెచ్‌.డి. పట్టా తీసుకున్నారు. బహుజనుల మీద ఆపేక్షతో అధ్యయనం చేసిన వారు చాలా మందే ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది తాము గమనించిన అంశాలను విశ్లేషించారు. వివరించారు. కానీ బహుజనులతో మమేకం అయిన వారు తక్కువ. ఆంవెట్‌ అలా కాకుండా వారితో పూర్తిగా మమేకమైపోయారు. కుల వ్యతిరేక పోరాటాలు, రైతు ఉద్యమాల్లో ఆమె గత అయిదు దశాబ్దాలుగా క్రియాశీలంగా పాల్గొంటూనే ఉన్నారు. భర్త పంటంకర్‌తో కలిసి శ్రామిక ముక్తి దళ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. మార్క్స్‌, ఫూలే, అంబేద్కర్‌ విధానాలను సమన్వయం చేసి బహుజనుల జీవితాలను పరిశీలించి పరిశోధించడం ఆంవెట్‌ విశిష్ట లక్షణం. బౌద్ధం మీద కూడా ఆమెకు ఆసక్తి ఎక్కువే. దేశమంతటా ఎక్కడ కులం పేర అణచివేత, అక్రమాలు జరిగినా, బహుజనుల మీద దాడులు జరిగినా వాటిని అడ్డుకోవడంలో, నిరసించడంలో ఆమె చురుకుగా భాగస్వామి అయ్యేవారు. ఆమె రాసిన దాదాపు పాతిక గ్రంథాలు దళిత రాజకీయాలు, మహిళల పోరాటాలకు, కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాలకు సంబంధించినవే. 1983లో ఆమెకు భారత పౌరసత్వం వచ్చింది. ఆమె రాసింది ఇంగ్లీషులో అయినా కొన్ని గ్రంథాలు హిందీ, తెలుగు లాంటి భాషల్లోకి అనువాదమైనాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img