Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

స్వాతంత్య్ర ఫలాలకు ప్రమాదం

కృష్ణ రaా

స్వాతంత్య్ర దినోత్సవం మన ముంగిట ఉంది. ఈ పండగ జరుపు కునేందుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. కరుడు కట్టిన బ్రిటిష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా కుల, మత, వర్గాలకు అతీతంగా జనులంతా ఒక్కటైనిలిచి విజయంసాధించిన దేశం మన భారతదేశం. అహ్మదాబాద్‌లో 1921లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో హస్రత్‌ మొహానీ సంపూర్ణ స్వాతంత్య్రం డిమాండ్‌ను లేవనెత్తారు. హస్రత్‌ మొహానీ 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నాయకుడు అయ్యారు. ఇదే డిమాండ్‌ను కాంగ్రెస్‌ పార్టీ 1929లో డిసెంబరు 19వ తేదీన లాహోర్‌లో జరిగిన సమావేశంలో లేవనెత్తింది. బ్రిటిష్‌ వారు చెబుతున్న స్వయం ప్రతిపత్తి హోదాను వ్యతిరేకిస్తూ ఈ డిమాండ్‌ తీసుకొచ్చింది. 1930 జనవరిలో ఆఖరి ఆదివారం (జనవరి 26) నాడు పూర్ణ స్వరాజ్‌ తీర్మానాన్ని ఆమోదించింది.
1950లో జనవరి 26వ తేదీన మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. తర్వాత ఇదే రోజును గణతంత్ర దినోత్సవంతో పాటు రాజ్యాంగ దినోత్సవంగానూ ప్రకటించారు. స్వాతంత్య్ర పోరాటం మునుపెన్నడూ ఎరుగని ఉద్యమం. అయినా అన్యాయ పాలనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమించేలా ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. ఈ పోరాటం ప్రతి దశా మరో అడుగు ముందుకేసేందుకు పునాది అయింది. చివరకు ప్రజాస్వామ్య నిర్మాణం ఏర్పడిరది. దశలవారీగా జరిగిన ఈ పోరాటం గొప్ప ఉద్యమం మాత్రమే కాదు శత్రువుకు వెన్నులో వణుకు పుట్టించింది అని తర్వాత కాలంలో గ్రాంసీ వివరించారు.
భారత జాతి దాస్య శృంఖలాలను తెంచేందుకు, ఈ దేశాన్ని ఒక్కటిగా నిలిపేందుకు శతాబ్ద కాలం క్రితం 1857లో మొఘల్‌ బాద్‌షా బహదూర్‌ షా జాఫర్‌ నాయకత్వంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని ప్రకటించారు. ఆ తర్వాతే ఒక కొత్త దశ మొదలైంది. స్వాతంత్య్ర సంగ్రామం ఊపందు కుంది. ఈ పోరాటంలో దాదాపుగా ప్రతి సందర్భమూ ఒక మహో ద్యమంగా మారింది. ఆధిపత్యశక్తుల పెత్తనాన్ని, అవి తీసుకొచ్చిన నిరంకుశ విధానాలను ఒక్కొటొక్కటిగా నాశనం చేస్తూ రాజకీయ, సిద్ధాంతపరమైన పరిణామ మార్పుల కోసం అవసరమైన వాతావరణాన్ని సృష్టించుకున్నాయి. అత్యంత కఠినమైన ఈ పోటీలో అనేకసార్లు ఓటమి కూడా ఎదురైంది. స్వాతంత్య్రం కోసం పోరాడేందుకు కార్మికులు, కర్షకులు చేతులు కలిపారు. దీంతో మధ్యతరగతి వర్గంతో కూడిన నూతన మేధావి వర్గం అవతరించింది.
1947లో ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్య్రం వచ్చింది. ఆ వెంటనే మనం రూపొందించుకున్న రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సోషలిజం అమలుచేసారు. శాస్త్రీయ దృష్టి మూలాలతో సంస్థలను ఏర్పాటు చేశారు. మౌలిక అవసరాలను తీర్చేలా ప్రభుత్వ రంగాన్ని నిర్మించారు. ప్రజలకు ఉద్యోగ, ఉపాధులను కల్పించారు. వర్తమాన, భవిష్యత్‌తరాలను సుసంపన్నులను చేసేలా విద్యాసంస్థలను తీసుకొచ్చారు. ఇదంతా సామాజికఆర్థిక సామరస్య దృక్కోణం ఏర్పడేందుకు దోహదపడిరది. ఈ క్రమంలో కొన్ని తప్పులూ జరిగాయి, ఓటములనూ చూశాం. సవాళ్ళు ఎన్నున్నా వాటిని తరచుగా అధిగమిస్తూ వచ్చాం. ప్రస్తుత పరిస్థితి చూస్తే... మన ప్రజాస్వామ్య సంప్రదాయాలకే ముప్పు ఏర్పడిరది. అన్నీ బీటలు వారుతున్నాయి. సమాజంలో చీలికలు ఏర్పడుతున్నాయి. ఏ కొద్దిమందో మినహా మొత్తం ప్రజలంతా నానా యాతనలు పడుతున్నారు. కనీస