Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

‘‘విప్లవ’’ సావర్కరీయం

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

‘‘గతకాల చైతన్యంలేని దేశానికి భవిష్యత్తు లేదు. చరిత్ర గొప్పలు చాటడం కాదు. దాన్ని భవిష్యత్తు పురోగతికి వాడే జ్ఞానం ఉండాలి. దేశం చరిత్రకు యజమాని కావాలి. బానిస కారాదు.’’ 1925లో వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. (ఎప్పుడూ ఉనికిలో లేని) అఖండ హిందుదేశాన్ని సాధించవచ్చని ఆయన దురవగాహన. తన ఆత్మకథలో సావర్కర్‌ వీర్‌ బిరుదును తగిలించుకున్నారు. స్వాతంత్య్ర సమరానికి సావర్కర్‌ వెన్నుపోటు చేదు నిజాన్ని కప్పిపుచ్చడానికి ఆయన భక్తులు ఆయనకు స్వాతంత్య్ర బిరుదును జోడిరచారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు, దాని అనుబంధ సంఫ్‌ు పరివార్‌ సంస్థలు హిందు బోధనలతో కాక జర్మనీ నాజీ హిట్లర్‌, ఇటలీ ఫాసిస్టు ముసోలినిలతో ప్రేరణపొందాయి. అన్న గణేశ్‌తో కలిసి వినాయక్‌ సావర్కర్‌ 1899 లో ‘మిత్ర మేళా’ను స్థాపించారు. ఇటాలియన్‌ రాజకీయుడు, పాత్రికేయుడు, ఇటలి జాతివాద, సాంస్కృతికవాదాల తీవ్రవాద కార్యకర్త గిసెప్‌ మజిని భావాలతో స్పూర్తిపొందారు. మజిని మతవాది కాదు. కాని సావర్కర్‌ మతవాదిగా మారారు. జాతీయవాద పథకాల అమలుకు నాగరికత, చారిత్రక మూలాల ఆధారంగా వర్తమాన పునర్నిర్మాణం అత్యవసరమని మజిని అభిప్రాయం. సావర్కరీయులు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మజిని యువ ఇటలి ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని 1904 లో మిత్ర మేళా పేరును అభినవ్‌ భారత్‌గా మార్చారు. ఈ అలౌకిక సంస్థ 1952 లో మూతబడిరది. అదే పేరుతో 2006 లో వైదికవాద హంతక సంస్థగా స్థాపించారు. స్విట్జర్లాండ్‌ న్యాయనిపుణుడు, రాజకీయుడు జొహాన్‌ కాస్పర్‌ బ్లంట్స్లి భావాలను సావర్కర్‌ స్వీకరించారు. మతచట్రంలో రాజకీయాలను బంధించడం, మతాధిపతి విశేషాధికారాలకు ప్రాధాన్యతనివ్వడం బ్లంట్స్లి భావజాలం. ప్రాదేశిక జాతీయతను విమర్శించి సాంస్కృతిక జాతీయవాదాన్ని ప్రచారంచేసిన బాల గంగాధర తిలక్‌ సావర్కర్‌కు సాంస్కృతిక గురువు.
సావర్కర్‌ 1906లో లండన్‌లో న్యాయశాస్త్రం చదవడానికి వెళ్లారు. మజిని రచనలతో మజిని చరిత్రను కూర్చారు. భారతీయ విద్యార్థుల్లో జాతివాద భావాల ప్రచారానికి ప్రారంభించిన విద్యార్థి విడిది ఇండియా హౌస్‌లో చేరారు. సంపూర్ణ స్వాతంత్య్రం కోరే భారత విద్యార్థులతో తిరిగారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్శీ వనిత భికాజీ రుస్తుం కామాతో పనిచేశారు. లండన్‌లో నాస్తికునిగా, మాంసాహారిగా మారారు. గోపవిత్రతను, గోమాంస భక్షణ వ్యతిరేకతను ఖండిరచారు. ఈ ‘‘ప్రగతిశీలత’’ సావర్కర్‌ను లౌకికవాదిగా, సామాజిక న్యాయవాదిగా నిలపలేక పోయింది. 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో నాయకులు, యుద్ధయోధులు ఎక్కువ మంది ముస్లింలు. ఈ విషయం సావర్కర్‌ ప్రస్తావించారు కూడా. అరాచకవాది, మద్యం, మత్తుపదార్థాలు, వ్యభిచారం వంటి దురలవాట్లకు లోనయిన ఈస్ట్‌ ఇండియా కంపెని సైనికుడు, అక్రమశిక్షణతో తన అధికారులను చంపిన మంగళ పాండేను ప్రథమ స్వాతంత్య్ర సమర వీరునిగా చిత్రీకరించారు. ఇద్దరిదీ చిత్తపవన బ్రాహ్మణత్వం కావడమే దీనికి కారణం. సావర్కర్‌ లండన్‌ నుండి 20 పిస్టళ్లను నాసిక్‌కు