Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

సరైన ఆధారాలతో సమాధానం చెప్పేదే సైన్స్‌ : డా. వేంకట రమణ

నేను పుట్టిందీ పెరిగిందీ తిరుపతిలో. మా నాన్నగారు వి.ఎస్‌.వేంకట నారాయణ. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. అనేక కారణాల వల్ల నేను ఎంఎస్సీ చేసి సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడాల్సి వచ్చింది. మా రోజుల్లో మేం చదివిన మునిసిపల్‌ స్కూళ్లలో సైతం జీవ, భౌతిక, రసాయనశాస్త్ర పరిశోధనాల యాలంటూ ఉండేవి. పాఠం చెప్పేటపుడు పలురకాల నమూనాలను ప్రదర్శించేవారు. పాఠశాల గ్రంథాలయంలో తెలుగు భాషకు సంబంధించి, నీతిని బోధించే కథలతో, విజ్ఞానదాయకమైన కథలతో, ప్రముఖ శాస్త్రవేత్తల చిత్రణతో – ఇలా పలు రకాల పుస్తకాలు ఉండేవి. ప్రతివారం అందరికీ గ్రంథాలయంలో ఒక పీరియడ్‌ గడిపే అవకాశం ఉండేది. 1976 ప్రాంతాల్లో ఉక్కుపిడి మాయావి, సర్ప ద్వీపం వంటి పుస్తకాలు వచ్చాయి. అందులో హీరో క్లిష్టమైన పరిస్థితుల్లో మాయమైపోతాడు. అతని ఉక్కు చెయ్యి మాత్రం కని పిస్తుంది. సరదాగా ఉండేది. అది ఫిక్షనని తెలుసు. కానీ, అది అసాధ్యం కాదేమోనని కూడా నాకు ఇప్పటికీ అనిపిస్తుంది.
1978లో బిఎస్సీలో చేరడం, అందులో భౌతిక, రసాయన శాస్త్రాలను చదవడం, తరచూ ప్రాక్టికల్స్‌ చేయడంతో కొంత సైన్స్‌ పట్ల అవగాహన వచ్చింది. అప్పట్లో శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో విజ్ఞాన శాస్త్ర విభా గాలు ఎంతో చురుగ్గా పనిచేసేవి. ఆయా విభాగాల వారు ఏడాదికొకసారో, రెండేళ్లకొకసారో సైన్సు ప్రదర్శనలు జరిపేవారు. ఎమ్మెస్సీ విద్యార్థులు, పరి శోధక విద్యార్థులు పోటీపడి రకరకాల నమూనాలను రూపొందించి ప్రద ర్శించేవారు. నీటితో కాగితంపై రాసిన అక్షరాలను దీపకాంతిలో చూపడం, విబూది రాల్బడం, నిప్పు లేకుండా పొగను తెప్పించడం – ఇలాంటి గమ్మత్తులెన్నో స్వయంగా లాబొరేటరీలలో చేయడం చూశాను.
కర్నూలు పీజీ సెంటరులో ఎంఎస్సీ చేసి, తిరుపతిలో ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంఫిల్‌ చేశాను. ఎంటెక్‌ విద్యార్థులకు సంవత్సరం పాటు బోధిం చాను. ఎంఫిల్‌ పూర్తి చేశాను. ఇంతలో దిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థయిన నేషనల్‌ ఇన్ఫార్మటిక్స్‌ సెంటర్‌లో కంప్యూటర్‌ రంగంలో ఉద్యోగావకాశం వచ్చింది, చేరిపోయాను. ఆ తర్వాత 1998 నాటికి పిహెచ్‌ డి పూర్తి చేశాను. దిల్లీలో ఉన్నప్పుడు నేను ఖాళీ దొరికినప్పుడల్లా పలు సైన్సు సంబంధమైన కార్యక్రమాలకు హాజరయ్యాను. పలు పరిశోధనాలయాలు చూశాను. మ్యూజి యంలు చూశాను. ఐఐటికి వెళ్లే వాడిని కూడా. ఐఐటిలో చదివేవారు ఎందు కు ఇండియాలో ఉండటం లేదనే ఆలోచన నా బుర్రలో అలాగే తొలుస్తూ ఉండేది. మా అన్నతోటి మిత్రులతో కలిగిన పరిచయం కూడా నాకు బాగా వినియోగించింది. వారు చేస్తున్న పరిశోధనలను స్వయంగా చూశాక, అవకాశం ఇస్తే పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మన మేధస్సుకెంతో అవకాశం ఉంది. భారతదేశంలో విజ్ఞానశాస్త్ర రంగంలో జరుగుతున్న విశేషాలను అంద రికీ తెలియజేయాలనిపించేది. మెయిన్‌ ఫ్రేం కంప్యూటర్లనుంచి, నేటి పామ్‌ టాప్‌ కంప్యూటర్ల దాకా సాంకేతికాభివృద్ధిని స్వయంగా చూశాను. అటు రచయితల కుటుంబ నేపథ్యం, ఇటు విజ్ఞానరంగం పరిచయం, అనుభవం ఈ రెండూ సైన్సు రచనలు చేయడానికి నాకు ఉపకరించాయి. రచనలు చేసేందుకు మాత్రం 1998 దాకా అవకాశాలు రాలేదు.
