test
Monday, May 27, 2024
Monday, May 27, 2024

సనత్‌నగర్‌లో బాలుడి హత్య కేసులో వీడిన మిస్టరీ.. చిట్టీల వ్యాపారంలో గొడవే హత్యకు కారణం

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడి మర్డర్‌ మిస్టరీ వీడింది. బాలుడి హత్యకు పాల్పడిన హిజ్రా ఇమ్రాన్‌తో సహా నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అమావాస్య నాడు బాలుడి హత్య జరగడంతో నరబలి అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ హత్యకు నరబలికి సంబంధం లేదని డీసీపీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బాలుడి తండ్రికి, హిజ్రాకు మధ్య ఉన్న గొడవల కారణంగా హత్య జరిగిందని వెల్లడించారు. సనత్‌నగర్‌కు చెందిన బట్టల వ్యాపారి వసీం ఖాన్‌ కుమారుడు అబ్దుల్‌ వహీద్‌ (8) గురువారం సాయంత్రం నమాజ్‌ చేయడానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. మసీద్‌కు వెళ్లిన బాలుడు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు అతని కోసం చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఎక్కడా బాలుడు కనిపించలేదు. దీంతో సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అల్లావుద్దీన్‌ కోటి ప్రాంతంలో ఉన్న జింకలవాడ నాలాలో అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడిని దారుణంగా హత్య చేసి ఎముకలు విరిచి ఒక బకెట్‌లో పెట్టి ఉండటం చూసి అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అమావాస్య నాడు ఈ హత్య జరగడంతో బాలుడిని నరబలి ఇచ్చి ఉంటారని ప్రచారం జరిగింది. అదే ప్రాంతంలో ఉంటున్న ఇమ్రాన్‌ అనే హిజ్రా బాలుడిని తీసుకెళ్లడం చూసిన స్థానికులు తానే ఈ నరబలి ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. స్థానిక మసీదు దగ్గరలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఇమ్రాన్‌ అనే హిజ్రా.. వహీద్‌ను వెంటబెట్టుకుని వెళ్లడం రికార్డయ్యింది. దీంతో బాలుడి బంధువులు, స్థానికులు హిజ్రా ఇంటిపై దాడి చేశారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు హిజ్రాను అరెస్టు చేశారు. హిజ్రాతో పాటు అతనికి సహాయపడ్డ మరో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

చిట్టీల వ్యాపారంలో గొడవే హత్యకు కారణం
ఇమ్రాన్‌ అనే హిజ్రా స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తుంది. ఆ హిజ్రా దగ్గర బాలుడి తండ్రి వసీం చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించి డబ్బుల వ్యవహారంలో ఇద్దరి మధ్య ఇటీవల వాగ్వాదం జరిగింది. ఆ గొడవతో ఆగ్రహానికి గురైన హిజ్రా.. బాలుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదే విషయాన్ని డీసీపీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. బాలుడి హత్యకు నరబలికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img