Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మసకబారుతున్న డాక్టరేట్లు

సమాజానికి ఒక వ్యక్తి చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆ వ్యక్తికి విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటాయి. దీనివలన ఆ వ్యక్తిని బట్టి విశ్వ విద్యాలయాలకు గౌరవం పెరుగుతుంది. ఆ వ్యక్తి గౌరవమూ మరింత ఇనుమడిస్తుంది. గతంలో రాజగోపాలా చారి (రాజాజీ)కి ఒక యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ యిచ్చింది. తరవాత రాజాజీ బయటికొచ్చినపుడు డాక్టరు, డాక్టరు అనటం మొదలుపెట్టారు. ఇలా పిలిపించు కోవటం ఇష్టం లేని ఆయన అలా పిలవద్దు, వాళ్ళేదో నా మీద గౌరవం కొద్దీ గౌరవ డాక్టరేట్‌ ఇచ్చారు, నేను డాక్టరు కాదు అని చెప్పేవారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ ఓల్గాకి గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. నలభై సంవత్సరాలుగా అమె రచయితగాను, ఒక స్త్రీవాదిగాను ఎన్నో సేవలు చేసింది. అందుకు ఆమెను ఆ గౌరవం వరించింది. డాక్టరేట్లు అంటే అలాంటి వారికి ఇవ్వడం సముచితం. కొంతమందికి ఇస్తున్న డాక్టరేట్లు వాటి గౌరవాన్నే మసకబారు స్తున్నాయి. 50 ఏళ్ళ క్రితం మద్రాసు రాష్ట్రంలో ఈ విధమైన గౌరవ డాక్టరేట్లను చాలామందికి ఇచ్చిన కారణంగా, వాళ్ళు సన్మానాలు చేయించుకోవటం, పందిళ్లువేయించుకుని ఉపసన్యాసాలు ఇవ్వడం చేస్తుండేవారు. ఈ తంతు కొంచెం ఎబ్బెట్టుగా ఉండేది. ఇది నచ్చని తుగ్లక్‌ పత్రిక ఎడిటర్‌ చో రామస్వామి మద్రాసులోని మెరీనా బీచ్‌లో ఒక సాయంకాలం పూట వందమంది రిక్షావాళ్ళని, హమాలీలను పిలిచి వారికి తుగ్లక్‌ పత్రిక తరపున గౌరవ డాక్టరేట్లను ఇచ్చారు. ఆ రోజుల్లో ఇది పెద్ద సంచలనం కలిగించింది. అంటే డాక్టరేట్లు అనేవి ఎంత చులకనగా మారిపోయాయే ఆయన అలా చెప్పారు. మరి ఈ రోజు కూడా అదే తంతు జరుగుతోంది. డీమ్డ్‌ యూనివర్సి టీలు వచ్చిన తరవాత గౌరవ డాక్టరేట్లు అంగడి సరుకుగా మారిపోయాయి. జనాలని మోసం చేసి బతికేవారికి కూడా ఈ డీమ్డ్‌ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నాయి. చిన్నపుడు సినిమా హాల్స్‌లో బ్లాక్‌ టికెట్లు అమ్ముకున్న శేషసాయి శర్మ బాలసాయిబాబా అయ్యాడని చెబుతారు. అయనపై చెక్‌ బౌన్స్‌ కేసు ఉండడమే కాదు కర్నూలు తుంగభద్ర ఒడ్డున ప్రభుత్వ భూమి ఆక్రమించిన కారణంగా చాలాసార్లు అరెస్టు అయ్యాడు. ఆయనకు డాక్టరేట్‌ ఇచ్చారు. పెనుగొండలో గుప్త నిధుల కోసం కృష్ణదేవరాయ కోటను సైతం తవ్వి పారేసిన కాళీప్రసాద్‌ బాబాకీ డాక్టరేట్‌ ఇచ్చారు. అరునెలల నుండి చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటున్న విజయవాడ దొంగబాబా కాణాల అచ్చిరెడ్డికి కూడా గుంటూరు లోని డీమ్డ్‌ యూనివర్సిటీ ‘క్రిస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరెేట్‌ ఇచ్చింది. నిత్యం టీవీలలో కనిపిస్తూ జనాలను మోసంచేస్తున్న హైద్రాబాద్‌ జ్యోతిష్కుడు లక్ష్మికాంతశర్మ కూడా ఇదే డీమ్డ్‌ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరెేట్‌ పొందాడు. మొన్న గుంటూరు విజ్ఞాన యూనివర్సిటీ రామకృష్ణ అనే వ్యక్తికి గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. ఈయన సమాజానికి ఏమి సేవలు చేసాడని ఇచ్చిందో యూనివర్సిటీ చెప్పాలి. నిజంగా నేడు డీమ్డ్‌ యూనివర్సిటీలు పనికిమాలిన వారికి, మోసగాళ్లకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి డాక్టరేట్లకున్న గౌరవాన్ని పోగొడుతున్నాయి. అందుకే గౌరవడాక్టరేట్లు మసక బారిపోతున్నాయి.
-నార్నె వెంకటసుబ్బయ్య

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img