Monday, December 5, 2022
Monday, December 5, 2022

నేటి నుంచి ‘టెస్ట్‌’ సిరీస్‌

కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎదురైన పరాభావం నుంచి పాఠాలు నేర్చుకున్న కోహ్లిసేన మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో భారత్‌ వేదికగా ఎదురైన వరుస పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని జోరూట్‌ సేన చూస్తోంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌తో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది.

మయాంక్‌ ఔట్‌.. రాహుల్‌ ఇన్‌..
రెండు జట్లకూ తప్పని గాయాల బెడద

విశాలాంధ్ర స్పోర్ట్స్‌ డెస్క్‌ : భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే ప్రతిష్టాత్మక వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్‌కు తెరలేవనుంది. దాంతో ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అంతేకాకుండా సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడిరచేందుకు కోహ్లీసేన తహతహలాడుతోంది. తాజా ఈ రెండు జట్లూ గాయలబారిన పడ్డాయి. టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తూ గాయపడటం జట్టు కూర్పును దెబ్బతీసినట్టయింది. అతని స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను రోహిత్‌ శర్మకు ఓపెనర్‌ జోడీగా పంపించనుంది టీమిండియా మేనేజ్‌మెంట్‌. విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానే, చతేశ్వర్‌ పుజారా, రిషభ్‌ పంత్‌లు మిడిలార్డర్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌కు చోటు ఖాయం. ఫస్ట్‌ టెస్ట్‌కు గ్రీన్‌ వికెట్‌ సిద్దం చేస్తున్న నేపథ్యంలో భారత్‌ నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌ సామర్థ్యం కలిగిన శార్దూల్‌ ఠాకూర్‌కు చోటు దక్కడం ఖాయం. ఇషాంత్‌ శర్మ, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌లో ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కనుంది. స్వింగ్‌ నేపథ్యంలో సిరాజ్‌కు ప్రాధన్యత ఇచ్చే అవకాశం ఉంది. జస్‌ప్రీత్‌ బుమ్రా పేస్‌ విభాగాన్ని లీడ్‌ చేయనున్నాడు.అటు ఇంగ్లండ్‌ జట్టు కూడా గాయాలతో సతమతమౌతోంది. ఇప్పటికే ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ జట్టు నుంచి వైదొలిగాడు. భారత్‌ మీద అన్ని రకాల ఫార్మాట్లను ఆడిన క్రికెటర్‌ అతను. తొలిసారిగా బెన్‌ స్టోక్స్‌ లేని ఇంగ్లండ్‌ జట్టు బలమైన టీమిండియాను ఎదుర్కొనబోతోంది. కౌంటీ క్రికెట్‌ టీ20 టోర్నమెంట్‌లో సర్రే బ్లాస్ట్‌ తరపున మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో గాయపడ్డ ఒల్లీ పోప్‌.. తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. తొడ కండరాల నొప్పితో అతను ఇబ్బంది పడుతున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల కోసం అతనికి విశ్రాంతి ఇవ్వొచ్చని బ్రిటీష్‌ మీడియా తెలిపింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో విఫలమైన జాక్‌ క్రాలీ, డామ్‌ సిబ్లేల్లో ఒకరికి జోడీగా ఒల్లీ పోప్‌ను క్రీజ్‌లోకి దించాలనేది ఇంగ్లండ్‌ వ్యూహం. అతను ఫిట్‌గా లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. 19 టెస్ట్‌ మ్యాచ్‌లను ఆడిన ఒల్లీ పోప్‌ 882 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. భారత్‌తో ఆరు టెస్ట్‌ మ్యాచ్‌లను ఆడాడతను. ఇప్పటిదాకా సగటున 18.82తో 207 పరుగులు చేశాడు. భారత్‌ మీద ఆడిన అనుభవం ఉన్నందు వల్ల పోప్‌తో ఇన్నింగ్‌ను ఆరంభించాలని భావించినా.. చివరి నిమిషంలో అది తేడా కొట్టినట్టయింది. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టులో జాక్‌ క్రాలే, డామ్‌ సిబ్లె, హసీబ్‌ హమీద్‌, జో రూట్‌, జానీ బెయిర్‌స్టో, జోస్‌ బట్లర్‌, సామ్‌ కుర్రన్‌, జాక్‌ లీచ్‌/డామ్‌ బెస్‌, మార్క్‌ వుడ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌లో చోటు దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. వారిలో దాదాపు కొత్త ముఖాలే జట్టులో కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img