పంపారు. నాసిక్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్థర్‌ మాసన్‌ టిపెట్స్‌ జాక్సన్‌ భారతీయ భాషా సంస్కృతులలో ప్రసిద్ధ శాస్త్రవేత్త, చరిత్రకారుడు. భారతీయ జానపద సాహిత్యంపై ప్రమాణ పత్రాలు సమర్పించారు. గ్రంధాలు రాశారు. సంస్కృత పండిత జాక్సన్‌గా ప్రసిద్ధిచెందారు. భారతీయుల ఆకాంక్షలపై సానుభూతి ప్రదర్శించేవారు. తన విధుల్లో భాగంగా గణేశ్‌సావర్కర్‌పై విచారణకు ఆదేశించారు. ఆయన అధ్యయనం, చర్యలు సావర్కర్‌ మిత్రులకు నచ్చలేదు. సావర్కర్‌ ఆలోచనలతో బ్రిటిష్‌ సైన్యాధికారి కర్జన్‌ విలీని చంపిన మదన్‌ లాల్‌ ధింగ్రాను బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరితీసింది. మిత్రుని మరణంతో సావర్కర్‌ బ్రిటిష్‌ వ్యతిరేకిగా మారారు. 18 ఏళ్ల ఔరంగాబాద్‌ విద్యార్థి అనంత లక్ష్మణ్‌ కన్హేరే సావర్కర్‌ పంపిన పిస్టల్‌ తో 21.12.1909 న కలెక్టర్‌ జాక్సన్‌ను చంపారు. ఆయుధాన్ని అందించిన నేరానికి సావర్కర్‌ను లండన్‌లో అరెస్టు చేశారు.
ఇండియాకు తీసుకువస్తున్న ఓడ నుంచి తప్పించుకొని సావర్కర్‌ ఫ్రాన్స్‌లో దాక్కున్నాడు. ఫ్రాన్స్‌ రేవు అధికారులు ఆయనను ఆంగ్ల పాలకులకు అప్పజెప్పారు. వారు సావర్కర్‌కు జీవితఖైదు విధించారు. భారతీయ నేరస్తులకు కేటాయించిన అండమాన్‌ జైల్‌లో పెట్టారు. అండమాన్‌ జైలులో రాజకీయ ఖైదీలు ఎక్కువగా హిందువులే. వారితో హిందువులు అనుకూలంగా ప్రవర్తిస్తారని ఖైదీల పర్యవేక్షకులుగా ముస్లింలను నియమించారు. వీరు హిందు ఖైదీలను హింసించేవారని, ముస్లింలుగా మార్చేవారని సావర్కర్‌ సమర్థకుల వాదన. ముస్లిం వ్యతిరేకి అయిన సావర్కర్‌ ముస్లింలపై అసహ్యం పెంచుకున్నారు. ముస్లిం వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు. ముస్లింలను హిందువులుగా మార్చారు. జైలు కష్టాలను భరించలేక సావర్కర్‌ ఖైదు కాలపరిమితిని తగ్గించమని బ్రిటిష్‌ వారిని వేడుకున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. బ్రిటిష్‌ పాలకులకు ఆరు క్షమాభిక్ష ఉత్తరాలు రాశారు. దారితప్పిన తనయున్ని తండ్రి వాకిట చేర్చమని ప్రార్థించారు. తనను వదిలితే తాను, తన అనుయాయులు ఆంగ్లేయుల సేవలో తరిస్తామని, ఆంగ్ల పాలన కొనసాగింపునకు పాటుపడతామని వాగ్దానించారు. తిరుగుబాటుదారులంతా బ్రిటిష్‌ భక్తులుగా మారతారన్నారు.
అర్ధాంతరంగా, అకారణంగా మార్గం మార్చుకున్నవారు తమ ప్రాథమిక సూత్రాలకు, లక్ష్యాలకు పరమ శత్రువులుగా మారతారు. సావర్కర్‌ భగత్‌ సింగ్‌, శివరాం రాజగురు, సుఖదేవ్‌ థాపర్‌ వంటి నిబద్ధ స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవవాది కాదు. అందుకే కారాగార కష్టాలను భరించలేక తన ప్రకటిత సిద్దాంతాలను, లక్ష్యాలను, మార్గాన్ని మార్చుకున్నారు. బ్రిటిష్‌ వారికి భీతిల్లి భీరత్వం ప్రదర్శించినా బ్రిటిష్‌ రాజ్యం పోయి, కష్టాలు కడతేరిన తర్వాతనైనా తన ప్రచార బాహ్య ప్రగతిశీలతను, సామాజిక మార్పు ఆకాంక్షను పునరుద్ధరించుకొనవలసింది. కాని తన తొలినాళ్ళ భ్రమింపు భావాలను తిరోగమనం చెందించారు. మానవత్వాన్ని మరిచారు. సంకుచిత మతోన్మాద తాత్వికతను వంటబట్టించుకున్నారు. దీనికి మించిన గుణహీనత్వం మరొకటి లేదు.
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి
చరవాణి: 9490 20 4545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img