దిల్లీలో మహీధర నళినీమోహనరావుని ఎన్నోసార్లు కలిశాను. సైన్సు వ్యాసాలు రాయడంలో నాకు ఎన్నో విషయాలు చెప్పేవారయన. మా కార్యా లయంలోని గ్రంథాలయంలో కూడా సైన్సు పత్రికలూ, పుస్తకాలూ చాలా ఉండేవి. వాటితో రోజూ కనీసం ఒక గంట గడిపేవాడిని. నిజానికి దిల్లీనుంచి హైదరాబాదుకు వచ్చినపుడు రచనలపై నాకంత ఆసక్తి లేదు. కానీ, నాకు సైన్స్‌ అయినా, సాంఘికమైనా సూటిగా, సులభంగా ఎవరూ చెప్పట్లేదేంటనే వేదన ఉండేది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా సైన్సు కబుర్లు ఎవరూ ఎందుకు రాయట్లేదూ అని అనుకుంటూ ఉండే నాకు 1998లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో రాసే చక్కని అవకాశం వచ్చింది. 1998-99లో రెండేళ్ల పాటు విజయవంతంగా రాసి నేనూ సైన్సు రచయితనే అనిపించుకున్నాను. నా కంప్యూటర్‌ క్లాస్‌ శీర్షిక వ్యాసాలకు నాకు కార్టూనిస్ట్‌గా సహజంగా ఉన్న హాస్య గుణం తోడవడంతో వారంవారం కంప్యూటర్‌ పూర్వాపరాలూ, ప్రాథ మిక విజ్ఞానంపై అవగాహనా కల్పిస్తూ చాలా సరదాగా రూపొందింది. ప్రతి వారం ఒక వ్యాసం, ఒక జోకు, ఒక కార్టూన్‌, ఒక సామెత, ఒక తాజా వార్త అన్నీ కంప్యూటర్‌ సైన్సు పరమైనవే అందించాను. అదే సమయంలో ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం ఎడిటరు ప్రోత్సాహంతో సైన్స్‌ పరమైన ప్రత్యేక కథనాలు, సైన్స్‌ క్లబ్‌ అనే శీర్షికన ఏడాదిపైనే వివిధ సైన్సు వ్యాసాలూ అందిం చాను. 1999 ప్రాంతాల్లో బుడ్డిగ సుబ్బరాయన్‌, బి.మల్లిక్‌, పాండ య్యలు కంప్యూటర్‌ అక్షరాస్యతా కేంద్రం అనే దాన్ని ప్రారంభించినపుడు వారు ప్రోత్స హించగా నేను ట్రైనర్స్‌ ట్రైనింగ్‌ కూడా ఇచ్చాను. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టంలతో పనిచేయడం గురించి నోట్సు కూడా తెలుగులో రాసి ఇచ్చాను. అలా వారితో కలిగిన పరిచయం, నాతో తెలుగు అకాడమీకి 5 పుస్తకాలను రాయించింది. అన్నీ కంప్యూటర్‌ సైన్సుకు సంబంధించినవే. తర్వాత కంప్యూ టర్‌ శాస్త్ర నిఘంటువును ఒంటికాలి మీద నిలబడి పూర్తి చేశాను.
ఆ సమయంలో ఆంధ్రప్రభ ప్రత్యేక సంపుటాలు తెచ్చింది. వాటికోసం ఐటి ఉద్యోగాలు, ఇంటర్నెట్‌ వాడటానికి మార్గాలు – ఇలా రకరకాల వ్యాసాలు రాసి ఇచ్చాను. ఒక ఏడాది పాటు విండోస్‌ ఎలా వాడుకోవచ్చో ఆది వారం అనుబంధంలో రాశాను. రెండేళ్లపాటు వారంవారం ఒక పేజీ అర చేతిలో ఐటీ ప్రపంచాన్ని చూపించేలా కంప్యూటర్‌ వ్యాసాలు రాశాను. 2003లో కంప్యూటర్‌ విజ్ఞానం అనే మాసపత్రికలో వివిధ కంప్యూటర్‌ అంశాలపై కవర్‌ స్టోరీలను అందిస్తూ మొదలుపెట్టి దాదాపు 10 సంవత్సరాల పాటు వారికి రాశాను. తరవాత ఆంధ్రభూమి డైలీ యువ టాబ్లాయిడ్‌లో రెండేళ్లు నేను ఐటి పేజీ నిర్వహించాను. ఎన్నో సైన్సు అంశాలపై కవర్‌ స్టోరీలనూ రాశాను. పెద్దల కోసం నేను రాసిన కంప్యూటర్‌ కబుర్లు కూడా బాగా పాపులరైంది.
