Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంజాబ్‌కు రాంరాం..

హైదరాబాద్‌: ఎప్పటిలానే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్లో కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌కు భారీ షాక్‌ తగలనుందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. కెప్టెన్‌గా టీమ్‌కు పెద్దగా విజయాలు అందించలేకపోయినా.. బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్న కేఎల్‌ రాహుల్‌ వచ్చే సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడడని ఓ క్రీడా ఛానెల్‌ పేర్కొంది. ఇదే నిజమైతే కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలినట్టే. ఎందుకంటే.. నాలుగు సీజన్లుగా పంజాబ్‌ తరపున 600లకు పైగా పరుగులు చేస్తున్న ఏకైక బ్యాటర్‌ రాహుల్‌ ఒక్కడే. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లలో రాహుల్‌ 626 పరుగులు చేశాడు. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో అతడే టాప్‌లో ఉన్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌కు గుడ్‌బై చెప్పి.. ఐపీఎల్‌ 2022 కోసం జరగనున్న మెగా వేలంలోకి వెళ్లాలని రాహుల్‌ భావి స్తున్నట్లు సమాచారం తెలిసింది. ఐపీఎల్‌ 2022లో రెండు కొత్త జట్లు రానున్న నేపథ్యంలో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. మెగా వేలం జరిగితే.. ప్రతి ఫ్రాంచైజీ కేవలం ముగ్గురు ప్లేయర్స్‌ను రిటేన్‌ చేసుకొని, మిగతా అందరినీ వదిలేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ లాంటి ప్లేయర్‌ను రిటేన్‌ చేసుకోవడానికి పంజాబ్‌ ఆసక్తిగానే ఉన్నా.. అతడు అందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. కారణం ఇతర ప్లేయర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ చేరుకోవడంలో విఫలమవుతోంది. రాహుల్‌ పెవిలియన్‌ చేరితే తరువాత జట్టును ఆదుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఒక రాహుల్‌ ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో పాల్గొంటే.. అతనికి భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అతన్ని పలు ఇతర ఫ్రాంచైజీలు సంప్రదించినట్టు సమాచారం. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అతడిని జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలిసింది. చూడాలి ఏం జరుగుతుందో.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img