Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

నాటోలో భారత్‌ చేరుతుందా?

గిరీష్‌ లింగన్న

ప్రపంచ భౌగోళిక, రాజకీయాల్లో మలుపు ఏ దిశగా సాగుతుందో వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది. నాటో ప్లస్‌ భద్రతా ఏర్పాటులో చేరడానికి భారతదేశాన్ని ఆహ్వానించాలనేది అమెరికా వ్యూహం. కాగా మరోపక్క ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సీసీపీ) ప్రభావం మరింతగా పెరగడంతో దీన్ని ఎదుర్కొనేందుకు అమెరికా కూటములు, భాగస్వామ్య దేశాలతో బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందనేది స్పష్టం. అమెరికా భారతదేశానికి నాటో సభ్యత్వాన్ని ప్రతిపాదిస్తున్న క్రమంలో భౌగోళిక, రాజకీయాల్లో వినూత్న మార్పు చోటుచేసుకోనుంది. నాటోలో భారతదేశాన్ని చేర్చుకున్నట్లయితే భౌగోళిక, రాజకీయ స్వరూపం కుట్రల వైపు మళ్లుతుంది. ఈ ప్రతిపాదనతో చారిత్రాత్మకంగా ఉన్న సంప్రదాయాలు పూర్తిగా మారుతాయి. భౌగోళికంగా గణనీయమైన మార్పు చోటుచేసుకుంటుంది. అవకాశాలు, సవాళ్ల్లు, దౌత్య సంబంధాలు కుయుక్తులతో మార్చడం జరుగుతుంది.
నాటో ప్లస్‌ ప్రస్తుతం నాటో ప్లస్‌ 5గా గుర్తించడమైంది. ఇది నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో)లో ఐదు సభ్య దేశాలు మరో ఐదు మిత్రదేశాలున్నాయి. అవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌, ఇజ్రాయిల్‌, దక్షిణ కొరియాలు. ఈ దేశాల మధ్య రక్షణ సహకారం మరింత పటిష్ట మవుతుంది. ఈ కూటమిలో భారతదేశాన్ని చేర్చడం ద్వారా సభ్య దేశాల మధ్య అత్యంత అత్యాధునిక సైనిక సాంకేతికతను మార్పిడి చేసుకునే అవకాశం నెలకొంటుంది. నాటో ప్లస్‌లో భారతదేశాన్ని చేర్చాలనే ప్రతి పాదన అమెరికా, చైనా కమ్యూనిస్ట్‌ పార్టీల మధ్య నెలకొన్న వ్యూహాత్మక పోటీ నేపధ్యంలో హౌస్‌ సెలెక్ట్‌కమిటీ నుండి వచ్చింది. జనవరి 2023లో ఏర్పాటైన ఈ కమిటీకి చట్టాలను రూపొందించడం లేదా సవరించే అధికారం లేకపోయినా, ఈ ఏడాది చివరి నాటికి శాసన కమిటీలకు తగిన సిఫార్సులు, ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంటుంది. రిపబ్లికన్‌, డెమొక్రాటిక్‌ ప్రతినిధులతో కూడిన ఈ ద్వైపాక్షిక కమిటీ, ప్రపంచ భద్రతను పెంపొందించడంతో ఇండో-పసిఫిక్‌ ప్రాంతం అంతటా సీసీపీ వ్యాప్తిని నిరోధించడం లక్ష్యంగా తెరపైకి తెచ్చింది.
చైనా సీసీపీని వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి భారతదేశం సహా మిత్రదేశాలు, భద్రతా భాగస్వాముల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలనేది ఈ కమిటీ యోచన. తైవాన్‌పై దాడి జరిగిన సందర్భంలో చైనాపై ఆర్థిక ఆంక్షలు విధించాలని ఈ కూటమి పిలుపునిచ్చింది, జి7, నాటో, నాటో ప్లస్‌ 5, క్వాడ్‌ సభ్యులు వంటి కీలక మిత్రదేశాలు ఐక్య కూటమిగా చేరితే ఇటువంటి చర్యలు మరింత ప్రభావపూరితంగా ఉంటాయనేది ఈ కమిటీ వాదన. ఫలితంగా, సీసీపీ కి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ కోసం ఈ కమిటీ లాబీయింగ్‌ చేస్తోంది. దశాబ్దాలుగా నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో) ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరోపియన్‌ దేశాల మధ్య దేశాల మధ్య రక్షణకు పనిచేస్తోంది.