అవసరాలూ తీరక తీవ్ర బాధలకోర్చు తున్నారు. ఆఖరికి ఆక్సిజన్‌ కొరతా వేధిస్తోంది. రెండేళ్లుగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి వల్ల పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోయారు. చావు లెక్కల్లోనూ ఉదాసీనతే వెక్కిరిస్తోంది. కొవిడ్‌19 దేశానికి పెను విషాదం మిగిల్చింది. మహమ్మారి కాలంలో అదనపు చావులు (సాధారణంగా ఉండే మరణాలు కాకుండా) 49 లక్షలు ఉంటాయని ఒక అంచనా. కరోనా వైరస్‌ వల్ల మరణాలు అధికారిక లెక్కలను మించి మరిన్ని లక్షలు ఉంటాయనడానికి ఆధారాలు ఉన్నాయని తాజా సర్వే ఒకటి ప్రకటించింది. కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుండి ఈ ఏడాది జూన్‌ వరకూ జరిగిన (ఒక్క కరోనా కారణంగానే కాకుండా) అన్ని రకాల మరణాల లెక్కలను తెలియజేస్తూ వాషింగ్టన్‌కి చెందిన అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం నివేదికను విడుదల చేసింది. కొవిడ్‌ కారణంగా 4,14,000 మంది చనిపోయారని భారత్‌ అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం చూసినా అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ప్రపంచ కరోనామరణాల్లో భారత్‌ మూడోస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా మరణాలరేటును నిశితంగా పరిశీలించాలన్న డిమాండ్‌ నిపుణులనుంచి వినిపిస్తోందని కూడా ఈ అధ్యయనం పేర్కొంది.
ఇప్పుడు విద్య, వైద్యమే కాదు ఆఖరికి రాజ్యాంగంలోని మౌలిక హక్కులకూ ముప్పు ఏర్పడిరది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. అసహేతుకత దేశమంతా వ్యాపించి ఉంది. ప్రతి నెలా ధరలు పెరుగుతుండడంతో ప్రత్యేకించి ఇంధన ధరలు ఎగబాకుతుండడంతో సాధారణ జీవన పరిస్థితులు దిగజారిపోతున్నాయి.
నిర్ధారిత పని గంటలను మించి ఎక్కువ పని గంటలు అర్ధాకలితోనే శ్రమటోడుస్తున్న కార్మికులకు అందుతున్న ప్రతిఫలం అతి స్వల్పం. పేరుకి ఉపాధి ఉన్నా జీవనం దుర్భరమే. ముంచేస్తున్న దారిద్య్రం ఎన్నో ప్రశ్నలకు దారితీస్తోంది. అన్యాయం, అసమర్థ నిర్వహణ తదితరాలను నిలదీస్తోంది. మొత్తంగా ఈ దుస్థితి ప్రజల్లో అంతులేని ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇందుకు రైతుల ధర్నాయే ఒక మంచి ఉదాహరణ. అన్ని వయస్సులకు చెందిన మహిళలు, పురుషులు కలిసి పెద్దస్థాయిలో జనం ఎంతోఓర్పుతో రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. ప్రజా పార్లమెంట్‌ని నిర్వహించి వారి డిమాండ్లను వినిపిస్తున్నారు. ఉత్పాదక పెట్టుబడి లేని పరిస్థితుల్లో, బ్యాంకులు బానిసలుగా మారిపోతున్న క్రమంలో అత్యంత క్రూరంగా, కిరాతకంగా ద్రవ్య పెట్టుబడి వైపుగా నడుస్తున్న పరిణామాల మధ్య వర్గ పోరాటచరిత్రలో దాదాపుగా అత్యంత ప్రాధాన్యతాదశను వారు నిర్మించారు.
వ్యక్తిగత గోప్యతా హక్కు పైనా దాడి జరుగుతోంది. గోప్యత అంటే అర్థం ఆలోచించే హక్కు, ఒకరు తాము తెలుసుకున్న, తమ సొంత పరిజ్ఞానం, అవగాహనతో భావ సముదాయాలను రూపుదిద్దుకోవడం. ఈ వాస్తవాలను పరిశీలిస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ ఏ మేరకు జరుగుతోందో అంచనా వేయవచ్చు. ఇట్లాంటి స్వేచ్ఛను ఎవరూ జవాబుదారీగా లేని నిఘా పేరుతో హరించేశారు. బాధితుల జీవితాల్లో అన్ని రకాలుగా జోక్యం చేసుకునే అధికారం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పెగాసస్‌ స్పైవేర్‌ రహస్య చర్యలకు వ్యతిరేకంగా ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేళ పోరాటం చేయాల్సిన అత్యావశ్యకత మన ముందు ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img