ఈ రచనా వ్యాసాంగంతో పాటు నేను ఆకాశవాణిలో కంప్యూటర్‌, సమాచార సాంకేతికత, సైన్స్‌ అంశాలకు సంబంధించి అనేక ప్రసంగాలు చేశాను. అప్పటికే కొన్ని వందల సైన్సు వ్యాసాలు రాయడం వల్ల నాకంటూ ఒక ప్రత్యేక పద్ధతిని ఏర్పర్చుకున్నాను. 2001 ప్రాంతాల్లో స్మార్ట్‌హోం అనే నా ప్రసంగం ఎన్నోసార్లు ప్రసారమైంది. 2007లో ఒక రోజు ఆకాశవాణికి 2 సైన్సు రూపకాలను రాయాలని కబు రందింది. ముఖ్యంగా చంద్రుడి మీద జరిగినన్ని ప్రయోగాలు వేరే ఏ గ్రహం మీద జరగలేదు. కమ్యూనికేషన్స్‌ రంగంలో విప్లవాత్మక మార్చులు వచ్చాయి. సైన్సు ఎలాంటి విజయాలను సాధించిందో తెలపడం కూడా ముఖ్యం. అలాగే, అంతరిక్ష యాత్రలు ఎన్నో జరిగాయి. భారతదేశం కూడా ఏ మాత్రం తీసిపోని విధంగా వైజ్ఞానిక జైత్ర యాత్రలు చేసింది. వీటన్నిటినీ చేయాలంటే 2 రూపకాలు కాదు. కనీసం 5, 6 రూపకాలు అవుతాయి అంటూ చెప్పేసరికి అంగీకరించి 30 నిమిషాల నిడివి గల 5 రూపకాలు చేయమని చెప్పారు. ఐఐటి బ్రెయిన్‌ డ్రైన్‌ లాంటి అంశాలనీ వాటిలో జొప్పించాను. విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన పరి శోధక విద్యార్థి పాత్రను ఒక రూపకంలో పెట్టాను. ఈ రూపకాలు రాయడానికి దాదాపు మూడు నెలలపాటు విషయ సేకరణపైనే దృష్టి పెట్టాను. ఎందరెందరో శాస్త్రవేత్తలతో, ఇంజనీర్లతో మాట్లాడాను. ఎందు కంటే, సమాచారం పోగేయడం ఒక ఎత్తు దానిని చదివి అర్థం చేసుకోవడం మరో ఎత్తు. అందుకే, సైన్సు రాసే రచయితలకి చాలా ఓపిక కావాలి. ఆమూలాగ్రం చదివి ఎంతవరకు పాఠకులకు, శ్రోతలకు అర్థమవుతుందో అంత మటుకే ఇవ్వాలి. అలాగే, మనం రాసే మాధ్యమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సైన్సు రచనలు చేయగలిగినవాడు ఏ రకమైన రచనలైనా చేయగలడనేది కొందరికే తెలుసు. రీజనింగ్‌తో, సరైన ఆధారాలతో సరైన సమాధానాన్ని సైన్సు అందిస్తుంది. అందువల్ల మనం చెప్పదలుచుకుంది క్లుప్తంగానైనా సరే, వివరంగానైనా సరే, సూటిగా చెప్పాలి. జనం కోరేది మనం చెప్పగలగాలి. దానికి సరైన భాష వాడాలి. మన వ్యక్తీకరణలో స్పష్టత ఉండాలి. అప్పుడు పాఠకుడే మన రచనల కోసం ఎదురు చూస్తాడు.
ప్రాచీనకాలం నాటికే మన భారత దేశంలో సైన్సు ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలియజెప్పాలని ఉంది. మన ప్రాచీనమైన భారతీయ పరిజ్ఞానం, విజ్ఞానం అపారం. వాటిని నేటి కాలానికి అనుగుణంగా చెప్పాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఎందుకంటే, నేడు సైన్సు పేరిట ప్రయోగాలు చేస్తూ ప్రకృతితో మనిషి ఆడుకొంటున్నాడు. ప్రకృతికి విరుద్ధంగా ఎన్నో పనులు చేస్తున్నాడు. అందువల్లే ప్రకృతి కూడా మనుషులతో ఆడుకొంటోంది. అందరూ ఇది తెలిసి మసలుకోవాలి. ఏం చేస్తే మానవాళి సంక్షేమంగా ఉంటుందో అందరికీ తెలియజెప్పే రచనలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది.

డా. నాగసూరి వేణుగోపాల్‌, జి. మాల్యాద్రి సంపాదకత్వంలో విజ్ఞాన ప్రచురణలు 2017లో వెలువరించిన ‘‘సైన్స్‌ ఎందుకు రాస్తున్నాం’’ సంకలనం నుంచి’’

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img