ఏది ఏమైనప్పటికీ, దేశాల మధ్య ఏర్పడిన కూటములు, భౌగోళిక రాజకీయ వాతావరణం, భారతదేశానికి నాటో సభ్యత్వాన్ని అందించడం లక్ష్యంగా ఉంది. దీనిపై తీసుకునే తాజా నిర్ణయం ప్రపంచ వేదికపై భారతదేశ ప్రాముఖ్యతను, నాటో గుర్తింపును ప్రతిబింబించే వ్యూహాత్మక నిర్ణయంగా పేర్కొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అతివాద నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఫ్రంట్‌ను విస్తరించాలనే అమెరికా లక్ష్యంగా ఇది నొక్కి చెబుతున్నప్పటికీ ఈ నిర్ణయం వివిధ సవాళ్లను ఎదుర్కోనుంది. దక్షిణాసియాలో చిరకాల మిత్రదేశమైన పాకిస్థాన్‌తో చైనాకు ఉన్న సంబంధాలరీత్యా ఏర్పడే పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అమెరికా తగిన జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరంఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం సాంప్రదాయకంగా అలీనవిధానాన్ని అనుసరిస్తోంది. నాటో సభ్యత్వం దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు సభ్యదేశాల మధ్య రక్షణ సామర్థ్యాలను, ప్రపంచస్థాయిని మెరుగుపరుస్తుంది. తద్వారా ఇది ప్రపంచ నిబంధనలు, విధానాలను ప్రభావితం చేయడానికి ఒక వేదికను రూపొందించనుంది.
అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఉన్న క్వాడ్‌లో కీలక సభ్యదేశమైన భారతదేశం, దక్షిణాసియాదేశాలపై అమెరికా సామ్రాజ్య వాద ప్రభావం పెరుగుతూనే ఉంది, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో కూడిన బహుళ ధ్రువ ప్రపంచంలో, నాటో ప్లస్‌ ప్లాట్‌ఫారమ్‌కు భారతదేశాన్ని ఆహ్వానించాలనే ఆలోచన అమెరికా లక్ష్యంగా ఉంది. అయితే, ఈ ఆహ్వానంపై భారత ప్రధాని ఎలా స్పందిస్తారనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం సరైన సమాచారం లేకపోవడంతో ప్రధానమంత్రి స్పందన ఊహించడం కష్టం. అంతర్జాతీయ సంబంధాలపై ఆచరణాత్మక విధానానికి భారత ప్రధాని స్పందన అత్యంత విలువైనది. భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతి పత్తికి ప్రయోజనాలు, నష్టాలను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా ప్రభుత్వ వైఖరి నిర్ణయం ఉంటుంది.
ఈ ఆహ్వానాన్ని పూర్తిగా తిరస్కరించడం ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో జరగకపోవచ్చు, ఎందుకంటే ఇది అమెరికా, ఇతర నాటో దేశాలతో సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, రష్యా, చైనా దాని అలీన భాగస్వాములతో కూడా భారతదేశ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. భారతదేశానికి నాటో సభ్యత్వప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే, ఇది కొత్తపొత్తుల శకానికి నాంది పలుకు తుంది. నాటోప్లస్‌లో భారతదేశం చేరిక ప్రపంచ భద్రతలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నాటో ప్రభావాన్ని ప్రతిఘటించడానికి మిత్రపక్షాలు, భాగస్వామ్య దేశాల మధ్య బలమైన నెట్‌వర్క్‌ను స్థాపించాలనే నాటో వ్యూహాత్మక దృష్టిని ఇది ప్రతిబింబిస్తుంది. అయితే, ఈ చర్య ఇతర దేశాల ప్రతిస్పందన, అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img