Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

మహా విషాదం మళ్ళీ జరగరాదు

ఒడిశాలో మూడు రైళ్లు గుద్దుకున్న పెను ప్రమాదంలో 275 మంది మృతి చెందడం, 900 మంది గాయాల పాలవ్వడం అత్యంత విషాదకరం. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న పెద్ద వ్యవస్థలో ఇలాంటి ఘోరం చోటు చేసు కోవడం అనూహ్యం. ఈ దశాబ్ద కాలంలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇదే తీవ్రమైనది. జరిగిన తీరు కూడా విస్మయకరం. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రీన్‌సిగ్నల్‌తో లూప్‌లైన్‌ లోకి వెళ్లగా అదే లైన్‌పై ముందునుండీ నిలిచిఉన్న గూడ్స్‌ని ఢీకొట్టి పక్కన మెయిన్‌ లైన్‌లోకి బోగీలు పడడం, వాటిని అదే సమయంలో అటుగా వెళ్తున్న షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టి వాటి బోగీలు కూడా పట్టాలు తప్పడం వెనువెంటనే జరిగిన దుర్ఘటన. సిగ్నల్‌ వైఫల్యం, ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో ఏర్పడిన లోపంవల్ల కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దారితప్పడం వల్ల జరిగిన ఈ దుర్ఘటనవెనుక మానవ తప్పిదమా, కుట్ర ఫలితమా అన్నది తేల్చడానికి ప్రభుత్వం ఎంక్వయిరీ వేసింది. కారణమేదైనా ఒక భద్రతా వైఫల్యం ఖరీదు 275 మంది ప్రాణాలు.. వారివెనుక ఉన్న కుటుంబాలు కావడం బాధాకరం.
ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థ పక్కాగా పనిచేయాలి. ఒక పొరపాటు ఏ స్థాయి ఉపద్రవాన్ని సృష్టించగలదో ఊహించలేం. ఒకవైపు ఎంతటి సాంకేతికత ఉన్నప్పటికీ, అది వైఫల్యం చెందినపుడు రంగంలోకి దిగే పర్యవేక్షక వ్యవస్థ-ఫెయిల్‌ సేఫ్‌ మెకానిజం- ఉండాలి. ఆ వ్యవస్థ రైల్వేలో ఉంది. లేకపోతే ఇంతటి పెద్ద వ్యవస్థ నడవలేదు. అయితే అక్కడ అది ఎందుకు ఫెయిల్‌ అయ్యిందో త్వరితంగా తేల్చాలి. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు జరిగిన దర్యాప్తులు ఏళ్లకుఏళ్లు సాగాయన్నది వాస్తవం. అలా కాకుండా కారణాల్ని త్వరగా తేల్చి, ఎక్కడ తప్పు జరిగిందో అలాంటిది మళ్ళీ జరగకుండా చర్యలు చేపట్టాలి. కుట్రకోణం వుంటే బాధ్యులకు వెంటనే శిక్ష పడాలి. విమాన ప్రయాణం 100 శాతం సురక్షితంగా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు, చెక్‌ లిస్టులు ఉంటాయో రైలు ప్రయాణానికి కూడా ఆ స్థాయి, శ్రద్ద అవసరం. రవాణా వ్యవస్థలో కీలకమైన రైల్వే అత్యంత సురక్షితంగా ఉన్నప్పుడే దేశానికి మేలు. కేంద్ర, నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆపద సమయంలో సరిగ్గా స్పందించాయి. అక్కడి స్థానికులు కూడా సహాయ కార్యక్రమాలకు పోటీపడి ముందుకు రావడం ప్రశంసనీయం. ఇప్పుడు రైల్వే, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుని త్వరితంగా, సమర్ధవంతంగా పూర్తిచేసి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘోర విపత్తులకు ఆస్కారం తగ్గుతుంది.
డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, సెల్‌: 94408 36931.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img