Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

రసాభసగా సర్వ సభ్య సమావేశం

-ప్రజా సమస్యలపై జరగని చర్చ

  • యథాప్రకారంగా వివాదస్పదంగానే ఎంపీడీవో తీరు
  • టైంపాస్ ఎంపీడీవో’పై జడ్పీటీసీ సభ్యురాలు ఆగ్రహం

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : మండల సర్వసభ్య సమావేశం మరోసారి రసాభసగానే ముగిసింది . సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే విమర్శలు , ప్రతివిమర్శలు , వ్యంగ్యపు వ్యాఖ్యల నడమ సమావేశం ముగిసింది . సభ్యులు కూడా ఇలావచ్చి ఘర్షణపడి అలా వెళ్లిపోయారు . దీంతో సమావేశం జరిగిందీ అనిపించి ముగించారు . అయితే సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదు . బుధవారం ఉదయం 11.30 గంటలకు ముందుగా సమావేశం ప్రారంభమైంది . ఎంపీపీ నలమలపు అంజమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా ఎంపీడీవో ప్రారంభోపన్యాసం చేశారు . అనంతరం జడ్పీటీసీ సభ్యురాలు యాదాల రత్నభారతి మాట్లాడుతూ .. ఎంపీడీవో వ్యగ్యంగా మాట్లాడడంపై విమర్శలు గుప్పించారు . సమావేశానికి ముందు మర్యాద పూర్వకంగా పలకరించిన సమయంలో ఎంపీడీవో తనది టైంపాస్ ఉద్యోగమని వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలన్నారు . ఇన్చార్జ్ ఉన్నప్పటికీ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు . గ్రూప్ -1 అధికారులు సైతం జవాబిదారిగా ఉంటారన్నారు . ప్రజాప్రతినిధులతో ఎలా నడుచుకోవాలో తెలియదా … ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇదే క్రమంలో సమావేశంలోని జడ్పిటిసి మాట్లాడుతుండగా ఓ నామినేటెడ్ ప్రజాప్రతినిధి ఇక చాలు అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు . ఈ క్రమంలో కొద్దిపాటి గందరగోళం నెలకొంది . అనంతరం వైద్యశాఖలో పురోగతిపై వైద్య అధికారి వివరిస్తుండగా , సదరు అధికారిని ఎంపీడీవో శ్రీనివాసరావు డయాస్ దిగి మాట్లాడాలని వ్యాఖ్యానించారు . దీనిపై సదరు అధికారి కూడా ఎంపీడీవో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు . తాను కూడా గజిటెడ్ అధికారినేని ప్రగతి నివేదికలు తెలియజేసే సమయంలో కనీసం మర్యాద ఇవ్వాలని సదరు ఉద్యోగి ఎంపీడీవోను వ్యాఖ్యానించడం గమనార్హం . ఇక ఇదే క్రమంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు వివిధ పనులకు సంబంధించి తీర్మానాలివ్వాలని కోరారు . శాఖల సమీక్ష అనంతరం దీనిపై చర్చిద్దామని ఎంపీపీ పేర్కొనగా , కొంత మంది ఆహ్వానితులు గందరగోళ పరిచారు . దీంతో సమావేశం మధ్యలోనే ముగిసింది . సమావేశాన్ని ముగిస్తూ ఎంపీపీ , జడ్పీటీసీలు కిందికి వెళ్లారు . దీంతో పలువురు సభ్యులు తమకు మెజారిటీ ఉందని తాము అడిగిన తీర్మానాలు తమకు ఇవ్వాలని పట్టుబట్టారు . ఆ మేరకు మరోసారి సమావేశాన్ని నిర్వహించాలని ఎంపీడీవోకు అర్జీ ఇచ్చారు . దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ , ఎంపీపీ అనుమతితో మరోసారి సమావేశం నిర్వహించాలని ఆయన కూడా పేర్కొన్నారు . అనంతరం తన చాంబర్ కు వెళ్లారు . సభ్యులు కూడా తిరిగి వెళ్లిపోయారు . ఇక సమావేశానికి ప్రత్యేకాధికారి అంజలీ హాజరయ్యారు . అనంతరం తన చాంబర్లో ఎంపీడీవో మాట్లాడుతూ .. ప్రభుత్వాధికారులుగా తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img