Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

విద్యా సామర్థ్యాలతో పెరగని బోధన

డా. ముచ్చుకోట సురేష్‌ బాబు
గత నవంబరులో దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే 2021’లో 3, 5, 8, 10 తరగతి విద్యార్థులకు తరగతి వారీ సామర్థ్యా లపై అధ్యయనం జరిగింది. ఈ సర్వే ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి విద్యార్థులకు కూడా సరిగా చదవడం, రాయడం రావడం లేదు. ఇంగ్లీష్‌లో పదాలను, వాక్యాలను సొంతంగా చదవలేకపోతున్నారు. ఈ పరిస్థితి కేవలం ప్రభుత్వ బడులకు వెళ్ళే విద్యార్థులదే కాదు. తల్లి దండ్రులు కాయకష్టం చేసి ప్రైవేటు బడులలో నాణ్యమైన విద్య అందు తుందనే ఆశలతో భారీ ఫీజులు చెల్లిస్తే, ప్రైవేటు బడులకు వెళుతున్న పిల్లల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థులు 50 శాతం, ప్రైవేటులో చదువుతున్న విద్యార్థులు 47 శాతం మంది మాత్రమే సరైన సమాధానాలు రాశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థు లకు, పట్టణ ప్రాంత విద్యార్థులకు, బాలికలకు, బాలురకు కూడా విద్యా సామర్థ్యాలు పొందడంలో పెద్ద తేడా ఏమీ కనపడలేదు.
ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల పిల్లలలో అభ్యసన లోపాలు ఇంకా ఎక్కువగా ఉన్నట్లుగా ఈ నివేదిక బయట పెట్టింది. మొత్తంగా చూస్తే జాతీయ స్థాయి నివేదిక ప్రకారం దాదాపు 50 శాతం విద్యార్థులు కనీస అభ్య సన సామర్థ్యాలు పొందడం లేదు. జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు అన్ని తరగతుల విద్యార్థుల సామర్థ్యాలు అట్టడుగున ర్యాంకులో ఉండడం విచారకరం. దీనిని ఒక విద్యా ఎమర్జెన్సీగా భావించాలి. ఇలా నివే దికలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరం ఆరంభంలో ‘త్రీ ఆర్స్‌’ అని లేదా మరో పేరుతో ఒక పదిహేను రోజుల తంతు జరిపి మళ్ళీ యథాస్థితి పరిస్థితిని ఉంచుతుంది తప్ప ఒక మౌలికమైన ప్రణాళికను ఎప్పుడూ అమలు చేయడం లేదు. విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించడం లేదని నివేదికలు మీద నివేదికలు వస్తూనే ఉన్నాయి. తరగతి స్థాయికి తగ్గ సామర్థ్యాలకు విద్యార్థులు ఎంతో దూరంలో ఉన్నారని యునిసెఫ్‌, ప్రపంచ బ్యాంకు నివేదికలు ఇచ్చాయి. నేర్చుకోవ డంలో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు ఇవ్వాలని, ఎప్పటిలాగా మామూలు స్థితిలో కాకుండా ప్రత్యేక ప్రణాళికలు వేయాలని పలు నివేదికలు తెలియచేస్తున్నాయి అయినా అటుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు లేవు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పిల్లలే ఎక్కువగా ఈ దుస్థితిలో ఉంటున్నారని కూడా ఈ నివేదికలు సూచిస్తున్నాయి. విద్య పరిరక్షణ కమిటీ సభ్యులు బడులలో సామాజిక తనిఖీలు చేసినప్పుడు విద్యార్థులు చదువులో తరగతి వారి సామర్థ్యాలలో ఇంకా వెనుకబడి ఉన్నారని వెల్లడవుతోంది. ఇటీవల వీరు నిర్వహించిన సర్వే ప్రకారం 3వ తరగతి నుంచి 6వ తరగతి దాకా చదివే పిల్లలలో 52 శాతం మంది విద్యార్థులు తేలిక పదాలు కూడా రాయలేకపోయారని, 56 శాతం మందికి కూడికలు, తీసివేతలు చేయడం రాలేదని తెలిసింది. సామాజిక తనిఖీలో 190 మంది విద్యార్థులలో మూడవ తరగతి స్థాయి ప్రశ్నలకు కేవలం 19 మంది పిల్లలు మాత్రమే తప్పులు లేకుండా పూర్తిగా రాయగలిగారు. అలాగే నలుగురు విద్యార్థులు మాత్రమే గణితం ప్రశ్నపత్రాన్ని పూర్తి చేయగలిగారు. ఇంగ్లీషులో ముగ్గురు విద్యార్థులు మాత్రమే పూర్తిగా రాయగలిగారు. ఈ పరిస్థితిని చూసి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు. విద్యా సామర్థ్యాలు అందడం లేదని 2017లో ఇదే విషయమై ప్రధాన న్యాయస్థానంలో ప్రజావ్యాజ్యం కూడా దాఖలయింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా కోర్టుకు సమర్పించిన నివేదికలు ఏదో మొక్కుబడిగా ఉన్నాయే తప్ప ఈ పరిస్థితిని అంత గంభీరంగా పరిగణించినట్లు ఏ మాత్రం కనిపించలేదు. విద్యార్థులలో విద్యా సామర్థ్యాల లోపం ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో విఫల మయ్యామని ఈ సర్వేల ఆధారంగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే దీనికి సరైన సమాధానం దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల రూపురేఖలు మారుస్తామంటూ ప్రారంభించిన నాడు నేడు పథకం వైసీపీ నేతల ఆర్థిక పరిస్థితిని మార్చిందని, నాడు నేడు పేరుతో పార్టీ నాయకులకు కాంట్రాక్టుల రూపంలో ప్రభుత్వ నిధుల్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు అవసరం ఉన్నా లేకపోయినా పేజీలకు పేజీల పత్రికా ప్రకటనలతో ప్రభుత్వ సొమ్ముని వృధా చేస్తున్నది. మూడు నాలుగు వేలు చేయని బెంచి ఖరీదు ఎనిమిది వేల ఐదు వందలు, నీటి కొళాయిలు వెయ్యి రూపాయలు పెట్టి కొనడం, ఎలక్ట్రిక్‌ సామాన్లు ఖరీదు పెట్టి కొనడం, అంతా కేంద్రీకరణ సేక రణ వ్యవస్థ ద్వారా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరేదిగా ఉంటున్నది. నాణ్యమైన విద్యలో ప్రభుత్వం 19వ స్థానానికి దిగజార్చారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల శాతం తగ్గిపోయింది, అమ్మ ఒడి పథకం ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇవ్వడంతో పిల్లలు ప్రైవేటు స్కూల్‌ బాట పడుతున్నారు. జీవో 117 ఆర్టీఈ చట్టానికి విరుద్ధంగా ఉంది, దీని వల్ల 60 వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దవుతాయి. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలి. ఇంగ్లీష్‌ మాధ్యమానికి టీచర్లు వ్యతి రేకం కాదు. ప్రాథమిక తరగతులు మాతృభాషలో కొనసాగితే విద్యార్థుల్లో వికాసం బాగుంటుంది. రెండు మాధ్యమాలనూ కొనసాగించి, 3,4,5 తర గతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడాన్ని ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలి. సీబీఎస్‌ఈ, ఆంగ్ల మాధ్యమం, అంగన్‌వాడీల మార్పు, ప్రాథమిక పాఠశాలలు ప్రశ్నార్థకం ఇలా రకరకాల తుగ్లక్‌ విధానాలతో విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.

వ్యాస రచయిత ప్రజా సైన్సు వేదిక రాష్ట్ర అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img